పనుల వేగంతో క్యాన్సర్‌ దూరం!

ఇంటిపని వేగంగా చేస్తున్నారా? షాపింగ్‌ మాల్‌లో చాలా బరువైన వస్తువులను మోస్తున్నారా? వేగంగా నడుస్తున్నారా? పిల్లలతో కలిసి వేగంగా ఆడుకుంటున్నారా?

Published : 01 Aug 2023 01:13 IST

ఇంటిపని వేగంగా చేస్తున్నారా? షాపింగ్‌ మాల్‌లో చాలా బరువైన వస్తువులను మోస్తున్నారా? వేగంగా నడుస్తున్నారా? పిల్లలతో కలిసి వేగంగా ఆడుకుంటున్నారా? అయితే క్యాన్సర్‌ ముప్పు తగ్గించుకున్నట్టే. రోజులో అప్పుడప్పుడూ వేగంగా చేసే ఇలాంటి పనులకు సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు పెట్టిన పేరు ‘విగరస్‌ ఇంటర్‌మిటెంట్‌ లైఫ్‌స్టైల్‌ ఫిజికల్‌ యాక్టివిటీ’ (వీఐఎల్‌పీఏ) అని. ఒక నిమిషం కన్నా తక్కువసేపు వేగంగా చేసే ఇలాంటి శారీరక శ్రమతో కొన్ని క్యాన్సర్ల ముప్పు 32% వరకూ తగ్గుతుండటం గమనార్హం. వ్యాయామం చేయని 22వేల మంది ఆరోగ్య సమాచారాన్ని ఏడేళ్ల పాటు పరిశీలించి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు. శారీరక శ్రమ చేయనివారితో పోలిస్తే దీన్ని కేవలం నాలుగు నిమిషాల సేపు చేసినా క్యాన్సర్‌ ముప్పు గణనీయంగా తగ్గుతున్నట్టు కనుగొన్నారు. అత్యధిక వేగంగా చేసే హెచ్‌ఐఐటీ వ్యాయామ పద్ధతి సూత్రాలు వీఐఎల్‌పీకీ కొంతవరకు వర్తిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాయామం, శారీరక శ్రమ చేయనివారికి రొమ్ము, ఎండోమెట్రియల్‌, పెద్దపేగు క్యాన్సర్ల వంటి వాటి ముప్పు పెరుగుతున్నట్టు ఇప్పటికే తేలింది. కానీ కాసేపు వేగంగా చేసే పనుల ప్రభావం గురించే తెలియదు. ‘‘మధ్యవయసు వారిలో చాలామంది రోజూ వ్యాయామం చేయరు. ఇది క్యాన్సర్‌ ముప్పు పెరిగేలా చేస్తుంది. అయితే నడక, మెట్లు ఎక్కటం వంటి వాటిని గుర్తించే స్మార్ట్‌వాచ్‌ల రాకతో అప్రయత్నంగా వేగంగా చేసే పనులను గుర్తించటం సాధ్యమైంది. ఇలాంటి పనులను కొద్ది నిమిషాల సేపు చేసినా మొత్తంగా క్యాన్సర్ల ముప్పు 18% వరకు తగ్గుతోంది. కొన్ని క్యాన్సర్ల ముప్పు 32% వరకూ తగ్గుతోంది’’ అని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ స్టమటకిస్‌ చెబుతున్నారు. అప్పుడప్పుడూ వేగంగా చేసే పనులతో శరీర కదలికల వేగం పుంజుకోవటం, గుండె-ఊపిరితిత్తుల సామర్థ్యం ఇనుమడించటం క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికి దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. శారీరక శ్రమతో ఇన్సులిన్‌ గ్రాహకత్వం పెరగటం, దీర్ఘకాల వాపు ప్రక్రియ తగ్గటమూ దీనికి కారణం కావొచ్చని అనుకుంటున్నారు. ఇంటి పనులు వేగంగా చేయటానికి ఎలాంటి ఖర్చూ కాదని, అందువల్ల క్యాన్సర్‌ ముప్పును తగ్గించుకోవటానికిది ఒక సాధనంగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని