ప్రమాదమా..? తొలిగంట బంగారం

అప్పటివరకు అంతా బాగానే ఉంటుంది. జీవితం సాఫీగానే సాగుతుంటుంది. అంతలో అనూహ్య ఘటన. రోడ్డు ప్రమాదమో, కింద పడటమో, మంటలు అంటుకోవటమో, ఇంటి మీది నుంచి జారటమో.. కారణమేదైతేనేం?

Updated : 17 Oct 2023 07:00 IST

నేడు వరల్డ్‌ ట్రామా డే

అప్పటివరకు అంతా బాగానే ఉంటుంది. జీవితం సాఫీగానే సాగుతుంటుంది. అంతలో అనూహ్య ఘటన. రోడ్డు ప్రమాదమో, కింద పడటమో, మంటలు అంటుకోవటమో, ఇంటి మీది నుంచి జారటమో.. కారణమేదైతేనేం? హఠాత్తుగా ఎదురయ్యే ఓ అపాయకర ఘటన (ట్రామా). తీవ్ర గాయాలకు కారణమయ్యే ఇలాంటి ఘటనలు జీవితాన్నే అతలాకుతలం చేసేస్తాయి. ప్రమాదం మరీ తీవ్రమైనదైతే అప్పటికప్పుడో, ఆ తర్వాతో ప్రాణాపాయమూ సంభవించొచ్చు. ప్రాణాలతో బయటపడినా కొన్నిసార్లు అంగ వైకల్యానికీ దారితీయొచ్చు. మానసికంగా కుంగదీయొచ్చు, ఆర్థికంగా దెబ్బతీయొచ్చు. ప్రకృతి విపత్తుల వంటి దుర్ఘటనలు మన చేతుల్లో ఉండవు గానీ మానవ తప్పిదంతో తలెత్తే ప్రమాదాలను చాలావరకు నివారించుకోవచ్చు. ఒకవేళ ప్రమాదం బారినపడ్డా సత్వరం స్పందిస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా, వైకల్యం బారినపడకుండా కాపాడొచ్చు.

ప్రమాదమనేది చెప్పి రాదు. రోడ్డు మీదే కాదు.. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడైనా ప్రమాదం జరగొచ్చు. చాలాసార్లు మన అలసత్వం, నిర్లక్ష్యమే దీనికి కారణం అవుతుంటుంది. ఒకరకంగా ట్రామాను అభివృద్ధితో ముడిపడిన నిర్లక్ష్య సమస్యగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు రోడ్లు విస్తరించాయి. ప్రయాణాలు పెరిగాయి. వాహనాల వేగమూ ఎక్కువైంది. పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలు సరే సరి. ఇవన్నీ వాహన ప్రమాదాలు, ఇంటి మీది నుంచి పడిపోవటం, అగ్ని ప్రమాదాల వంటి వాటికి కారణమవుతున్నాయి. అధిక తీవ్రతతో కూడిన ప్రమాదాలకు తక్కువ వయసువారే.. సాధారణంగా 15-44 ఏళ్లవారే ఎక్కువగా గురవుతుంటారు. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ప్రయాణాలు ఎక్కువగా చేసేది వీళ్లే. చిన్నవయసులో ప్రమాదాలకు గురికావటం రెండిందాలా హాని చేస్తుంది. సంపాదించే వ్యక్తి గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా కుటుంబం ఆర్థికంగా చితుకుతుంది. సమాజానికీ నష్టమే. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాదాల నివారణే కాదు.. వీటి బారినపడ్డవారి పునరావాసమూ కీలకమేనని నొక్కి చెబుతోంది.

చిన్న సమస్య కాదు

గాయాల విషయంలో చెప్పుకోవాల్సింది రోడ్డు ప్రమాదాల గురించే. రోజూ ఇవి చూస్తున్నవే. వీటి మూలంగా ఏటా మనదేశంలో సుమారు 15 లక్షల మందికి పైగా  మరణిస్తున్నారని అంచనా. ఒకప్పుడు ప్రతి 8 నిమిషాలకు ఒకరు చనిపోతే.. ఇప్పుడు ప్రతి 2 నిమిషాలకు ఒకరు మరణించే పరిస్థితి నెలకొంది. రోడ్డు పక్కన నడిచే, రోడ్డు దాటే పాదచారులు.. సైకిల్‌ తొక్కేవారు, ద్విచక్ర వాహనాలు నడిపేవారే ఎక్కువగా మృత్యువాత పడుతుండటం గమనార్హం. మరెంతోమంది కాళ్లూ చేతులు, చూపు కోల్పోవటం.. వెంటిలేటర్‌ మీద ఆధారపడటం, మెదడుకు దెబ్బతగలటం వల్ల మూర్ఛ వంటి జబ్బులతో బాధపడుతున్నారు కూడా. దీని మూలంగా ఉత్పాదనా తగ్గుతోంది. కేవలం రోడ్డు ప్రమాదాలతోనే జీడీపీలో 2.5% ఉత్పాదన పడిపోతోంది. అలాగని గాయాలన్నింటికీ రోడ్డు ప్రమాదాలే కారణం కాదు. ఎత్తుల నుంచి కింద పడటం, తగాదాలు, హింసాత్మక అల్లర్ల వంటివీ తీవ్ర గాయాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు భవనాల మీది నుంచి కింద పడిపోవటం చూస్తున్నాం. వ్యవసాయ పనుల్లోనూ ట్రాక్టర్‌ బోల్తా పడటమో, ట్రాక్టర్‌ మీది నుంచి జారటం, నాగలి పొరపాటున ఛాతీకి తాకటం వల్లనో కొందరు ప్రమాదాలకు గురవుతుంటారు. అగ్ని ప్రమాదాలూ తరచూ చూసేవే. భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తులు, ఉగ్రవాద దాడులు సైతం దుర్ఘటనలకు కారణమవుతుంటాయి.

మరణం మూడు రకాలు

రోడ్డు ప్రమాదాలు, గాయాలకు గురైనవారిలో మూడు రకాలుగా మరణం సంభవించొచ్చు. ఒకటి- వెంటనే చనిపోవటం. తీవ్ర గాయాల మూలంగా మెదడులో రక్తస్రావం, గుండె రక్తనాళాలు చిట్లిపోవటం, గుండె పైపొర ఛిద్రం కావటం వంటి వాటితో తక్షణం చనిపోవచ్చు. గుండె, శ్వాసను నియంత్రించే మెదడులోని మధ్యభాగానికి తీవ్ర దెబ్బతగిలి, రక్తస్రావమైతే వెంటనే మరణిస్తుంటారు. వీరి విషయంలో చేయగలిగిందేమీ లేదు. రెండు- రక్తనాళాలు దెబ్బతినటం వల్ల శరీరం లోపల, వెలుపల రక్తస్రావం కావటం వల్ల ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల తర్వాత మరణించటం. వీరి విషయంలో సత్వరం స్పందించి, ఆసుపత్రికి తరలిస్తే చాలావరకు ప్రాణాలను కాపాడు కోవచ్చు. మూడు- అవయవాలు విఫలం కావటం వల్ల చనిపోవటం. ఇది సాధారణంగా కొద్ది రోజులు, నెలల తర్వాత సంభవిస్తుంది. దీనికి చాలావరకు ప్రమాదంతో తలెత్తిన సమస్యలు కారణమవుతుంటాయి.

భయపడొద్దు

అంబులెన్స్‌కు ఫోన్‌ చేయటం, పోలీసులకు సమాచారం ఇవ్వటం వల్ల కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని కొందరు భయపడుతుంటారు. ఇది నిజం కాదు. క్షతగాత్రులకు సహాయం చేస్తే న్యాయపరమైన చిక్కులేవీ ఎదురుకావని అంతా తెలుసుకోవాలి. బాధితులకేమైనా అయినా తమకు తోచినంతలో సహాయం చేసినట్టుగానే చట్టం భావిస్తుంది.

మానసిక వేదనతోనూ..

ప్రమాదాలకు గురైనవారు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోలేకపోవటం.. అవయవాలు కోల్పోవటం వంటివి తీవ్ర మానసిక వేదను గురిచేస్తాయి. దీంతో చాలామంది మానసిక ఒత్తిడిలో, నిరాశలో కూరుకుపోతుంటారు. కుంగుబాటుకు లోనవుతుంటారు. వీటి నుంచి బయటపడటానికి మద్యం తాగటం వంటి దురలవాట్లూ చేసుకోవచ్చు. అంగ వైకల్యం బారినపడ్డవారిలో కొందరికి కోల్పోయిన కాళ్లూ, చేతుల వంటివి భాగాల్లో నొప్పి పుడుతున్నట్టూ (ఫాంటమ్‌ లింబ్‌ పెయిన్‌) బాధపడుతుంటారు. అందువల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా ఉండటం, అవసరమైతే మానసిక నిపుణులతో చికిత్స చేయించటం అవసరం. యోగా, ధ్యానం మేలు చేస్తాయి.నా ఫోన్‌ చేయొచ్చు. అంబులెన్స్‌ వచ్చేలోపు తగు సపర్యలు చేసి, రక్తస్రావాన్ని వీలైనంతవరకు ఆపగలిగితే ప్రాణాపాయం ముప్పు తగ్గుతుంది.

  • కొన్నిసార్లు గుండె, శ్వాస ఆగకుండా చూసే సీపీఆర్‌ అవసరమవ్వచ్చు. ఛాతీ మధ్యలో చేతులను పెట్టి బలంగా నొక్కుతూ, వదిలినా చాలు. ఇదీ ప్రాణాలను కాపాడుతుంది. పక్కటెముకలు విరిగినా అత్యవసరమైనప్పుడు సీపీఆర్‌ చేయొచ్చు. పక్కటెముకలు విరిగితే అతుకుతాయి. కానీ ప్రాణం పోతే తిరిగిరాదని తెలుసుకోవాలి. కాకపోతే ఛాతీ మధ్యలో పెద్ద గాయమైతే సీపీఆర్‌కు అవకాశముండదు.
  • స్పృహ కోల్పోయినవారికి నీళ్ల వంటివేవీ తాగించొద్దు. ద్రవాలు శ్వాసనాళంలోకి వెళ్లే ప్రమాదముంది. స్పృహలో ఉన్నవారు మాటలకు స్పందిస్తున్నట్టయితే అవసరాన్ని బట్టి నీళ్లు తాగించొచ్చు.

 ఇటీవల చుట్టూ గుమిగూడినవారు మొబైల్‌ఫోన్లతో ఫొటోలు, వీడియోలు తీయటం ఎక్కువైంది. ఇది మంచి పద్ధతి కాదు.


అత్యవసర చికిత్స పద్ధతిగా..

తీవ్రంగా గాయపడినవారికి అత్యవసర చికిత్స తప్పనిసరి. వీలైనంత తక్కువ వైకల్యంతో ప్రాణాలను కాపాడటమే దీని ఉద్దేశం. చికిత్స మరుక్షణం నుంచే అందాలి. దీన్ని పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంటుంది. అంబులెన్స్‌ సిబ్బందికి ఇందులో ప్రత్యేక శిక్షణ అవసరం.

  • క్షతగాత్రులు అచేతన స్థితిలో ఉన్నారు, దేనికీ స్పందించటం లేదు. మరోవైపు రక్తస్రావమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా చూడాల్సింది శ్వాస ఆడుతోందా? లేదా? అనే. శ్వాస ఆడకపోతే రక్తస్రావాన్ని ఆపినా ఫలితం ఉండదు కదా. వీరికి గొంతు వద్ద రంధ్రం చేసి, గొట్టాన్ని అమర్చి (ఇంట్యుబేషన్‌), కృత్రిమ శ్వాస కల్పించాల్సి ఉంటుంది. రక్తం బాగా కోల్పోతే వెంటనే సెలైన్‌ ఎక్కించాల్సి ఉంటుంది. స్పృహలో ఉన్నట్టయితే అవయవాల కదలికలు ఎలా ఉన్నాయో చూడాలి. ఒంట్లో ఎక్కడెక్కడ గాయాలయ్యాయో నిశితంగా పరిశీలించాలి.
  •  వీలైనంత త్వరగా సమీపంలోని ఆసుపత్రికి తరలించటం చాలా ముఖ్యం. ఒకవేళ అక్కడ అన్ని సదుపాయాలు లేకపోతే బాధితుల పరిస్థితి కుదుట పడ్డాక పెద్ద ఆసుపత్రికి తరలించాలి. అంతే తప్ప ముందే పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలని అనుకోవద్దు. ఆసుపత్రికి చేరేలోపు విలువైన సమయం వృథా కావొచ్చు. ప్రాణాల మీదికి రావొచ్చు.

    ముందు ప్రాణాపాయ సమస్యలకు

ఒంట్లో చాలా చోట్ల గాయాలైతే నిపుణుల బృందం చికిత్స అవసరమవుతుంది. రక్తనాళాలు, ఎముకలు, నాడులు, జీర్ణకోశ, జనరల్‌ శస్త్రచికిత్స నిపుణులు.. మత్తుమందు, మూత్రకోశ నిపుణులు అంతా కలిసి సమన్వయంతో చికిత్స చేయాల్సి ఉంటుంది. గాయాలతో కొందరికి ఊపిరితిత్తుల ఛిద్రమైతే గాలి బయటకు వచ్చి, ఛాతీ కుహరంలో నిండిపోవచ్చు. దీంతో ఛాతీ గోడ బిగుసుకుపోతుంది. వెంటనే గాలిని బయటకు తీయకపోతే గుండె కుంచించుకుపోయి, ఆగిపోవచ్చు. గుండె పొర చిట్లినప్పుడు అక్కడ రక్తం గూడు కట్టొచ్చు. దీన్ని వీలైనంత త్వరగా బయటకు తీయాల్సి ఉంటుంది. కాలేయం, ప్లీహం, కడుపులోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నా ప్రమాదమే. ఇలాంటి సమస్యలకు సత్వర చికిత్స అవసరం. ముందుగా ఇలాంటి ప్రాణాంతక సమస్యలకు.. తర్వాత కాళ్లూ, చేతులు విరగటం వంటి వాటికి చికిత్స చేయాల్సి ఉంటుంది.

  •  చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో మరింత శ్రద్ధ అవసరం. వీరికి చిన్న గాయాలైనా తీవ్రంగా పరిణమించొచ్చు. వృద్ధులకు మధుమేహం,  గుండె, కిడ్నీ జబ్బులు, ఛాతీ ఇన్‌ఫెక్షన్ల వంటి ఇతరత్రా సమస్యలు ఉన్నట్టయితే చికిత్స చేయటం కష్టం. పిల్లల్లో కొద్దిగా రక్తస్రావమైనా తీవ్రంగా పరిణమిస్తుంది. గర్భిణులకు గాయాలైతే తల్లి, బిడ్డను ఇద్దరినీ కాపాడుకోవటానికి శ్రమించాల్సి ఉంటుంది.
  •  ఒకప్పుడు అగ్ని ప్రమాదాలకు గురైనవారికి చర్మం 10-20% కన్నా ఎక్కువ కాలితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. అధునాతన చికిత్సలతో ఇప్పుడు ముఖం తప్ప 30% వరకు చర్మం కాలినా బతికించుకోవటం సాధ్యమవుతోంది.

    నివారణ మన చేతుల్లో

  • ప్రమాదాల్లో 90% మానవ తప్పిదాలతోనే జరుగుతాయి. అంటే ప్రమాదాలకు కారణం మనమే అన్నమాట. నివారించుకోవాల్సిన బాధ్యతా మనదే.
  • ట్రాఫిక్‌ నియమాలు కచ్చితగా పాటించాలి. వేగం మితిమీరొద్దు.
  •  ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా తలకు హెల్మెట్‌ ధరించాలి. కార్లు నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోవాలి.
  •  వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు మీదే దృష్టి సారించాలి. మొబైల్‌ ఫోన్లు చూడటం, తల పక్కకు తిప్పి మాట్లాడటం వంటివి చేయొద్దు.
  •  ఎక్కువ సేపు వాహనాలు నడుపుతుంటే మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకోవాలి.
  •  వాహనాల్లో ప్రాథమిక చికిత్స కిట్‌ ఉంచుకోవాలి. వాటిని ఉపయోగించటం నేర్చుకొని ఉండాలి.
  •  మద్యం తాగి వాహనాలు నడపొద్దు.
  •  ముందుగానే ప్రయాణానికి సిద్ధం కావాలి. ఆలస్యంగా బయలుదేరితే సమయానికి చేరుకోవాలనే ఆదుర్దాతో వేగంగా నడిపే ప్రమాదముంది.
  •  బ్రేకులు, టైర్లు, లైట్ల వంటివి ఎప్పటికప్పుడు సరిగా ఉండేలా చూసుకోవాలి.
  •  ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు రోడ్లను మరమ్మతు చేయాలి. శిక్షణ పొందిన పారామెడికల్‌ సిబ్బందితో, అధునాతన లైఫ్‌ సపోర్టుతో కూడిన అంబులెన్సులు నిరంతరం సిద్ధంగా ఉంచాలి. ఇవి ప్రమాదం జరిగిన చోటుకు 15 నిమిషాల్లోపు చేరుకునేలా అందుబాటులో ఉంచాలి. ట్రామా కేర్‌ సదుపాయాలు గల అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అకడమిక్‌ ఎమర్జెన్సీ విభాగాలు నెలకొల్పాలి.  
  •  పెద్దవాళ్లు చిన్న పిల్లలను కనిపెట్టుకొని ఉండాలి. ఒంటరిగా కారిడార్‌లో, రోడ్ల మీద తిరగనీయొద్దు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని