disease: మణికట్టులో జబ్బుల ఆనవాళ్లు!

డాక్టర్లు మణికట్టు వద్ద వేళ్లు ఆనించి నాడిని చూడటం తెలిసిందే. ఇలా గుండె వేగం, గుండె కొట్టుకునే తీరును తెలుసుకుంటారు.

Updated : 10 Oct 2023 01:22 IST

డాక్టర్లు మణికట్టు వద్ద వేళ్లు ఆనించి నాడిని చూడటం తెలిసిందే. ఇలా గుండె వేగం, గుండె కొట్టుకునే తీరును తెలుసుకుంటారు. మున్ముందు మణికట్టు వద్ద ఉష్ణోగ్రతను చూసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, కాలేయ జబ్బు, కిడ్నీ వైఫల్యం వంటి పలు రకాల జబ్బుల ముప్పును పట్టించగలదని తాజాగా బయటపడింది మరి. నిరంతరం మణికట్టు వద్ద ఉష్ణోగ్రతను పరిశీలిస్తే ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 73 రకాల జబ్బుల ఆనవాళ్లను గుర్తించే అవకాశముందని పెన్‌ మెడిసిన్‌ అధ్యయనం పేర్కొంటోంది. ఇందులో 92వేల మందిని ఎంచుకొని, డిజిటల్‌ పరికరాల సాయంతో నిరంతరం వారం పాటు మణికట్టు ఉష్ణోగ్రతను నమోదు చేశారు. నిద్ర, మెలకువల తీరుతెన్నులు.. చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి నిద్రిస్తున్నప్పుడు శరీర మూల ఉష్ణోగ్రత తగ్గటం వంటి వాటినీ విశ్లేషించారు. రోజువారీ పనులు చేస్తున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు నమోదైన కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతల మధ్య తేడాను లెక్కించారు. ఈ తేడా గణనీయంగా తగ్గినవారికి జబ్బుల ముప్పు పొంచి ఉంటున్నట్టు గుర్తించారు. ఉదాహరణకు- కాలేయ కొవ్వు ముప్పు 91%, మధుమేహం ముప్పు 69%, కిడ్నీ వైఫల్యం ముప్పు 25%, అధిక రక్తపోటు ముప్పు 23%, న్యుమోనియా ముప్పు 22% పెరుగుతుండటం గమనార్హం. శరీర ఉష్ణోగ్రత తీరుతెన్నులు అస్తవ్యస్తం కావటాన్ని జీవక్రియ రుగ్మత, మధుమేహం వంటి కొన్ని జబ్బులతోనే ముడిపెట్టి చూసేవారు. ఇప్పుడిది రకరకాల జబ్బులకు సంకేతం కావొచ్చని తేలటంతో దీన్ని వివిధ జబ్బులను పట్టుకోవటానికీ వాడుకునే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎంతోమంది స్మార్ట్‌ వాచ్‌ల వంటివి వాడుతున్నారు. వీటిల్లో శరీర ఉష్ణోగ్రతను గుర్తించే గ్రాహకాలూ ఉంటున్నాయి. మున్ముందు ఈ ఉష్ణోగ్రతల మధ్య తేడా డిజిటల్‌ బయోమార్కర్‌గానూ ఉపయోగపడొచ్చు. దీని ఆధారంగా ఆయా జబ్బుల ముప్పును ముందుగానే అంచనా వేసినా ఆశ్చర్య పోనవసరం లేదు. నివారణ మార్గాలను ఎంచుకోవటానికి, చికిత్సల కోసమూ వాడుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని