ఆనంద శక్తి!

రోగనిరోధక శక్తి బలోపేతం అనగానే మంచి తిండి, వ్యాయామం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. కానీ ఆనందం, సంతోషం కూడా ఎంతగానో తోడ్పడతాయి. జబ్బుల బారినపడకుండా దీర్ఘకాలం కాపాడతాయి. అధ్యయనాలు ఈ విషయాన్ని బలంగా నొక్కి చెబుతున్నాయి.

Published : 18 Jul 2023 00:02 IST

రోగనిరోధక శక్తి బలోపేతం అనగానే మంచి తిండి, వ్యాయామం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. కానీ ఆనందం, సంతోషం కూడా ఎంతగానో తోడ్పడతాయి. జబ్బుల బారినపడకుండా దీర్ఘకాలం కాపాడతాయి. అధ్యయనాలు ఈ విషయాన్ని బలంగా నొక్కి చెబుతున్నాయి.

మంచి కబురు విన్నప్పుడో, కలలుగంటున్న ఉద్యోగం లభించినప్పుడో, విజయం సాధించినప్పుడో.. ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా ఆనందం, సంతోషం కలుగుతాయి. ఇంతకీ ఆనందమంటే? దీనికి ఇదమిత్థమైన నిర్వచనమంటూ లేదు. శరీరపరంగా చూస్తే- ఆనందమనేది ఓ భావోద్వేగ స్థితి. ఒంట్లో డోపమిన్‌, సెరటోనిన్‌ వంటి నాడీ సమాచార వాహికలు విడుదలైనప్పుడు ఇలాంటి స్థితి కలుగుతుంది. అయితే ఇది మనసుకే పరిమితం కాదు. ఆరోగ్యం మీదా సానుకూల ప్రభావం చూపుతుంది. వ్యక్తులు హాయిగా, ఆరోగ్యంగా జీవిస్తుండటానికీ ఆనంద స్థాయులకూ సంబంధం ఉంటున్నట్టు అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి. సంతోషం లేదా సానుకూల ప్రభావం గుండెజబ్బుల నుంచి కాపాడుతున్నట్టు.. ఆనందంగా ఉన్న రోజుల్లో గుండె కొట్టుకునే తీరు సాఫీగా సాగుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సానుకూల భావోద్వేగాలకూ రోగనిరోధకశక్తికీ మధ్య సంబంధం గురించి ఇంకా పూర్తిగా అవగతం కాలేదు. కానీ ఆనందంగా ఉండే వారిలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటున్నట్టు, ఫలితంగా జబ్బులను మరింత సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు చాలా అధ్యయనాల్లో వెల్లడైంది.

ఏంటీ సంబంధం?

ఆరోగ్యం, ఆనందం పరస్పరం ఆధారితాలు. వీటి మధ్య పరోక్ష సంబంధం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మంచి నిర్ణయాలు తీసుకుంటాం. మంచిగా ప్రవర్తిస్తాం. మంచి ఆహారం తినటం, వ్యాయామం చేయటం, త్వరగా నిద్రకు ఉపక్రమించటం వంటి అలవాట్లన్నీ మూడ్‌ను ఉత్సాహ పరుస్తాయి. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అంటే ఆరోగ్యం మంచి ప్రవర్తనకు.. మంచి ప్రవర్తన ఆనందానికీ దోహదం చేస్తాయన్నమాట. నిద్ర సమస్యలతో బాధపడేవారి మీద 2008లో నిర్వహించిన అధ్యయనమూ ఇదే సూచిస్తోంది. వీరిలో దాదాపు సగం మందిలో సానుకూల దృక్పథం తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. కంటి నిండా నిద్రపోవటమనేది మన భావోద్వేగ స్థితి మీద నేరుగా ప్రభావం చూపుతుందనటానికిదో నిదర్శనం.

నేర్చుకోవచ్చు!

ఆశ్చర్యంగా అనిపించినా ఆనందంగా, సంతోషంగా ఉండటాన్నీ నేర్చుకోవచ్చు. దీన్నొక అలవాటుగానూ మార్చుకోవచ్చు. మనలోని అసలు మనిషిని గుర్తించటం ద్వారా దీన్ని సాధించొచ్చు. సాధారణంగా వయసు పెరుగుతున్నకొద్దీ చాలామంది భావోద్వేగాలను కోల్పోతుంటారు. లోపల దాగున్న పిల్లల మనస్తత్వాన్ని మరచిపోతుంటాం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటం, బాధ్యతలను నెరవేర్చటంలో మునిగిపోయి మనల్ని మనుషులుగా మలచే, జీవితానికి విలువను చేకూర్చే చిన్న చిన్న పనులను ఆస్వాదించటంలో విఫలమవుతుంటాం. దీన్ని గుర్తిస్తే చాలావరకు ఆనందంగా ఉండటాన్ని నేర్చుకున్నట్టే.

* లోపలి పిల్లాడితో స్నేహం: మనలోని పిల్లల మనస్తత్వం అలాగే ఉంటుంది. ఎంత పెద్దవాళ్లయినా పిల్లల మాదిరిగా ఆడుకోవాలని, ఆనందించాలని ఎప్పుడో అప్పుడు అనుకోవటమూ సహజం. ఈ నిజాన్ని అంగీకరించాలి. ఒకసారి లోపలి పిల్లాడికి అనుమతించి చూస్తే తేడా ఇట్టే తెలుస్తుంది. జీవితాన్ని ఆస్వాదించటమెలాగో అవగతమవుతుంది.

* మనసుకు నచ్చే పనులు: చాలావరకు మనం ఎవరో నడిచిన దారిలో నడవాలని ప్రయత్నిస్తుంటాం. ఎవరినో చూసి, అలాగే కావాలని పరుగులు పెడుతుంటాం. ఈ యావలో అసలు మనకు కావాల్సిందేంటో విస్మరిస్తుంటాం. నిజానికి మనసుకు నచ్చిన పనులతోనే లక్ష్యం త్వరగా అందుతుంది. ఆనందమూ సొంతమవుతుంది.

* ఏదీ ఎల్లకాలం ఉండదు: కొన్నిసార్లు జీవితంలో అనూహ్య, అవాంఛిత ఘటనలు జరుగు తుంటాయి. కష్టాలు, నష్టాలు ఎదురవుతుంటాయి. వాటినే తలచుకుంటూ ఉంటే విచారం తప్ప మిగిలేదేమీ ఉండదు. ఎంతటి విపత్కర పరిస్థితులైనా ఎల్లకాలం ఉండవని అర్థం చేసుకోవాలి. ప్రతి సవాలునూ అవకాశంగా మలచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆనందానికి బాట పడుతుంది.

* సంతృప్తి పడటం: తృప్తి పడటమనేది అద్భుతమైన భావన. ఇదొక మానసిక ధోరణి. జీవన మార్గం. చిన్న చిన్న విషయాలకూ తృప్తి పడటం నేర్చుకొని చూడండి. జీవితం కొత్త సొబగులు అద్దుకుంటుంది. మనసూ ఆనంద డోలికల్లో తేలియాడుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని