గాలి కాలుష్యంతో పక్షవాతం

పక్షవాతం ముప్పు కారకాలనగానే అధిక రక్తపోటు, ఊబకాయం, బద్ధకం, సరైన ఆహారం తినకపోవటం, పొగ తాగటమే ముందుగా గుర్తుకొస్తాయి. పెరిగే వయసు, ఆందోళన, కుంగుబాటు, అధిక కొలెస్ట్రాల్‌ వంటివీ దోహదం చేస్తాయి

Published : 03 Oct 2023 00:03 IST

పక్షవాతం ముప్పు కారకాలనగానే అధిక రక్తపోటు, ఊబకాయం, బద్ధకం, సరైన ఆహారం తినకపోవటం, పొగ తాగటమే ముందుగా గుర్తుకొస్తాయి. పెరిగే వయసు, ఆందోళన, కుంగుబాటు, అధిక కొలెస్ట్రాల్‌ వంటివీ దోహదం చేస్తాయి. వీటికిప్పుడు గాలి కాలుష్యాన్నీ జోడించుకోవాల్సిన అవసరమొచ్చింది. కలుషిత గాలితో పక్షవాతం ముప్పు 30% పెరుగు తున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ జోర్డాన్‌ పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 110 పరిశీలన అధ్యయనాలను సమీక్షించి ఈ విషయాన్ని గుర్తించారు. గాలి కాలుష్యం ప్రభావం ఊపిరితిత్తులు, కళ్లకు మాత్రమే పరిమితం కావటం లేదు.. ఇది మెదడు, గుండె రక్తనాళాల వ్యవస్థనూ దెబ్బతీస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన అహ్మద్‌ టుబసి చెబుతున్నారు. కలుషిత గాలిలోని రకాలను బట్టి పక్షవాతం ముప్పు మారిపోతోందనీ వివరిస్తున్నారు. నైట్రోజన్‌ డయాక్సైడ్‌ ప్రభావానికి గురయ్యాక ఐదు రోజుల వరకు పక్షవాతం ముప్పు 30% పెరుగుతుండగా, కార్బన్‌ మోనాక్సైడ్‌తో 26% ఎక్కువవుతోంది. సల్ఫర్‌ డయాక్సైడ్‌తో 15%, ఓజోన్‌ ప్రభావంతో 5% ముప్పు పెరుగుతోంది. అంతేనా? పక్షవాతంతో మరణించే ముప్పు నైట్రోజన్‌ డయాక్సైడ్‌తో 33%, సల్ఫర్‌ డయాక్సైడ్‌తో 60% అధికంగా ఉంటోంది కూడా. గాలిలోని నుసి పదార్థాన్ని పీల్చుకున్నప్పుడు అది ఊపిరితిత్తుల్లో వాపు, చికాకును కలగజేస్తుంది. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ ప్రేరేపితమై గుండె రక్తనాళ వ్యవస్థ మీద దాడి చేస్తుంది. ఇదే పక్షవాతానికి దారితీస్తోందని పరిశోధకులు పేర్కొంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని