కూర్చోవటం కన్నా పడుకోవటమే మేలు!

ఆశ్చర్యంగా అనిపించినా కూర్చోవటం కన్నా పడుకోవటమే మేలు! అదేపనిగా కూర్చునేవారి విషయంలో ఇది ముమ్మాటికీ నిజమేనని తాజాగా యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ప్రస్తుతం పెద్దవారిలో బద్ధకం బాగా పెరిగిపోయింది

Updated : 29 Nov 2023 17:13 IST
ఆశ్చర్యంగా అనిపించినా కూర్చోవటం కన్నా పడుకోవటమే మేలు! అదేపనిగా కూర్చునేవారి విషయంలో ఇది ముమ్మాటికీ నిజమేనని తాజాగా యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంటోంది. ప్రస్తుతం పెద్దవారిలో బద్ధకం బాగా పెరిగిపోయింది. రోజుకు సగటున 9.30 గంటల సేపు కదలకుండానే కూర్చుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీనికి బదులు నిలబడినా, కనీసం పడుకున్నా గుండె ఆరోగ్యం మెరుగు పడుతున్నట్టు తేల్చారు. ఐదు దేశాలకు చెందిన ఆరు అధ్యయనాలను విశ్లేషించి ఈ విషయాన్ని కనుగొన్నారు. సాధారణంగా మరింత ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారిలో గుండె ఆరోగ్యం ఇంకాస్త మెరుగ్గా ఉంటుంది. ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే హాని చేస్తుంది. దీనికి బదులు ఐదు నిమిషాల సేపు తీవ్రమైన లేదా ఒక మాదిరి శ్రమ చేసినా మంచి ఫలితం కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. కనీసం నిలబడినా, ఆ మాటకొస్తే పడుకున్నా కూడా కూర్చోవటం కన్నా మెరుగైన ఫలితం చూపిస్తోందని వివరిస్తున్నారు. ఉదాహరణకు- కూర్చోవటానికి బదులు అరగంట సేపు వ్యాయామం చేసిన 54 ఏళ్ల మహళలో శరీర ఎత్తు, బరువు నిష్పత్తి 2.4% తగ్గినట్టు తేలింది. అలాగే నడుం చుట్టుకొలత 2.7%, రక్తంలో గ్లూకోజు 3.6% తగ్గాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజు, ఒంట్లో కొవ్వు, కొలెస్ట్రాల్‌ ్జమోతాదులు తక్కువగా ఉంటాయి. నిద్ర కూడా బాగా పడుతుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి మేలు చేసేవేనని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని