శ్వాస సాఫీగా సాగేలా..

రాత్రంతా నిద్రపోయినా అలసిపోయినట్టుగా అనిపిస్తోందా? నిద్రలో బిగ్గరగా గురక పెడుతున్నారా? అయితే నిద్రలో కాసేపు శ్వాస ఆగుతున్నట్టే. దీన్నే స్లీప్‌ అప్నియా అంటారు.

Published : 15 Aug 2023 01:34 IST

రాత్రంతా నిద్రపోయినా అలసిపోయినట్టుగా అనిపిస్తోందా? నిద్రలో బిగ్గరగా గురక పెడుతున్నారా? అయితే నిద్రలో కాసేపు శ్వాస ఆగుతున్నట్టే. దీన్నే స్లీప్‌ అప్నియా అంటారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇలాంటివారికి గొంతు కింద అతికించే ట్రాన్స్‌క్యుటేనియస్‌ ఎలక్ట్రిక్‌ నర్వ్‌ స్టిమ్యులేషన్‌ (టెన్స్‌) పరికరం మంచి ప్రత్యామ్నాయ చికిత్సగా ఉపయోగపడగలదని తాజాగా బయటపడింది.

స్లీప్‌ అప్నియా గలవారిలో నిద్రపోతున్నప్పుడు గొంతు వెనకాల కండరాలు వదులై, కిందికి జారతాయి. ఇవి శ్వాస మార్గానికి అడ్డుపడటం వల్ల శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. కాసేపు ఆగిపోనూ వచ్చు. దీంతో ఆక్సిజన్‌ అందక ఉక్కిరి బిక్కిరై, వెంటనే మేల్కొని గట్టిగా గురక పెడుతూ శ్వాస తీసుకుంటారు. నిద్రలో ఉండటం వల్ల శ్వాస ఆగిన సంగతి గానీ, మేల్కొన్న విషయం గానీ తెలియదు. ఇలా రాత్రిపూట పదేపదే చాలాసార్లు జరగటం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. శ్వాస సరిగా ఆడక పోవటంతో రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గుతుంది. తెల్లారి నిద్రలేచాక హుషారుగా ఉండదు. ఇది రోజువారీ పనులకు విఘాతం కలిగిస్తుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. తలనొప్పీ కలగొచ్చు. వాహనాలు నడిపేవారు ప్రమాదాలకూ గురికావొచ్చు. అందుకే స్లీప్‌ అప్నియా తీవ్రంగా గలవారు నిద్రపోతున్నప్పుడు సీప్యాప్‌ పరికరాన్ని వాడుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది గదిలోని గాలిని సంగ్రహించి.. నిర్ణీత పీడనంతో ముక్కు, నోరు మీద అమర్చుకునే మాస్కులోకి చేరవేస్తుంది. నిరంతరం ప్రవహించే ఈ గాలి శ్వాస మార్గం తెరచుకొని ఉండేలా చూస్తుంది. అయితే సీప్యాప్‌ పరికరాన్ని వాడుకోవటానికి చాలామంది నిరాకరిస్తుంటారు. అసౌకర్యంగా అనిపించటం, ఎక్కడికైనా వెళ్తే వెంట తీసుకెళ్లాల్సి రావటం వంటివన్నీ దీనికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెన్స్‌ పరికరం ప్రత్యామ్నాయం కాగలదని కింగ్స్‌ హాస్పిటల్‌, గయ్స్‌ అండ్‌ సెయిట్‌ థామస్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో బయటపడటం ఆశలు రేపుతోంది. సాధారణంగా టెన్స్‌ పరికరాన్ని నొప్పులు తగ్గించటానికి వాడుతుంటారు. బ్యాటరీ సాయంతో పనిచేసే దీనికి ఎలక్ట్రోడులతో కూడిన ప్యాడ్స్‌ ఉంటాయి. ఇవి చర్మం మీద అతుక్కొని విద్యుత్‌ ప్రచోదనాలను వెలువరిస్తాయి. దీంతో నాడులు ఉత్తేజితమై నొప్పులు తగ్గుతాయి. ఇది నిద్రలో శ్వాస సాఫీగా సాగటానికీ ఉపయోగపడుతుండటం విశేషం. టెన్స్‌ పరికరం నుంచి వెలువడే తేలికైన, నిరంతర విద్యుత్‌ ప్రచోదనాలు శ్వాస మార్గం తెరచుకొని ఉండేలా చేస్తున్నట్టూ బయటపడింది. ఈ చికిత్స తీసుకున్నవారిలో రాత్రిపూట శ్వాస సాఫీగా సాగటంతో పాటు పగటిపూట హుషారూ పెరిగినట్టు గుర్తించారు. అందుకే స్లీప్‌ అప్నియా గలవారికి టెన్స్‌ పరికరం చవకైన, తేలికైన విధానంగా ఉపయోగపడగలదని భావిస్తున్నారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని