కళ్లు గుండెకు వాకిళ్లు

గుండె, కళ్లు.. రెండూ కీలక అవయవాలే. దూరం దూరంగా ఉండొచ్చు గానీ వీటి గుణాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా రక్తనాళాల విషయంలో సమాన పోలికలుంటాయి.

Published : 26 Sep 2023 01:14 IST

అరుదుగానే అయినా వృద్ధుల్లో హఠాత్తుగా కళ్ల ముందు నల్లటి మచ్చ ప్రత్యక్షం కావటం, కొద్దిసేపు చూపు పోవటం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇవి ఎవరికైనా ఆందోళన కలిగించేవే. చూపు శాశ్వతంగా పోతే జీవితమే స్తంభించినట్టవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా దీన్ని కాపాడుకోవటం తప్పనిసరి. ఇందుకోసం ఒక్క కళ్ల మీదే కాదు.. గుండె, రక్తనాళాల మీదా కన్నేయటం మంచిది. ఎందుకంటే గుండెకూ కంటికీ విడదీయరాని సంబంధముంది. గుండె రక్తనాళాల సమస్యలు కళ్లనూ దెబ్బతీయొచ్చు. అందుకే కళ్లను గుండెకు వాకిళ్లనీ భావిస్తుంటారు. వీటి ఆరోగ్యం ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటుందని మరవరాదు.


గుండె, కళ్లు.. రెండూ కీలక అవయవాలే. దూరం దూరంగా ఉండొచ్చు గానీ వీటి గుణాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా రక్తనాళాల విషయంలో సమాన పోలికలుంటాయి. కళ్ల వెనక రక్తనాళ వ్యవస్థ గుండె ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉంటుంది. కంటి లోపలి, వెలుపలి భాగాలను నిశితంగా పరిశీలించటం ద్వారా తొలిదశలో గుండె జబ్బును గుర్తించొచ్చు కూడా. కంటి రక్తనాళాల్లో తలెత్తే మార్పులు, కంటి వెనకాల రక్తస్రావ మరకలతో అధిక రక్తపోటును గుర్తించే అవకాశమూ ఉంది. మరి గుండె, రక్తనాళాల సమస్యలు కంటిని ఎలా దెబ్బతీస్తాయో చూద్దామా.


రక్తనాళ పూడికలు: గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే గుండె పోటు వస్తుందన్నది తెలిసిందే. ఈ సమస్య గలవారికి వృద్ధాప్యంతో ముడిపడిన మాక్యులా క్షీణత ముప్పూ పెరుగుతుంది. రెటీనా మధ్యలో ఉండే మాక్యులా క్షీణిస్తే చూపు మసక బారుతుంది. ముఖ్యంగా ఎదురుగా ఉన్నవి స్పష్టంగా కనిపించవు. ముఖాలు చూడటం, చదవటం, వాహనాలు నడపటం, వంట చేయటం వంటి పనులన్నీ కష్టమవుతాయి.


అధిక రక్తపోటు: కంట్లో ఎర్రటి మచ్చలు ఏర్పడటం అధిక రక్తపోటుకూ సంకేతం కావొచ్చు. ఇది దృశ్యనాడిని దెబ్బతీసి, చూపు పోయేలా చేయొచ్చు. అంతేకాదు, అధిక రక్తపోటుతో రెటీనాకు రక్తాన్ని సరఫరా చేసే నాళమూ క్షీణిస్తుంది. రక్తనాళం గోడ బలహీనమై బుడగలా ఉబ్బొచ్చు. ఇది పగిలిపోయి కంట్లో రక్తస్రావం కావొచ్చు. అధిక రక్తపోటు అదుపులో లేకపోతే నీటికాసులూ తలెత్తొచ్చు. దీంతో కంట్లో ఒత్తిడి పెరిగిపోయి అంధత్వమూ వచ్చే ప్రమాదముంది.  
గుండెజబ్బు: కంటి వెనకాల రక్తనాళాలు మరీ మందంగా ఉన్నా, లోపలి మార్గం సన్నబడినా, పూడికలు ఏర్పడినా గుండె జబ్బులకు సంకేతం కావొచ్చు. గుండెజబ్బుకూ శుక్లాలకూ మధ్య బలమైన సంబంధం ఉంటున్నట్టూ అధ్యయనాలు చెబుతున్నాయి. గతంలో శుక్లాల శస్త్రచికిత్స చేయించుకున్నవారికి గుండెపోటు, పక్షవాతం సమస్యలతో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉంటుండటం గమనార్హం.  
మధుమేహం: ఇది వృద్ధుల మీద విపరీత ప్రభావం చూపుతుంది. దీర్ఘకాలంగా రక్తంలో గ్లూకోజు ఎక్కువగా ఉండటం వల్ల రెటీనా దెబ్బతినొచ్చు (రెటీనోపతీ). కొందరికి రెటీనాలో కొవ్వు ముద్దలు పేరుకుపోవచ్చు. రెటీనాలో రక్తస్రావం కావొచ్చు. కంటి నుంచి రెటీనా విడిపోవచ్చు కూడా. ఇది చూపు పోయేలా చేస్తుంది.
కొలెస్ట్రాల్‌: కళ్ల చుట్టూ చిన్న పసుపు పచ్చ గడ్డలుంటే రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువ ఉందటానికి సూచిక. వీటిని జాంతెలస్మాస్‌ అంటారు. ఇవేమీ నొప్పి కలిగించవు. కానీ చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. వీటిని గమనిస్తే కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకోవటం మంచిది. కొలెస్ట్రాల్‌ మోతాదులు ఎక్కువగా ఉండటం గుండెకు హాని చేస్తుంది. అలాగే రెటీనోపతీ మరింత తీవ్రమవుతుంది కూడా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని