కుంగుబాటుకు మందుల తోడు

వయసు మీద పడినవారిలో కుంగుబాటు (డిప్రెషన్‌) తరచూ చూసేదే. అయితే అన్నిసార్లూ కుంగుబాటును తగ్గించే యాంటీడిప్రెసెంట్‌ మందులు పనిచేయకపోవచ్చు. రెండు మూడు మందులు వాడినా జబ్బు లక్షణాలు తగ్గకపోతే ఏం చేయాలో వైద్యులకూ పాలుపోదు.

Published : 27 Jun 2023 01:23 IST

వయసు మీద పడినవారిలో కుంగుబాటు (డిప్రెషన్‌) తరచూ చూసేదే. అయితే అన్నిసార్లూ కుంగుబాటును తగ్గించే యాంటీడిప్రెసెంట్‌ మందులు పనిచేయకపోవచ్చు. రెండు మూడు మందులు వాడినా జబ్బు లక్షణాలు తగ్గకపోతే ఏం చేయాలో వైద్యులకూ పాలుపోదు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ఒకటి ఆశలు రేపుతోంది. అరిపిప్రజోల్‌, బుప్రోపియాన్‌ మందులను జతచేస్తే సమర్థంగా పనిచేస్తున్నట్టు బయటపడింది. చికిత్సకు లొంగని కుంగుబాటుతో బాధపడే వృద్ధులను మూడు బృందాలుగా విడదీసి ఈ అధ్యయనం నిర్వహించారు. ఒక బృందంలోని వారికి సిఫారసు చేసిన యాంటీడిప్రెసెంట్లతో పాటు అరిపిప్రజోల్‌ మందును జోడించారు. రెండో బృందానికి బుప్రోపియాన్‌ మందును జత చేశారు. మూడో బృందం వారికి డాక్టర్లు సూచించిన మందులను ఆపేసి బుప్రోప్రయాన్‌ ఒక్కటే వేసుకోమన్నారు. పది వారాల అనంతరం పరిశీలించగా ఒక్క బుప్రోపియాన్‌ వాడిన వారితో పోలిస్తే అరిపిప్రజోల్‌ వేసుకున్నవారిలో కుంగుబాటు లక్షణాలు గణనీయంగా తగ్గటం విశేషం. యాంటీడిప్రెసెంట్లకు అరిపిప్రజోల్‌, బుప్రోపియాన్‌ మందుల్లో ఏదో ఒకటి జోడించినా మంచి గుణం కనిపించటం గమనార్హం. అరిపిప్రజోల్‌ను జత చేసుకున్నవారిలో 29% మందిలో, బుప్రోపియాన్‌ జత చేసుకున్నవారిలోనూ 28% మందిలో కుంగుబాటు లక్షణాలు తక్కువగా కనిపించాయి. బుప్రోపియాన్‌ ఒక్కటే వేసుకున్న వారిలో 19% మందిలోనే లక్షణాలు తగ్గాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని