క్యాన్సర్‌పై టీకాస్త్రం!

క్యాన్సర్‌ చికిత్సలో టీకాల వాడకం కీలకం కానుందా? తాజా ప్రయోగాల ఫలితాలు ఇదే సూచిస్తున్నాయి. దశాబ్దాల పరీక్షల అనంతరం క్యాన్సర్‌ టీకాలు కొంగొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Published : 04 Jul 2023 00:04 IST

క్యాన్సర్‌ చికిత్సలో టీకాల వాడకం కీలకం కానుందా? తాజా ప్రయోగాల ఫలితాలు ఇదే సూచిస్తున్నాయి. దశాబ్దాల పరీక్షల అనంతరం క్యాన్సర్‌ టీకాలు కొంగొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో మరెన్నో టీకాలు అందుబాటులోకి రావొచ్చని ఆశిస్తున్నారు. ఇవేమీ సంప్రదాయ టీకాలు కావు. జబ్బు నివారణకు ఉద్దేశించినవి కావు. కణితుల సైజు తగ్గించటం, క్యాన్సర్‌ తిరగబెట్టకుండా చూడటం వీటి ప్రత్యేకత. ప్రాణాంతక చర్మ క్యాన్సర్‌, క్లోమ క్యాన్సర్‌ మీద ఇటీవల నిర్వహించిన టీకా ప్రయోగాలు విజయవంతం కావటంతో రొమ్ము, ఊపిరితిత్తి క్యాన్సర్ల మీద శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. శరీర రోగనిరోధక వ్యవస్థ కంట పడకుండా క్యాన్సర్‌ ఎలా దాక్కుంటోందనేది మునుపటి కన్నా ఇప్పుడు బాగా అవగతమైంది. దీని ఆధారంగానే టీకాలను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని క్యాన్సర్లకు రోగనిరోధక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. టీకాలు సైతం వీటి మాదిరిగానే పనిచేస్తాయి. క్యాన్సర్‌ కణాలను గుర్తించి, వాటిని చంపేలా రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తాయి. కొన్ని కొత్త టీకాలు ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానాన్నీ వాడుకుంటున్నాయి. కొవిడ్‌ టీకాల తయారీలో ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం తెలిసిందే. టీకా పనిచేయాలంటే అది ముందుగా చేయాల్సిన పని- క్యాన్సర్‌ ప్రమాదకరమైందని గుర్తించేలా రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టి కణాలకు నేర్పించటం. ఒకసారి దీన్ని నేర్చుకుంటే చాలు. శరీరంలో క్యాన్సర్‌ ఎక్కడున్నా టి కణాలు దాని పని పడతాయి. రక్తనాళాల ద్వారా పాక్కుంటూ వెళ్లి, కణజాలం లోపలికి చొచ్చుకెళ్తాయి. క్యాన్సర్‌ కణాలను అంతం చేస్తాయి. అయితే టీకాలు తీసుకోవటానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చే రోగులు లభించటమే పెద్ద సవాలు. ఇలాంటి కొందరిపై కొన్నిచోట్ల ప్రయోగాలు ఆరంభించారు. క్యాన్సర్‌ బాగా ముదిరిపోయి, ఇతర భాగాలకు వ్యాపించి, సంప్రదాయ చికిత్సలతో ఫలితం లేదని భావించినవారిపై నిర్వహిస్తున్న ప్రయోగాల్లో మంచి ఫలితాలూ కనిపిస్తున్నాయి. పదకొండు సంవత్సరాల క్రితం అండాశయ క్యాన్సర్‌ ముదిరిపోయిన దశలో టీకా తీసుకున్న ఒకరు ఇప్పటికీ జీవించి ఉండటం, ఆమెలో ఎలాంటి క్యాన్సర్‌ లక్షణాలు లేకపోవటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని