పొగ మానండిలా..

పొగతాగే అలవాటు ఆరోగ్యానికి పెద్ద శత్రువు. ఇది గుండెజబ్బుల ముప్పును పెంచుతుంది. నోటి, ఊపిరితిత్తి క్యాన్సర్లకూ ఇదే మూల కారణం.

Published : 09 May 2023 00:23 IST

పొగతాగే అలవాటు ఆరోగ్యానికి పెద్ద శత్రువు. ఇది గుండెజబ్బుల ముప్పును పెంచుతుంది. నోటి, ఊపిరితిత్తి క్యాన్సర్లకూ ఇదే మూల కారణం. కాబట్టి పొగ అలవాటును వెంటనే మానెయ్యటం మంచిది. ఎప్పుడు మానేసినా అప్పటి నుంచే దీని ప్రయోజనాలు మొదలవుతాయి.

సిగరెట్లు, చుట్టలు, బీడీలను మానెయ్యటానికి గట్టి సంకల్పం, ప్రయత్నం అవసరం. సాధారణంగా పొగాకులోని నికోటిన్‌ మెదడులో డోపమిన్‌ అనే రసాయనం విడుదలయ్యేలా పురికొల్పుతుంది. ఇది ఆనందాన్ని కలిగిస్తుంది. క్రమంగా మరింత ఎక్కువ నికోటిన్‌ తీసుకునేలా చేస్తుంది. చివరికిదొక వ్యసనంగా మారుతుంది. పొగ తాగటం మానేసినప్పుడు శరీరంలో నికోటిన్‌ తగ్గుతుంది. అప్పుడు నిరాశా, నిస్పృహ వంటి లక్షణాలు మొదలవుతాయి. దీంతో చాలామంది తిరిగి సిగరెట్లు కాల్చటం మొదలెడుతుంటారు. అందువల్ల ప్రణాళికా బద్ధంగా ప్రయత్నిస్తే ఫలితం కనిపిస్తుంది.
* ముందుగా పొగ మానెయ్యాలని గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయాన్ని సన్నిహితంగా మెలిగే కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఆత్మీయులకు చెప్పాలి.
* తర్వాత ఒక తేదీని నిర్ణయించుకోవాలి. దీని విషయంలో నిజాయతీ అవసరం. ప్రణాళికను అమలు పెట్టటానికి తగినంత సమయం ఉండేలా చూసుకోవాలి.
* అనంతరం ప్రోత్సహించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు తమతో పాటు పొగ మానేసేవారిని ఎంచుకోవచ్చు. ఇలాంటి ప్రయత్నం చేసేవారితో కూడిన సామాజిక మాధ్యమ గ్రూపులో చేరొచ్చు.
* పొగ తాగటాన్ని ప్రేరేపించే సందర్భాలనూ గుర్తించాలి. కొందరికి కారు నడుపుతున్నప్పుడు సిగరెట్‌ కాల్చాలని అనిపించొచ్చు. ఏదో ఒక పని చేస్తున్నప్పుడో, ఒత్తిడిలో ఉన్నప్పుడో కోరిక కలగొచ్చు. ఇలాంటి ప్రేరకాలను గుర్తించి, వాటికి పూర్తిగా దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
* పొగ మానేసిన తర్వాత తలెత్తే నిరాశ, నిస్పృహ వంటి లక్షణాలను నియంత్రించుకోవటమెలాగో ఆలోచించుకోవాలి.
ఆరోగ్యకరమైన చిరుతిండి దగ్గర ఉండేలా చూసుకోవాలి. సిగరెట్‌ తాగాలని అనిపించినప్పుడు దీన్ని కాస్త తినొచ్చు. ధ్యానం చేసినా మంచిదే. ఇతరులకు మేలు చేసే పనుల్లో, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి.
* అవసరమైతే నికోటిన్‌ ప్యాచ్‌లు, గమ్‌, బిళ్లలు, ఇన్‌హేలర్‌ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులనూ ఆచరించాలి. ఇవి నికోటిన్‌ను భర్తీ చేస్తూ సిగరెట్లు కాల్చాలనే కోరికను తగ్గిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని