కాలుష్యంతోనూ తలనొప్పి!

తలనొప్పి బారినపడకూడదని అనుకుంటున్నారా? అయితే పరిశుభ్రమైన గాలిని పీల్చుకోండి. గాలి కాలుష్యంతో తలనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశముంది.

Published : 22 Aug 2023 00:30 IST

తలనొప్పి బారినపడకూడదని అనుకుంటున్నారా? అయితే పరిశుభ్రమైన గాలిని పీల్చుకోండి. గాలి కాలుష్యంతో తలనొప్పి ప్రేరేపితమయ్యే అవకాశముంది. నిజానికి వాయు కాలుష్యమనగానే ముందుగా శ్వాసకోశ సమస్యలే గుర్తుకొస్తాయి. అయితే దీని ప్రభావంతో తలనొప్పి వంటి నాడీ సమస్యలూ తలెత్తుతాయి. వాహనాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాల నుంచి వెలువడే పొగలు గాలిని విపరీతంగా కలుషితం చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్యలో బాధపడేవారి సంఖ్యా పెరుగుతూ వస్తోంది. ఎలాంటి పొగలోనైనా కార్బన్‌ మోనాక్సైడ్‌, కార్బన్‌ డయాక్సైడ్‌, నుసి (పార్టిక్యులేట్‌ మ్యాటర్‌) ఉంటాయి. అమోనియా, సోడియం క్లోరైడ్‌, బ్లాక్‌ కార్బన్‌, సల్ఫేట్లు, ఖనిజాల దుమ్ము, నీరు వంటివి కలగలిసిన అతి సూక్ష్మ నుసి (పీఎం2.5) ప్రభావానికీ పార్శ్వనొప్పితో అత్యవసరంగా ఆసుపత్రికి వెళ్లటానికీ నేరుగా సంబంధం ఉంటున్నట్టు దక్షిణ కొరియాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కాస్త గరుకుగా ఉండే నుసి (పీఎం10) కూడా తక్కువేమీ కాదు. గాలిలో పీఎం10, కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌, ఓజోన్‌ మోతాదులు పెరగటమూ ఆసుపత్రిలో చేరటానికి కారణమవుతున్నట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది. ఇంతకీ తలనొప్పికి గాలి కాలుష్యం ఎలా కారణమవుతుంది? కొన్ని కాలుష్య కారకాలు మెదడులో వాపు ప్రక్రియను ప్రేరేపించటం వల్ల తలనొప్పి, పార్శ్వనొప్పితో ముడిపడిన నాడీ మార్గాలు ఉత్తేజితమవుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. కొందరికి కొన్ని వాసనలు పడవు. ఇలాంటివారిలో ముక్కులో వాసనలను పసిగట్టే నాడులు నేరుగా ప్రేరేపితమై తలనొప్పి వస్తుంటుంది. ఇక నైట్రిక్‌ ఆక్సైడ్‌ వంటి రసాయనాలు మెదడులో రక్తనాళాలను వేగంగా సంకోచించి, వ్యాకోచించేలా చేస్తాయి. ఇదీ తలనొప్పికి దారితీస్తుంది. కలుషిత గాలిలోని రసాయనాలు ముక్కు పక్కల గాలి గదులను చిరాకుకు గురిచేసి, తలనొప్పి మరింత పెరిగేలా చేస్తాయి కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని