పొగతాగితే క్యాన్సరేల?

సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగితే క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందనే సంగతి తెలుసు. ఇంతకీ పొగ క్యాన్సర్‌కు ఎలా దారితీస్తుంది?

Published : 14 Nov 2023 00:02 IST

సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగితే క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందనే సంగతి తెలుసు. ఇంతకీ పొగ క్యాన్సర్‌కు ఎలా దారితీస్తుంది? దీనికి సంబంధించి కెనడాలోని ఓంటారియో ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు ఓ కొత్త విషయాన్ని గుర్తించారు. ఇది క్యాన్సర్‌ నుంచి కాపాడే కవచాలను నిర్వీర్యం చేయటం ద్వారా క్యాన్సర్‌ కారకంగా మారుతున్నట్టూ, మరోవైపు క్యాన్సర్‌ చికిత్సలనూ మరింత కష్టం చేస్తున్నట్టు తేలింది. క్యాన్సర్‌ కణాలు ఎక్కడో ఉండవు. శరీరంలోంచే పుట్టుకొస్తాయి. వీటిని అణచివేసే రక్షణ వ్యవస్థలూ జన్యువులో ఉంటాయి. ఇవి డీఎన్‌ఏలో అనుచిత మార్పులు తలెత్తకుండా కాపాడతాయి. పూర్తిగా ఎదిగేంతవరకు అవి ప్రొటీన్లను తయారు చేయకుండా నిలువరిస్తాయి. ఇలా అసాధారణ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. పొగ సరిగ్గా ఈ రక్షణ వ్యవస్థలనే దెబ్బతీస్తోందని పరిశోధకులు గుర్తించారు. సుమారు 18 దేశాల నుంచి సేకరించిన 12వేల కణితి నమూనాలను పరిశీలించి ఈ విషయాన్ని తేల్చారు. డీఎన్‌ఏలో పొగతో ఏర్పడే ‘ముద్ర’కూ ఊపిరితిత్తిలో కణితులను నిలువరించే రక్షణ వ్యవస్థ మార్పులకూ బలమైన సంబంధం ఉంటున్నట్టు బయటపడింది. కణ నిర్మాణానికి మూలమైన కీలక ప్రొటీన్లను పొగ అలవాటు ఎలా నిర్వీర్యం చేస్తుందో, ఇది మన దీర్ఘకాల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తమ అధ్యయనం ఎత్తి చూపుతోందని పరిశోధకులు చెబుతున్నారు. అనారోగ్యకర ఆహారం, మద్యం వంటి ఇతర అంశాలూ డీఎన్‌ఏ మీద విపరీత ప్రభావం చూపుతాయని వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని