దంత శుభ్రతతో మెదడు పదిలం!

మెదడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే దంతాలను శుభ్రంగా ఉంచుకోండి. ఈ రెండింటికీ సంబంధమేంటని అనుకుంటున్నారా? మతిమరుపు, అల్జీమర్స్‌ జబ్బులో పాలు పంచుకునే మెదడులోని  హిప్పోక్యాంపస్‌ క్షీణించటానికీ చిగుళ్లజబ్బు, పళ్లూడటానికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు జపాన్‌లోని టోహోకు యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది

Published : 11 Jul 2023 01:28 IST

మెదడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే దంతాలను శుభ్రంగా ఉంచుకోండి. ఈ రెండింటికీ సంబంధమేంటని అనుకుంటున్నారా? మతిమరుపు, అల్జీమర్స్‌ జబ్బులో పాలు పంచుకునే మెదడులోని  హిప్పోక్యాంపస్‌ క్షీణించటానికీ చిగుళ్లజబ్బు, పళ్లూడటానికీ మధ్య సంబంధం ఉంటున్నట్టు జపాన్‌లోని టోహోకు యూనివర్సిటీ అధ్యయనం పేర్కొంటోంది. మతిమరుపు సమస్యలేవీ లేని, సగటున 67 ఏళ్లు పైబడిన కొందరిని ఎంచుకొని ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరికి ముందే స్కాన్‌ చేసి, మెదడులో హిప్పోక్యాంపస్‌ పరిమాణాన్ని కొలిచారు. ఎన్ని దంతాలున్నాయి? చిగుళ్లు ఎంత కిందికి జారాయి? అనేవీ లెక్కించారు. ఒక మాదిరి చిగుళ్ల జబ్బుండి, కొద్దిగానే పళ్లు ఊడినవారిలో హిప్పోక్యాంపస్‌ ఎడమ భాగం చాలా వేగంగా కుంచించుకుపోయినట్టు గుర్తించారు. అయితే చిగుళ్ల జబ్బు తీవ్రంగా ఉండి, తక్కువగా పళ్లూడిన వారిలోనూ మెదడు వేగంగా కుంచించుకుపోవటం గమనార్హం. చిగుళ్ల జబ్బు, దంతాలు ఊడటం తరచూ చూసేవే. ఈ సమస్యల్లో దంతాల చుట్టూరా ఉండే కణజాలంలో వాపు తలెత్తుతుంది. మెదడు క్షీణించటంలోనూ వాపు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో డిమెన్షియాకూ చిగుళ్లు, దంత సమస్యలకూ మధ్య సంబంధాన్ని విశ్లేషించటం ముఖ్యమైందని అధ్యయనానికి నేతృత్వం వహించిన సటోషీ యమగుచి చెబుతున్నారు. పళ్లు ఊడకుండానే కాదు, మొత్తంగా పళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ముఖ్యమని ఫలితాలు సూచిస్తున్నాయి. చిగుళ్ల జబ్బు గలవారు తరచూ డాక్టర్‌ను సంప్రదిస్తూ సమస్య తీవ్రం కాకుండా చూసుకోవాలని.. తీవ్ర చిగుళ్ల జబ్బు గలవారు కదిలే దంతాలను తొలగించుకొని, కృత్రిమ దంతాలు బిగించుకోవాలని పరిశోధకులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని