గోళ్లు కొరుకుతున్నారా?

ఏమీ తోచనప్పుడో, దేన్నయినా నిశితంగా గమనిస్తున్నప్పుడో తెలిసో తెలియకో కొందరు గోళ్లు కొరకటం చూస్తూనే ఉంటాం.

Updated : 03 Oct 2023 03:23 IST

ఏమీ తోచనప్పుడో, దేన్నయినా నిశితంగా గమనిస్తున్నప్పుడో తెలిసో తెలియకో కొందరు గోళ్లు కొరకటం చూస్తూనే ఉంటాం. ఎప్పుడో అప్పుడంటే ఏమో గానీ ఇదొక అలవాటుగా, విడవలేని ప్రవర్తనగానూ మారితే? సమస్యగానే భావించాలి. దీన్నే అనికోఫేజీ లేదా అనికోఫేజియా అంటారు. ఇది తరచూ చూసే సమస్యే. దీన్ని తేలికగా తీసుకోవటానికి లేదు. ఎందుకంటే వదులుకోవటం చాలా చాలా కష్టం. మితిమీరితే ఇతరత్రా ఇబ్బందులకూ దారితీస్తుంది.

గోళ్లు కొరకటం సాధారణంగా బాల్యంలో.. మూడేళ్ల వయసులోనే మొదలవుతుంటుంది. పిల్లల్లో సుమారు 20% మంది అదేపనిగా గోళ్లు కొరుకుతుంటారని అంచనా. పెద్దగా అవుతున్నకొద్దీ కొందరు దీన్ని మామూలుగానే వదిలించుకుంటారు. కానీ చాలామందికి పెద్దయ్యాకా కొనసాగుతూ వస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు గోళ్లు కొరకటం చూసి పిల్లలకూ అలవడొచ్చు. చిన్నప్పుడు అలవాటు లేకపోయినా కొందరికి యుక్తవయసులో హఠాత్తుగా అంటుకోవటమూ చూస్తుంటాం. వేలు నోట్లో వేసుకొని చీకే పిల్లల్లో కొందరు దాన్ని మానేస్తారు. ‘హమ్మయ్య’ అని తల్లిదండ్రులు సంతోషించే లోపే గోళ్లు కొరకటం మొదలెట్టేస్తుంటారు. ఇది ఒకసారి అలవడితే వదలదు. కొందరు పిల్లలు గోళ్లు కొరకటం మానేసినా.. దానికి బదులు వెంట్రుకలు లాగటం వంటి ఇతర అలవాట్లను ఆరంభిస్తారు. కొన్నిసార్లు తెలియ కుండానే గుత్తులు గుత్తులుగానూ వెంట్రుకలు లాగేస్తుంటారు. చర్మాన్ని గిల్లటం, గోకటమూ చేస్తుంటారు. దీంతో చర్మం మందంగా, నల్లగా అవుతుంది. కొన్నిసార్లు పుండ్లు పడి, చీమూ పట్టొచ్చు.

ఉపశమనంగా మొదలై..

గోళ్లు కొరకటమనేది ఉపశమనం కోసం చేసే పని. ఆందోళన, చిరాకు, ఒంటరితనం, ఒత్తిడి వంటి భావోద్వేగాలను నియంత్రించుకోలేక దీనికి పాల్పడుతుంటారు. వేలు చీకేవారిలో చాలామంది బొటనవేలును మాత్రమే నోట్లో పెట్టుకుంటారు. కానీ గోళ్లు కొరకటం దగ్గరికి వస్తే రెండు చేతుల వేళ్లన్నింటినీ కొరుకుతుంటారు. గోళ్లు పొట్టిగా అవుతాయి. కొందరైతే  గోరును మొదలు వరకూ కొరుకుతారు. దీంతో గోరు కింద చర్మం ఎర్రగా అవుతుంది. నొప్పి, వాపూ తలెత్తొచ్చు. గోళ్లు పెళుసుగా, వంకర టింకరగా అవుతాయి. కొందరైతే కొరకటానికి గోళ్లు మిగలకపోతే చుట్టుపక్కల చర్మాన్నీ వదలరు. దీంతో చేతులు చూడటానికి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి.

ఇన్‌ఫెక్షన్లు కూడా..

నోట్లో బోలెడన్ని బాక్టీరియా, వైరస్‌లుంటాయి. ఇవి లాలాలజం ద్వారా వేలి కొసలకు, గోరు అడుగు భాగానికి చేరుకుంటాయి. వేళ్లు అదేపనిగా తడిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లే కాదు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లూ తలెత్తొచ్చు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చాలా కష్టం. తరచూ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటే యాంటీబయాటిక్‌, యాంటీ ఫంగల్‌ మందులు వేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఒకవేళ గోళ్లు గట్టిగా ఉన్నట్టయితే కొరికినప్పుడు పళ్లూ దెబ్బతినొచ్చు. ముక్కలు కావొచ్చు. నోట్లోనూ ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. పొరపాటున గోళ్లను మింగితే అవి జీర్ణం కావు. జీర్ణాశయంలో, పేగుల్లో చికాకు కలిగిస్తాయి. పేగులతో పాటు బ్యాక్టీరియా లోపలికి వెళ్తే ఇన్‌ఫెక్షన్లకూ దారితీయొచ్చు.

ఆత్మవిశ్వాసానికీ దెబ్బే

కొరకటం వల్ల గోళ్లు వికారంగా కనిపిస్తాయి. వేళ్ల మీద పుండ్లూ పడొచ్చు. దీంతో చేతులను దాచుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. నలుగురిలోకి రావటానికి ఇబ్బంది పడొచ్చు. ఆత్మ విశ్వాసమూ తగ్గొచ్చు. ఇది కెరియర్‌ మీదా ప్రభావం చూపొచ్చు.

గేలి చేస్తే లాభం లేదు

ఎప్పుడు, ఎందుకు మొదలైనా కూడా గోళ్లు కొరకటమనేది సమస్యాత్మక అలవాటే. దీన్ని వదిలించుకోవటం అంత తేలిక కాదు. కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే గోళ్లు కొరకటం ఆపేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆటలాడేలా ప్రోత్సహించటం మంచిది. కరాటే వంటి యుద్ధవిద్యలు నేర్పించినా మేలే. ఇలాంటివి గోళ్లు కొరకటం నుంచి మనసును మళ్లిస్తాయి. ఆందోళన తగ్గిస్తాయి, ఆత్మవిశ్వాసం పెంచుతాయి. తోటి పిల్లల సమక్షంలో గోళ్లు కొరకటాన్ని నామోషీగానూ భావిస్తారు. దేని గురించైనా ఆందోళన చెందుతున్నా, ఆదుర్దాగా ఉన్నా ధైర్యాన్ని కల్పించాలి. గేలి చేయటం, కొట్టటం, తిట్టటంతో ప్రయోజనం ఉండదని గుర్తించాలి. ఇవి అలవాటును మరింత ఎక్కువ చేసే ప్రమాదముంది.

వదిలించుకోవటమెలా?

  • ఎప్పటికప్పుడు పెరిగిన గోళ్లను కత్తిరించాలి. పొట్టిగా ఉంటే కొరకటానికి గోళ్లు అనువుగా ఉండవు. కొరకాలనే కోరికా తగ్గుతుంది.
  •  గోళ్లకు చేదు రుచిని పూయొచ్చు. ఇప్పుడు చేదు రుచితో కూడిన పాలిష్‌ కూడా అందుబాటులో ఉంటోంది. ఇది నోట్లోకి వెళ్లినా హాని చేయదు. చేదుగా ఉండటం వల్ల కొరికినప్పుడు వికారంగా అనిపిస్తుంది. గోళ్లకు టేపు చుట్టటం, చేతులకు గ్లవుజులు ధరించటమూ మేలు చేస్తాయి.
  •  గోళ్లు కొరకటానికి బదులుగా మంచి అలవాట్లు చేసుకోవటమూ ఉపయోగ పడుతుంది. గోరు కొరకాలని అనిపించి నప్పుడు మెత్తటి బంతిని నొక్కటం, ర్యూబిక్‌ క్యూబ్‌ ఆడటం వంటివి చేయొచ్చు. దీంతో చేతులకు కావాల్సినంత పని దొరుకుతుంది. చేయి నోటికి దూరంగా ఉండటం వల్ల కొరకటం తగ్గుతుంది.
  •  గోళ్లు కొరకటాన్ని ప్రేరేపించే ఆందోళన, ఒత్తిడి వంటి కారకాలను గుర్తించాలి. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవటం ద్వారా సమస్యకు పరిష్కారమూ లభిస్తుంది.
  •  క్రమంగా అలవాటును మానుకునే ప్రయత్నం చేయాలి. ముందుగా బొటనవేలు కొరకటం ఆపేయొచ్చు. దీన్ని సాధిస్తే ఇతర వేళ్లకూ వర్తింపజేయొచ్చు. మొత్తమ్మీద గోరును అసలే కొరకొద్దనే లక్ష్యాన్ని పెట్టుకొని, సాధన చేయాలి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని