డెక్సా స్కాన్‌తోనే గుండెపోటు ముప్పూ వెల్లడి

ఒకే పరీక్షకు రెండు ఫలితాలు. ఎముక సాంద్రతను తెలిపే డెక్సా స్కాన్‌ పరీక్షతో గుండె పోటు ముప్పును తెలుసుకోవచ్చని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌తో పాటు వివిధ సంస్థల సహకారంతో నిర్వహించిన పరిశోధనలో బయటపడింది. ఎముకలు పెళుసు బారటాన్ని గుర్తించటానికి డెక్సా స్కాన్‌ పరీక్ష చేస్తుంటారు.

Published : 01 Aug 2023 01:23 IST

ఒకే పరీక్షకు రెండు ఫలితాలు. ఎముక సాంద్రతను తెలిపే డెక్సా స్కాన్‌ పరీక్షతో గుండె పోటు ముప్పును తెలుసుకోవచ్చని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌తో పాటు వివిధ సంస్థల సహకారంతో నిర్వహించిన పరిశోధనలో బయటపడింది. ఎముకలు పెళుసు బారటాన్ని గుర్తించటానికి డెక్సా స్కాన్‌ పరీక్ష చేస్తుంటారు. ఈ క్రమంలో గుండె నుంచి కడుపులోకి వచ్చే బృహద్ధమనిలో గట్టిపడిన క్యాల్షియం కూడా కనిపిస్తుంది. ఇది రక్తనాళాలు గట్టిపడుతున్నాయనటానికి సూచిక. గుండెపోటు, మరణం ముప్పునూ ఇది పట్టి చూపుతుంది. కానీ కడుపులోని ధమనిలో పోగుపడిన క్యాల్షియంకు సంబంధించిన స్కాన్‌ పరీక్షలను పరిశీలించటానికి, స్కోర్‌ను కేటాయించటానికి చాలా నైపుణ్యం అవసరం. దీనికి సమయమూ ఎక్కువే పడుతుంది. అందుకే చాలామంది డెక్సా స్కాన్‌ దృశ్యాలను గుండెపోటు ముప్పును గుర్తించటానికి వాడుకోరు. వాటిని పట్టించుకోకుండా పక్కన పెట్టేస్తుంటారు. మరి ఈ ధమనిలోని క్యాల్షియాన్ని అప్పటికప్పుడే పసిగట్టి, స్కోర్‌ను తెలుసుకోగలిగితే? గుండెపోటు ముప్పూ బయటపడుతుంది కదా. పరిశోధకులను ఇదే ఆలోచింపజేసింది. మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో దీన్ని త్వరగా గుర్తించొచ్చని, వ్యక్తులతో పనిలేకుండా అప్పటికప్పుడే స్కోర్‌ ఇచ్చే అవకాశముందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిజ్ఞానం గట్టిపడిన క్యాల్షియాన్ని మనుషులతో సమానంగా గుర్తిస్తుండటం విశేషం. దీన్ని ‘ఎంఎల్‌-ఏఏసీ-24’ అని పిలుచుకుంటున్నారు. దీని స్కోర్‌ ఎక్కువగా గలవారికి గుండెపోటు ముప్పు పెరుగుతున్నట్టూ, దీర్ఘకాలంలో జబ్బు నుంచి కోలుకోవటమూ తక్కువగానే ఉంటున్నట్టూ తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని