నిద్రా ముఖ్యమే!

చక్కటి ఆరోగ్యానికి వ్యాయామం చేసే మేలు అంతా ఇంతా కాదు. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బుల ముప్పు తగ్గటానికే కాదు.. అవి అదుపులో ఉండటానికీ వ్యాయామం, శారీరక శ్రమ తోడ్పడతాయి.

Published : 08 Aug 2023 00:13 IST

చక్కటి ఆరోగ్యానికి వ్యాయామం చేసే మేలు అంతా ఇంతా కాదు. అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బుల ముప్పు తగ్గటానికే కాదు.. అవి అదుపులో ఉండటానికీ వ్యాయామం, శారీరక శ్రమ తోడ్పడతాయి. సాధారణంగా వయసు మీద పడుతున్నకొద్దీ విషయగ్రహణ సామర్థ్యమూ తగ్గుతూ వస్తుంటుంది. వ్యాయామం దీనికి కూడా కళ్లెం వేస్తుంది. రక్త ప్రసరణ పుంజుకోవటం వల్ల మెదడూ చురుకుగా ఉంటుంది మరి. అయితే వ్యాయామం ఒక్కటే సరిపోదు. కంటి నిండా నిద్ర పోవటమూ ముఖ్యమే. రాత్రిపూట 6 గంటల కన్నా తక్కువసేపు నిద్రపోయే మధ్య వయసువారికి వ్యాయామంతో ఒనగూరే ప్రయోజనాలు అంత ఎక్కువగా లభించటం లేదని లాన్సెట్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. ముఖ్యంగా మెదడు పనితీరులో నిద్రలేమి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. ఈ అధ్యయనంలో 50 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గల సుమారు 10వేల మందిని ఎంచుకొని, వారిని పది సంవత్సరాలకు పైగా పరిశీలించారు. శారీరకంగా చురుకుగా ఉన్నప్పటికీ తక్కువ సేపు నిద్రించేవారిలో విషయ గ్రహణ సామర్థ్యం వేగంగా పడిపోతున్నట్టు గుర్తించారు. అంటే వీరి మెదడు పనితీరు వ్యాయామం, శారీరక శ్రమ అంతగా చేయని వారితో సమానంగానే ఉంటోందన్నమాట. నిర్ణయాలు తీసుకోవటం, ఆలోచించటం, చదవటం, నేర్చుకోవటం, గుర్తుంచుకోవటం, కార్యకారణ వివేచన, ఏకాగ్రత వంటివన్నీ విషయగ్రహణ సామర్థ్యంతో ముడిపడినవే. ఇది తగ్గితే మిగతావన్నీ కుంటుపడతాయి. ఇక్కడే నిద్ర ప్రాధాన్యం సంతరించుకుంటోంది. నిద్రలోనే మెదడు పునరుత్తేజితమవుతుంది. మనసు ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. నిద్రలేమితో వీటికి భంగం కలుగుతుంది. మెదడు పనితీరు మందగిస్తుంది. ఫలితంగా మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటం వంటివన్నీ మొదలవుతాయి. ఇవి రోజువారీ పనుల మీద గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల వ్యాయామ ప్రయోజనాలను పూర్తిగా పొందాలంటే తగినంత నిద్రా ముఖ్యమేనని తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని