వారికి రక్తం గడ్డల ముప్పు

రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు మగవారికి ఎక్కువ. కానీ మహిళలకూ దీని ముప్పు పొంచి ఉంటుంది. గర్భం ధరించటం, గర్భనిరోధక మాత్రలు, నెలసరి నిలిచాక హార్మోన్‌ చికిత్స తీసుకోవటం మహిళల్లో రక్తం గడ్డలకు దోహదం చేస్తుంటాయి.

Published : 03 Oct 2023 00:03 IST

రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు మగవారికి ఎక్కువ. కానీ మహిళలకూ దీని ముప్పు పొంచి ఉంటుంది. గర్భం ధరించటం, గర్భనిరోధక మాత్రలు, నెలసరి నిలిచాక హార్మోన్‌ చికిత్స తీసుకోవటం మహిళల్లో రక్తం గడ్డలకు దోహదం చేస్తుంటాయి. ఇది చాలావరకు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌తో ముడిపడి ఉండటం గమనార్హం. ఇదొక్కటే కాకుండా ఫ్యాక్టర్‌ వీ లీడెన్‌ (ఎఫ్‌వీఎల్‌) జన్యుమార్పు.. ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, కిడ్నీ జబ్బు వంటి ఇతరత్రా సమస్యలూ రక్తం గడ్డలకు దోహదం చేస్తున్నట్టు క్వీన్స్‌ మేరీలాండ్‌ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు గుర్తించారు. ఎఫ్‌వీఎల్‌ జన్యుమార్పు గలవారు ఈస్ట్రోజన్‌ వాడితే రక్తం గడ్డలు ఏర్పడే ముప్పు రెండింతలు పెరుగుతున్నట్టు బయటపడింది. ఈస్ట్రోజన్‌ తీసుకుంటూ రెండు ఇతరత్రా సమస్యలు గలవారిలో కేవలం 5% మందిలోనే రక్తం గడ్డలు ఏర్పడగా.. అదే ఎఫ్‌వీఎల్‌ జన్యుమార్పు కూడా తోడైనవారిలో ముప్పు సుమారు 20% వరకు ఎగబాకింది. ఊబకాయం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, కిడ్నీ జబ్బులు గలవారిలో రక్తం గడ్డల ముప్పు 8 రెట్లు ఎక్కువగానూ ఉంటోంది. ఈ సమస్యలు గల ప్రతి ఆరుగురిలో ఒకరికి ప్రమాదం పొంచి ఉంటున్నట్టు గుర్తించారు. మూడు సమస్యలతో బాధపడేవారికి 5 రెట్లు, రెండు సమస్యలు గలవారికి 2 రెట్లు ఎక్కువగా ముప్పు పొంచి ఉంటున్నట్టు తేలింది. చాలామంది మహిళలు ఏదో ఒక దశలో ఈస్ట్రోజన్‌ వాడుతుంటారు. ఇది చాలావరకు సురక్షితం. దీంతో కీడు కన్నా మేలే ఎక్కువ. జన్యుమార్పులు, ఇతరత్రా సమస్యలు దీనికి తోడైతే ప్రమాదం పొంచి ఉంటున్న సంగతి చాలామందికి తెలియదు. ఈ నేపథ్యంలో తాజా అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. రక్తనాళాల్లో ఏర్పడే రక్తం గడ్డలు మెదడు వంటి అవయవాలకు చేరుకుంటే తీవ్ర అనర్థాలకు దారితీస్తాయి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని