ఎంతెంత నూనె?

మన వంటకాల్లో నూనె వాడకం ఎక్కువే. నూనె పైకి తేలేంతవరకు ఉడికించటం చూస్తూనే ఉంటాం. కొందరు వండిన తర్వాతా పైన నూనె పోస్తుంటారు. వీటికి తోడు వనస్పతి వంటివి సరేసరి.

Updated : 04 Jul 2023 00:46 IST

మన వంటకాల్లో నూనె వాడకం ఎక్కువే. నూనె పైకి తేలేంతవరకు ఉడికించటం చూస్తూనే ఉంటాం. కొందరు వండిన తర్వాతా పైన నూనె పోస్తుంటారు. వీటికి తోడు వనస్పతి వంటివి సరేసరి. నూనె ఎక్కువగా వాడటం ఎంతమాత్రమూ మంచిది కాదు. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదముంది. ఇది అధిక రక్తపోటు, గుండెజబ్బులకు దారితీస్తుంది. కాబట్టి జాగ్రత్త అవసరం.

నిజానికి నూనె అసలే వాడకపోవటం సాధ్యం కాదు. చేపలు, మాంసం, చివరికి శాకాహారంతోనూ ఇది లభిస్తుంది. కొవ్వులో కరిగే ఏ, డీ, ఈ, కే వంటి విటమిన్లను శరీరం గ్రహించుకోవటానికి నూనె అవసరం కూడా. ఇది శారీరక శ్రమకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. మనదగ్గర చాలారకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. గానుగ నూనెల గురించి తెలిసిందే. నూనె గింజలను ఒత్తిడికి గురిచేసి తీసే (కోల్డ్‌ ప్రెస్డ్‌) వీటికి ఎలాంటి రసాయనాలనూ కలపరు. వేడి కూడా చేయరు. సహజ రుచి అలాగే ఉంటుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇక నూనె గింజలను వేడి చేసి, తయారుచేసేవి రిఫైన్డ్‌ నూనెలు. స్పష్టంగా, ఆకర్షణీయంగా కనిపించటానికి, ఎక్కువరోజులు నిల్వ ఉండటానికి వీటికి రసాయన ద్రావణిలనూ కలుపుతారు. ఈ ప్రక్రియలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. అయితే ప్రమాదకర రసాయనాలు తొలగిపోవటం గమనార్హం. ఉదాహరణకు- ఫంగస్‌తో కలుషితమైన వేరుశనగ గింజల్లో అఫ్లటాక్సిన్‌ అనే విష పదార్థం ఉండొచ్చు. ఇది వాంతి, వికారం, కడుపునొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది.

కలగలిపి

అన్ని నూనెలూ ఒకటి కావు. ఒకదాంట్లో ఒకోరకం మేలు చేసే పదార్థాలు ఉంటాయి. కాబట్టి వీటిని కలిపి వాడటం మంచిది. కొంత కోల్డ్‌ ప్రెస్డ్‌ నూనెకు నువ్వులు, వేరుశనగ, తవుడు, ఆవ నూనెల వంటివి కలిపి వాడుకోవచ్చు. ఆలివ్‌ నూనె ఆరోగ్యకరమే గానీ ధర ఎక్కువ.

నెలకు అరలీటరే

ఒకరు ఒక రోజుకు 3-5 చెంచాల కన్నా ఎక్కువ నూనె తీసుకోవద్దు. ఉజ్జాయింపుగా నెలకు అరలీటరు నూనె సరిపోతుంది. దీని ప్రకారం ఒక కుటుంబంలో నలుగురు ఉన్నట్టయితే నెలకు 2 లీటర్ల కన్నా మించనీయొద్దు. ఏ ఉష్ణోగ్రత వద్ద నూనె పొగ వెలువరించే స్థాయికి చేరుకుంటోంది? రుచి, పోషకాల మోతాదులేంటి? అనే వాటిని బట్టీ నూనెలను ఎంచుకోవాలి. నూనెల్లో కొవ్వు మోతాదులు వేర్వేరుగా ఉంటాయని గుర్తించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని