మెనోపాజ్‌ తర్వాత టెస్టోస్టిరాన్‌ పరీక్షా?

టెస్టోస్టిరాన్‌ మోతాదులు తగ్గితే నిరాశ, నిస్సత్తువ, తికమక, ఏకాగ్రత కుదరకపోవటం వంటివి తలెత్తుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే నెలసరి నిలిచిన (మెనోపాజ్‌) తర్వాత మొదలయ్యే ఇబ్బందులతో సతమతమయ్యే మహిళలకు దీని చికిత్స మేలు చేస్తుందని సామాజిక మాధ్యమాలు ఊదర గొడతున్నాయి. కానీ నెలసరి నిలిచినవారందరికీ టెస్టోస్టిరాన్‌ పరీక్ష గానీ చికిత్స గానీ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.

Published : 21 Nov 2023 01:10 IST
టెస్టోస్టిరాన్‌ మోతాదులు తగ్గితే నిరాశ, నిస్సత్తువ, తికమక, ఏకాగ్రత కుదరకపోవటం వంటివి తలెత్తుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే నెలసరి నిలిచిన (మెనోపాజ్‌) తర్వాత మొదలయ్యే ఇబ్బందులతో సతమతమయ్యే మహిళలకు దీని చికిత్స మేలు చేస్తుందని సామాజిక మాధ్యమాలు ఊదర గొడతున్నాయి. కానీ నెలసరి నిలిచినవారందరికీ టెస్టోస్టిరాన్‌ పరీక్ష గానీ చికిత్స గానీ అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. టెస్టోస్టిరాన్‌ అనగానే ముందుగా మగవారే గుర్తుకొస్తారు. నిజానికిది మహిళలకూ ముఖ్యమైన హార్మోనే. రక్తనాళాలు, చర్మం, కండరాలు, ఎముకలు, రొమ్ము కణజాలం, మెదడు మీద ప్రభావం చూపుతుంది. ఇది మగవారిలో, ఆడవారిలో వేర్వేరు విధంగా పనిచేస్తుంది. పురుషుల్లో చాలావరకు టెస్టోస్టిరాన్‌ రూపంలోనే ఉండిపోతుంది. అదే ఆడవారిలో ఈస్ట్రోజన్‌గా మారుతుంది. వీరిలో ఇది మెనోపాజ్‌కు ముందు అండాశయాల్లో తయారవుతుంది. అండం ఎదగటానికి, ఈస్ట్రోజెన్‌ ఉత్పత్తి కావటానికి తోడ్పడుతుంది. అండాశయాలు టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రోజన్‌ రెండింటినీ రక్తంలోకి విడుదల చేస్తాయి. ఫలదీకరణ సమయంలో వీటి మోతాదులు ఎక్కువగా ఉంటాయి. కొంత టెస్టోస్టిరాన్‌ అండాశయాల వెలుపల కొవ్వు వంటి వాటిల్లోంచీ పుట్టుకొస్తుంది. అడ్రినల్‌ గ్రంథుల ద్వారా వెలువడే ప్రి హార్మోన్ల నుంచి ఇది తయారవుతుంది. నెలసరి నిలిచిన తర్వాత ఈ ప్రక్రియ ఆగుతుంది. మెనోపాజ్‌కు ముందు రక్తంలో ఈస్ట్రోజన్‌ కన్నా టెస్టోస్టిరాన్‌ ఎక్కువగా ఉంటుందని, కాబట్టే నెలసరి నిలిచాక దీని చికిత్స అవసరమనే వాదనకు బహుశా ఇదే కారణమై ఉండొచ్చు. అయితే అధ్యయనాలు దీన్ని నిరూపించటం లేదు. నెలసరి అయ్యే దశలో అన్ని వయసుల్లోనూ టెస్టోస్టిరాన్‌ కన్నా ఈస్ట్రోజన్‌ మోతాదులే ఎక్కువగా ఉంటున్నట్టు పేర్కొంటున్నాయి. ఆరోగ్యంగా ఉన్న మహిళల్లో 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో టెస్టోస్టిరాన్‌ స్థాయులు సుమారు 25% వరకు పడిపోతాయి. అండాశయాల్లో అండాల సంఖ్యతో పాటు ఇది ముడిపడి ఉంటుండటం గమనార్హం. అయితే అండాల సంఖ్య తగ్గటానికిది సూచనా? లేకపోతే అండాల సంఖ్య తగ్గటం వల్ల టెస్టోస్టిరాన్‌ పడిపోతోందా? అనేది తెలియదు. సుమారు 40 ఏళ్ల వయసు నుంచి టెస్టోస్టిరాన్‌ తగ్గటం నెమ్మదిస్తుంది. సహజంగా నెలసరి నిలిచే సమయానికి దీని మోతాదుల్లో ఎలాంటి మార్పూ ఉండదు. మెనోపాజ్‌లోకి అడుగిడే సమయానికి టెస్టోస్టిరాన్‌ మోతాదులు గణనీయంగా తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడి కాలేదు. కాబట్టి ఇది నార్మల్‌ కన్నా కిందికి పడిపోతుందని కచ్చితంగా చెప్పటానికి లేదు. నెలసరి నిలిచిన మహిళల్లో టెస్టోస్టిరాన్‌ పని చాలావరకు అది పుట్టుకొచ్చిన కణజాలాలకే పరిమితమవుతుంది. అది ఈస్ట్రోజన్‌గా మారటమో లేదా విచ్ఛిన్నమై తిరిగి రక్త ప్రసరణలో కలవటమో చేస్తుంది. అందువల్ల కణజాలాల్లోని టెస్టోస్టిరాన్‌ మోతాదులను రక్తంలోని మోతాదులు ప్రతిబింబించవు. కాబట్టి మహిళల్లో ‘తక్కువ టెస్టోస్టిరాన్‌’ అనేది అంత ముఖ్య విషయం కాదని.. నిస్సత్తువ, నిరుత్సాహం, కండరాల బలహీనత, మతిమరుపు వంటి వాటికి దీని చికిత్స అవసరం లేదని నిపుణులు వివరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని