మంచి నిద్రకు మార్గం

పగటి పూట ఏదో కాసేపు కునుకు తీస్తే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఎక్కువసేపు పడుకుంటే రాత్రి పూట నిద్ర అవసరం తగ్గుతుంది. ఒంట్లో జీవ గడియారమూ గతి తప్పుతుంది.

Updated : 06 Jun 2023 05:26 IST

మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి. సరైన కారణాన్ని గుర్తిస్తే సరిదిద్దుకోవచ్చు.

పగటి నిద్ర: పగటి పూట ఏదో కాసేపు కునుకు తీస్తే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఎక్కువసేపు పడుకుంటే రాత్రి పూట నిద్ర అవసరం తగ్గుతుంది. ఒంట్లో జీవ గడియారమూ గతి తప్పుతుంది. దీంతో పగటి పూట చురుకుగా, రాత్రి పూట నిద్ర వచ్చే ప్రక్రియ అస్తవ్యస్త మవుతుంది. కాబట్టి నిద్ర సమస్యలతో బాధపడేవారు పగటి నిద్రను మానేస్తే మంచిది.

రాత్రుళ్లు ఎక్కువసేపు పని: రోజంతా పనిచేయటానికి మనమేమీ యంత్రాలం కాదు. పనులతో సతమతమైన మనసుకు, కండరాలకు విశ్రాంతి తప్పనిసరి. అప్పటి వరకూ మనల్ని చురుకుగా ఉంచిన అడ్రినలిన్‌ హార్మోన్‌ మోతాదులు తగ్గుముఖం పట్టేలా చూసుకోవాలి. అంటే పడుకోవటానికి కొద్ది గంటల ముందే శరీరాన్ని నిద్రకు సన్నద్ధం చేయాలన్నమాట. అందువల్ల ఏ పనీ పెట్టుకోవద్దు. ఆఫీసు రిపోర్టుల వంటివి ముందేసుకొని మేలుకోవద్దు. ఇష్టమైన పుస్తకం చదవటం, శ్రావ్యమైన సంగీతాన్ని వినటం, ధ్యానం చేయటం వంటి మనసుకు విశ్రాంతినిచ్చే పనులు చేయాలి.

వ్యాయామం చేయకపోవటం: శారీరక శ్రమ నిద్ర బాగా పట్టటానికి తోడ్పడుతుంది. కాబట్టి రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయటం ఉత్తమం. ఆరుబయట నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం వంటివి చేస్తే స్వచ్ఛమైన గాలికి మనసు, శరీరం ఉత్సాహంతో తొణికిసలాడతాయి. రాత్రిపూట గాఢంగానూ నిద్ర పడుతుంది.

వేళకు పడుకోకపోవటం: షిఫ్ట్‌ ఉద్యోగులు, తరచూ రాత్రిపూట ఆలస్యంగా పడుకునేవారిలో నిద్ర సమస్యలు తలెత్తటానికి ప్రధాన కారణం వేళకు నిద్ర పోకపోవటం. కాబట్టి రోజూ ఒకే సమయానికి పడుకోవటం, లేవటం చాలా ముఖ్యం. దీంతో నిద్ర వేళలు నియమబద్ధం  అవుతాయి. సాయంత్రం వేళ గోరు వెచ్చటి నీటితో స్నానం చేయటం, గ్లాసు పాలు తాగటం, ఇంట్లో లైట్ల వెలుగు తగ్గించుకోవటం ద్వారా మరింత త్వరగానూ నిద్ర పట్టేలా చూసుకోవచ్చు.

ఆలస్యంగా భోజనం: రాత్రిపూట ఆలస్యంగా పీకల దాకా భోజనం చేయటం, జీర్ణం కాని పదార్థాలు తినటం వల్ల గుండె వేగం, శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయి. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. కాబట్టి పడుకోవటానికి మూడు గంటల ముందే భోజనం ముగించెయ్యాలి. కొవ్వు పదార్థాలకు బదులు తేలికగా జీర్ణమయ్యేవి తినాలి.

కాఫీ, టీ ఎక్కువగా: సాయంత్రం వేళల్లో కాఫీ, టీ ఎక్కువగా తాగేవారికి రాత్రి నిద్ర పట్టటం కష్టమవుతుంది. కూల్‌ డ్రింకులు, రెడ్‌ వైన్‌, చాక్లెట్లు, ఛీజ్‌ వంటివీ నిద్రకు చేటు చేస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని