రాత్రి వెలుగుతో కుంగొద్దు!

కుంగుబాటు (డిప్రెషన్‌) బారినపడకూడదని భావిస్తున్నారా? అయితే రాత్రిపూట మరీ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోండి. అలాగే పగటి వేళల్లో సహజ వెలుగులో గడపండి.

Published : 14 Nov 2023 00:03 IST

కుంగుబాటు (డిప్రెషన్‌) బారినపడకూడదని భావిస్తున్నారా? అయితే రాత్రిపూట మరీ ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోండి. అలాగే పగటి వేళల్లో సహజ వెలుగులో గడపండి. మానసిక ఆరోగ్యానికిది సరళమైన, సమర్థ పద్ధతిగా ఉపయోగపడుతున్నట్టు మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు మరి.

న ఆరోగ్యంలో శరీరంలోని జీవగడియారం కీలక పాత్ర పోషిస్తుంది. నిద్ర, మెలకువలను నియంత్రించే ఇది వాతావరణంలో వెలుగు మార్పుల ఆధారంగానే నడుచుకుంటుంది. వ్యాయామం, ఉష్ణోగ్రత, పనుల వంటివీ జీవ గడియారం మీద ప్రభావం చూపినప్పటికీ అన్నింటికన్నా ముఖ్యమైంది వెలుతురే. చాలా మానసిక సమస్యల్లో ప్రధానంగా కనిపించేది జీవగడియారం అస్తవ్యస్తం కావటమే. అందువల్ల మానసిక జబ్బులకు కారణమయ్యే పర్యావరణ అంశాల్లో తేలికగా మార్చుకోదగింది వెలుగేనని చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మానసిక జబ్బులపై రాత్రి, పగలు వెలుతురు ప్రభావాల మీద మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యయనం నిర్వహించారు. యూకే బయోబ్యాంకు నుంచి సుమారు 87 వేల మందిని ఎంచుకొని కాంతి ప్రభావం, నిద్ర, శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యం తీరుతెన్నులను నిశితంగా విశ్లేషించారు. రాత్రుళ్లు పెద్ద మొత్తంలో కాంతి ప్రభావానికి గురైనవారికి 30% వరకు కుంగుబాటు ముప్పు పెరుగుతున్నట్టు గుర్తించారు. అదే సమయంలో పగటి వెలుగు ప్రభావానికి ఎక్కువగా గురైనవారికి కుంగుబాటు ముప్పు 20% వరకు తగ్గుతోందనీ తేల్చారు. తమను తాము గాయపరచుకోవటం, మతి భ్రమణం, తరచూ భావోద్వేగాలు మారటం, ఆందోళన, బాధాకర సంఘటనల అనంతరం ఒత్తిడికి గురికావటం వంటి మానసిక సమస్యల విషయంలోనూ ఇలాంటి ధోరణులే కనిపించాయి. నివసించే ప్రాంతం, పర్యావరణం, శారీరక శ్రమ, నిద్ర, షిఫ్ట్‌ వేళలు, గుండె-జీవక్రియ ఆరోగ్యం వంటి వాటితో నిమిత్తం లేకుండానే ఈ కాంతి ప్రభావం కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.

ఆధునిక జీవితంలో మనమంతా బల్బుల వంటి వాటితో వచ్చే కృత్రిమమైన కాంతి.. అలాగే ఫోన్లు, కంప్యూటర్లు, టీవీ తెరల కాంతిలోనే ఎక్కువగా గడుపుతున్నాం. ఇది మనలోని జీవగడియారాన్ని తికమకపడేలా చేస్తుంది. పగటి వెలుగులో మరింత బాగా పనిచేసేలా పరిణామం చెందుతూ వచ్చిన మెదడుకిది పెద్ద సవాలుగా నిలుస్తుంది. ప్రస్తుతం రాత్రుల్లోనే కాదు.. పగటి పూట సైతం 90% వరకు ఇంట్లో, కార్యాలయాల్లో విద్యుత్తు వెలుగుల కిందే గడుపుతున్నాం. సహజ వెలుగు, చీకటితో పోల్చి చూస్తే ఈ కృత్రిమ వెలుగు పగటి పూట మసకగా, రాత్రిపూట చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ఇది శరీరాన్ని తికమకకు గురిచేసి, జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి పగటిపూట ప్రకాశవంతమైన సహజ కాంతి పడేలా, రాత్రిపూట చీకటిగా ఉండేలా చూసుకుంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ఇది తేలికైన పద్ధతని పరిశోధకులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని