వ్యసనం వయా అలవాటు

మంచివో, చెడ్డవో.. అలవాట్ల మీదే మన జీవితమంతా నడుస్తుంది. వీటిని అలవరుచుకోవటం తేలికే. వదిలించుకోవటమే కష్టం.

Updated : 05 Sep 2023 07:05 IST

మంచివో, చెడ్డవో.. అలవాట్ల మీదే మన జీవితమంతా నడుస్తుంది. వీటిని అలవరుచుకోవటం తేలికే. వదిలించుకోవటమే కష్టం. మంచి అలవాట్లయితే మనకు అన్ని విధాలా మంచి చేస్తాయి. పుస్తకాలు చదవటం, సంగీతం వినటం, వ్యాయామం చేయటం, ఆటలు ఆడటం వంటివి జీవితాంతం తోడుంటాయి. శారీరక, మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. కాబట్టి మంచి అలవాట్లను వదిలించుకోవాల్సిన అవసరముండదు. అదే చెడు అలవాట్లయితే వీలైనంత త్వరగా వదిలించుకోవాల్సిందే. లేకపోతే ఇవే క్రమంగా వ్యసనంగా మారతాయి. అప్పుడు వాటి నుంచి బయటపడటం కష్టమై పోతుంది. ఎంత ప్రయత్నించినా, శ్రమపడినా చాలామంది దురలవాట్లను వదులుకోలేక చేతులెత్తేస్తుండటం.. ఓపిక నశించి, తిరిగి మొదటికి రావటం చూస్తున్నదే. కాబట్టి వీటి గురించి, తెలుసుకొని మసలు కోవటం ఎంతైనా మంచిది. చదువుకునే వయసులోనే ఎంతోమంది చెడు అలవాట్ల కోరల్లో చిక్కుకుంటున్న ధోరణి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఇది అత్యంత అవసరం.

మొక్కయి వంగనిది మానై వంగదంటారు. ఇది దురలవాట్లకు అతికినట్టు సరిపోతుంది. వీటి అనర్థాలను ముందే గుర్తించి, వదిలించు కోకపోతే క్రమంగా వ్యసనంగా (అడిక్షన్‌) మారతాయి. ఒక వ్యక్తి తీసుకునే పదార్థం (మత్తు మాత్రలు, గంజాయి, మద్యం.. ఇలా ఏవైనా కానివ్వండి) తీసుకోకుండా ఉండలేని పరిస్థితినే వ్యసనమని అంటాం. వీటితో హాని కలుగుతుందని తెలిసినా తీసుకోవటం గమనార్హం. అంటే తెలిసి తెలిసీ నిప్పు మీద కాలేస్తున్నారనే అర్థం. ప్రస్తుతం బడికి వెళ్లే వయసు పిల్లల్లోనూ ఇలాంటి ధోరణి కనిపిస్తుండటం ఆందోళనకరం. యువతనైతే మరింత ఎక్కువగానూ పీడిస్తోంది. ఎందుకీ పరిస్థితి? దీన్ని విశ్లేషించి చూస్తే కనిపించే ముఖ్య కారణాల్లో కొన్ని ఇవీ..

1. విచ్చలవిడి తనం: చిన్నప్పటి నుంచీ విచ్చలవిడితనం పెరుగుతుండటం ఒక సమస్య. ఇంట్లో అజమాయిషీ లేకపోవటం.. ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో కనుక్కునేవారు లేకపోవటంతో పిల్లలకు పట్టపగ్గాల్లేకుండా పోతోంది. దీనికి తోడు పిల్లల్లో ఒక విధమైన పెడసరం అలవాటవుతుంది.
2. కుటుంబ వ్యవస్థ పాడైపోవటం: ప్రస్తుతం చిన్నతనంలోనే దురలవాట్లు అలవడటానికి అతి ముఖ్య కారణం ఇదే. ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో తల్లిదండ్రులు తమ పిల్లల ఆలనాపాలనాపై శ్రద్ధ పెట్టలేకపోవటం చాలా ఇళ్లలో గమనిస్తున్నాం. ఈరోజుల్లో పిల్లలు ఏం చేస్తున్నారో కొందరు తల్లిదండ్రులకు తెలియదన్నా అతిశయోక్తి కాదు. ఇంట్లో పెద్దవాళ్లు లేకపోవటం వల్ల పిల్లలు ఆడింది ఆట, పాడింది పాటగా మారుతోంది. ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలనే కంటున్నారు. దీంతో గారం ఎక్కువవుతోంది. అజమాయిషీ తగ్గుతోంది.
3. చేతిలో డబ్బు ఆడటం: ప్రస్తుతం అందరి దగ్గరా ఎంతో కొంత డబ్బు చేతుల్లో ఉంటోంది. పిల్లలకు, యువతీ యువకులకు చేతి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వటం మామూలే. దీన్ని వారు ఎలా ఖర్చు పెడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు. అడిగేవారే లేరు.
4. తేలికగా అందుబాటులో: మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అందుబాటులో ఉంది. మత్తుమందులు, నిద్రమాత్రల వంటివీ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ప్రభుత్వం ఎన్ని నియమాలు విధించినా అన్నీ బయట అమ్ముతున్నారు. దుకాణాల యజమానులు తమ లాభం కోసం విక్రయిస్తున్నారనేది కాదనలేని సత్యం.
5. స్మార్ట్‌ఫోన్లు, వీడియోలు: ఇప్పుడు అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒకటి చూడటమే పని. ఆన్‌లైన్‌లో మంచి విషయాలు చాలానే ఉన్నా చెడు అంశాలపై దృష్టి ఎక్కువగా మళ్లుతుందన్నది మరవరాదు. ఎదుగుతున్న వయసులో ఇవి మరింతగా ఆకర్షిస్తుంటాయి. దీంతో ఎంతోమంది పిల్లలు, యువత చెడు స్నేహాలకి, చెడు అలవాట్లకి చేరువ అవుతున్నారు.


ఒత్తిడితో చిత్తు

దురలవాట్లు, వ్యసనాలకు మానసిక ఒత్తిడి ప్రధాన కారకంగా నిలుస్తోంది. పిల్లలకు ఇంట్లో, బడిలో ఒత్తిడి. ‘మంచి మార్కులు రాకపోతే నీకు మంచి కాలేజీలో సీటు రాదు. డాక్టర్‌ గానీ ఇంజినీరు గానీ అవలేవు’ అంటూ ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయుల పోరు. తోటి విద్యార్థులతో పోలిక. ‘వాడు చూడు ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంకు తెచ్చుకుంటాడు, నువ్వేమో ఎప్పుడూ వెనకే’ అని కోప్పడటం. ఇక పెద్దవాళ్లకు ఆఫీసులో, ఇంట్లో ఒత్తిడి ఎక్కువవుతోంది. జీవనశైలితో ఖర్చులు పెరిగాయి. ఆఫీసులో పని ఒత్తిడితో.. ముఖ్యంగా ఇతరులతో పోలిక, ప్రమోషన్‌ కోసం ఒత్తిడి. ఇవేగాకుండా వృత్తిపరమైన ఒత్తిళ్లు. ఈ బాధలను తప్పించుకోవటానికి క్లబ్బులకు (పేకాట, ఆన్‌లైన్‌ బెట్టింగు) వెళ్తుంటారు. కొందరు ఆలోచనలతో రాత్రిళ్లు నిద్ర పట్టక నిద్రమాత్రలను ఆశ్రయిస్తుంటారు. కొందరు పొగ తాగటానికి, మద్యానికి బానిసలు అయిపోతారు. మరికొందరు అశ్లీల చిత్రాలు చూడటం, లైంగిక కార్యక్రమాలకు పాల్పడటం అలవాటు చేసుకుంటారు. వీటన్నింటికీ డబ్బులు అవసరం. కాబట్టి డబ్బుల కోసం అబద్ధాలు ఆడటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, లంచాలు తీసుకోవటం వంటి అనైతిక వ్యవహారాలూ అలవడతాయి. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు తీసుకునేవారు ఆ మత్తులో ఇతరులను అపహరించటం, హత్యలు చేయటం వంటి దురాగతాలూ చేస్తుంటారు.

అందరికీ ఒకటే ఆలోచన. ఏ విధంగా, ఎంత తక్కువ వ్యవధిలో, ఎంత ఎక్కువగా డబ్బు సంపాదిస్తే అంత సుఖపడగలమని. ఇది మానసిక ఒత్తిడికే కాదు.. అది పెరిగిపోయి, దాన్నుంచి బయటపడేందుకు దురలవాట్లకూ దారితీస్తుంది. చివరికి వ్యసనంగానూ మారుతుంది.


దశదశలుగా..

అలవాట్లు ఒక్కసారిగా అంటుకునేవి కావు. దశలు దశలుగా ఆకర్షిస్తూ వస్తాయి. క్రమంగా ముదురుతూ వస్తాయి. చాలావరకు సరదాగా మొదలవుతాయి. ఇది తొలిదశ. తర్వాత అతిగా వాడకం (అబ్యూజ్‌) ఆరంభమవుతుంది. అయినా ఆనందం కలగని స్థితికి చేరుకుంటారు. మత్తు పదార్థాలు, నిద్రమాత్రలు, మాదక ద్రవ్యాల వంటివి శరీరానికి అలవడటం వల్ల మరింత మోతాదు పెంచుతారు (టాలరెన్స్‌). చివరికి అవి లేకుండా ఉండలేని పరిస్థితి తలెత్తి, వ్యసనంగా (డిపెండెన్స్‌-అడిక్షన్‌) మారుతుంది. ఒకసారి వ్యసనంగా మారితే బయటపడటం చాలా చాలా కష్టం.

లక్షణాలు రకరకాలు
వ్యసనానికి అలవాటు పడుతున్నవారిలో రకరకాల లక్షణాలు కనిపిస్తుంటాయి.

  •  నడవడిలో, నడతలో మార్పులు.
  •  ఆకలి మందగించటం.
  •  తల దువ్వుకోవటం, దుస్తులు వేసుకోవటంలో అశ్రద్ధ.
  •  విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టటం.
  •  చిన్న చిన్న అప్పులు, చేబదుళ్లు తీసుకోవటం.
  •  పని మీద ఆసక్తి పోవటం.
  •  తరచూ సెలవులు పెట్టటం.
  •  పరాకు మాటలు.
  •  మతిమరుపు.

- ఇలాంటి లక్షణాలను గమనిస్తే ఏదో అలవాటుకి బానిస అవుతున్నారని అనుమానించాలి. ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది.


ఎక్కువగా ఆకర్షిస్తున్నవివే..

ఈరోజుల్లో యువత ఎక్కువగా అలవాటు పడుతున్నవి మద్యం, నిద్రమాత్రలు, గంజాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం.
మద్యం ప్రస్తుతం ఇది అందుబాటులో లేని చోటు లేదు. మద్యం అంతటా విరివిగా దొరుకుతోంది. ఇంట్లో తండ్రి స్నేహితులతో పేకాడుతూనో, బంధువులతో కలిసో మద్యం తాగుతుంటే పిల్లలకూ దాని మీద కోరిక కలుగుతుంది. ఇదేమీ తప్పుకాదనే భావన కలుగుతుంది. దాని పర్యవసానం అలవాటుగా మారటం. మెదడులో మనల్ని చేయకూడని పనిని చేయకూడదని చెప్పే నాడీ వ్యవస్థని మద్యం అణచి వేస్తుంది. ఫలితంగా చేయకూడని పనులను చేయిస్తుంది. ఒక విధమైన అహంభావాన్ని కలిగిస్తుంది. ‘నేను గొప్ప. నేను చేసేదే సరైనది’ అనే ఆలోచనలు కలగజేస్తుంది. దీని వల్ల ప్రస్తుతం ఎన్నో భయానక సంఘటనలు జరుగుతున్నాయి. కాలేయ, గుండె, నాడీ, అన్నవాహిక జబ్బులకూ మద్యం కారణమవుతోంది. క్యాన్సర్లనూ తెచ్చిపెడుతోంది.


మత్తు పదార్థాలు, నిద్రమాత్రలు

మత్తు, నిద్ర కలిగించే మందులు చాలా వచ్చాయి. ఇవి రాసిస్తేనే అమ్మాలని ప్రభుత్వం నియమాలు పెట్టింది. అయినా చాలా చోట్ల మందుల దుకాణాల్లో విరివిగా దొరుకుతున్నాయి. సొంతంగానే కొనుక్కొని వేసుకోవటం గమనిస్తున్నాం. ఈ మందులు సాధారణంగా ఆందోళన తగ్గటానికి వాడుతుంటారు. వీటిల్లో కొన్ని నిద్ర కలిగించేవీ ఉన్నాయి. నేడు పిల్లల చదువులు అంత సజావుగా సాగటం లేదని అంతా అంగీకరించాల్సిన విషయమే. సెల్‌ఫోన్లు, టీవీలు, సినిమాలతో సమయం వృథా అవుతోంది. కొన్ని సమయాల్లో ఆన్‌లైన్‌ తరగతులు సరేసరి. ఇవెలా సాగుతున్నాయో గానీ పిల్లలకు వీడియో ఛాటింగ్‌ అలవడుతోంది. అర్ధరాత్రి దాటితే నిద్ర రాదు (పాక్షిక రేడియేషన్‌ ప్రభావంతో). దీని కోసం కొందరు నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు.


గంజాయి (హషిష్‌, కనబిస్‌, భంగ్‌, మారిజువానా)

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువతీ యువకులు దీనికి బలైపోతున్నారు. అక్రమ మార్గాల్లో దీన్ని పొందటానికి తంటాలు పడుతున్నారు. గంజాయి ముందుగా కొంత ఉత్సాహం కలిగించి, తర్వాత నిద్రలోకి జారుస్తుంది. అతి త్వరగా బానిసలుగా మలచుకుంటుంది. అక్రమ రవాణాదారులు బడి పిల్లల్ని, యువతని ఈ రొంపిలోకి దింపుతున్నారు. దీని వల్ల కలిగే అతి ప్రమాదకరమైన మార్పులు జూదం, దొంగతనం, లైంగిక వేధింపులు, శారీరక హింస. ఇటీవల ఇవి చాలా ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఏదో ఒకరకంగా గంజాయిని తీసుకుంటున్నారనేగా అర్థం.


బయటపడేయటమెలా?

కొంత కష్టమైనా వ్యసనాల నుంచి బయట పడేయటానికి కొన్ని చికిత్సలు, మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏదో ఒక మందు వేస్తే వెంటనే వ్యసనాలు పోతాయని అనుకోవద్దు. ఆయా వ్యవసనాల నుంచి ధ్యాసను మళ్లించటం, నియంత్రిం చుకునేలా చూడటానికి కాగ్నిటివ్‌ బిహేవియర్‌ చికిత్స, డీబీటీ చికిత్స తోడ్పడతాయి. మన ప్రయత్నాలతో కొందరినైనా ఈ అలవాట్లు, వ్యసనాల నుంచి విముక్తి చేయొచ్చు. ఇంట్లో పెద్దవాళ్లు, తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త పడితే పిల్లలను, యువతను వ్యసనాల మీదికి మనసు మళ్లకుండానూ నివారించొచ్చు. ఇందుకు కుటుంబ వాతావరణాన్ని మార్చుకోవటం ముఖ్యం. రోజూ ఇంటిల్లిపాదీ కలిసి కాసేపు మాట్లాడుకోవాలి. ఆనందాలను, సమస్యలను పంచుకోవాలి. దీంతో ఇంట్లో సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. తమకు అండగా ఉన్నారనే భావన ఎవరికైనా ధైర్యాన్ని కలిగిస్తుంది. వ్యసనాల నివారణకే కాదు, వాటి నుంచి బయటపడటానికీ ఇది తోడ్పడుతుంది. ఇంట్లో పిల్లల ముందు మద్యం, పొగ తాగటం వంటివి చేయొద్దు. పెద్దవాళ్లే పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. చిన్నప్పటి ఆలోచనలే పెద్దయ్యాక అలవాటుగా మారేలా ప్రోత్సహిస్తాయని తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు