నిద్ర ‘మత్తు’ వదలండి!

నిద్ర విషయంలో ఎన్నో అపోహలు. తక్కువ నిద్ర చాలనుకునేవారు కొందరు. కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకోవచ్చని భావించేవారు మరికొందరు. పక్కవారికి భంగం కలిగించనంతవరకు గురకతో ప్రమాదం లేదనుకునేవారూ లేకపోలేదు

Updated : 09 Dec 2023 18:35 IST

నిద్ర విషయంలో ఎన్నో అపోహలు. తక్కువ నిద్ర చాలనుకునేవారు కొందరు. కోల్పోయిన నిద్రను భర్తీ చేసుకోవచ్చని భావించేవారు మరికొందరు. పక్కవారికి భంగం కలిగించనంతవరకు గురకతో ప్రమాదం లేదనుకునేవారూ లేకపోలేదు. పడుకున్న వెంటనే నిద్ర పట్టేస్తే అంతా బాగున్నట్టేనని అనుకోవటమూ మామూలే. వీటిల్లో నిజమెంత?

ఐదు గంటల నిద్రయినా..

 రాత్రిపూట ఐదు గంటలు నిద్రపోయినా సరిపోతుందని కొందరి భావన. ఇది అందరిలో నిజం కాదు. కొందరు ఐదారు గంటలు నిద్రపోయినా హుషారుగా కనిపిస్తుండొచ్చు గానీ ఇలాంటి వారి సంఖ్య చాలా చాలా తక్కువ. మిగతా అందరికీ 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు సిఫారసు చేస్తుంటారు. తరచూ తగినంత నిద్ర పోకపోతే ఉత్సాహం, హుషారు సన్నగిల్లుతాయి. పనిలో నైపుణ్యమూ కొరవడుతుంది. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యల ముప్పూ పెరుగుతుంది.

కునుకు తీస్తే భర్తీ కాదు

రాత్రి సరిగా నిద్ర పోలేదు. నిద్ర మత్తుగా ఉంది. పగటి పూట కునుకు తీస్తే తిరిగి హుషారుగా అనిపిస్తుంది. అంత మాత్రాన రాత్రి నిద్ర భర్తీ అయినట్టు కాదు. రాత్రి మాదిరిగా పగటి నిద్ర నాలుగు దశలుగా సాగదు. మూడో దశ నిద్ర కొరవడుతుంది. రోగనిరోధక శక్తి ఇనుమడించటం, గాయాలు మానటానికి ఈ మూడో దశ నిద్రే ముఖ్యం. నిద్రలేమి, నిద్రలో కాసేపు శ్వాస ఆగటం (స్లీప్‌ అప్నియా) సమస్యలు ఉన్నట్టయితే పగటి నిద్ర చేటు చేసే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే పగటి నిద్ర మూలంగా రాత్రి పూట త్వరగా నిద్ర పట్టదు. జీవ గడియారమూ అస్తవ్యస్తమవుతుంది. కాబట్టి పగటి కునుకు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు 30 నిమిషాలు మించకుండా చూసుకోవాలి. అదీ మధ్యాహ్నం మూడు గంటల లోపే కునుకు తీయాలి. మరీ ఎక్కువసేపు నిద్రపోయినా, సాయంత్రం వరకూ పడుకున్నా మత్తుగా, తికమకగా అనిపించొచ్చు. తిరిగి రాత్రిపూట నిద్ర పట్టకపోవచ్చు.

గురకనూ పట్టించుకోవాలి

పక్కవారికి ఇబ్బంది కలిగించనంతవరకు గురకతో ఇబ్బందేమీ ఉండదనేది కొందరి నమ్మకం. ఇదేమీ సమస్య కాదని.. గురక పెట్టటం గాఢ నిద్రకు సూచననీ భావిస్తుంటారు. ఇది నిజం కాదు. నిద్రలో కాసేపు శ్వాస ఆగిపోయే (స్లీప్‌ అప్నియా) సమస్యకు గురక ఒక సంకేతం. కొందరిలో నిద్ర పోతున్నప్పుడు గొంతు వెనకాల భాగం వదులై, కిందికి జారుతుంది. ఇది శ్వాస మార్గానికి అడ్డుపడి, కాసేపు శ్వాస ఆగుతుంది. తిరిగి గట్టిగా శ్వాస తీసుకునే క్రమంలో పెద్దగా గురక పెడుతుంటారు. శ్వాస ఆగినప్పుడు రక్తంలో ఆక్సిజన్‌ తగ్గుతుంది. దీంతో నిద్ర నుంచి మెలకువ వస్తుంది కూడా. కొందరు గంటలో చాలాసార్లు నిద్ర నుంచి మేల్కొంటుంటారు కూడా. కాకపోతే నిద్రలో ఉండటం వల్ల ఇది తెలియదు. అలాగే రక్తంలో ఆక్సిజన్‌ తగ్గినప్పుడు గుండె మరింత బలంగా రక్తాన్ని పంప్‌ చేయాల్సి వస్తుంది. ఫలితంగా రక్తపోటూ పెరుగుతుంది. స్లీప్‌ అప్నియా గలవారికి గుండెజబ్బు, గుండెపోటు, మధుమేహం, అకాల మరణం ముప్పు పెరగటానికి ఇదీ ఒక కారణమే. అయితే గురక పెట్టే అందరిలో స్లీప్‌ అప్నియా ఉండకపోవచ్చు. ఈ సమస్య గలవారిలో 20% మంది అసలు గురక పెట్టకపోవచ్చు కూడా. మరెలా గుర్తించటం? పగటి పూట నిద్రమత్తుగా అనిపిస్తున్నా, ఉదయం తలనొప్పి వస్తున్నా, రక్తపోటు ఎక్కువగా ఉంటున్నా స్లీప్‌ అప్నియా ఉందేమోనని అనుమానించాలి. డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైతే నిద్ర తీరుతెన్నులను పరీక్షించి, సమస్యను నిర్ధరిస్తారు.

ఇట్టే నిద్ర పడుతున్నా..

కొందరు ఇలా పడుకోగానే అలా నిద్రపోతారు. ఇది మంచి ఆరోగ్యానికి సూచికనీ భావిస్తుంటారు. ఇది అన్నిసార్లూ నిజం కాదు. మానసిక ఒత్తిడి, బాధలు, ఇబ్బందులు లేకపోతే త్వరగా నిద్ర పట్టటంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ తరచూ పడుకున్న వెంటనే లేదా కుర్చీలో కూర్చున్నా కూడా నిద్ర పడుతుంటే మాత్రం సందేహించాల్సిందే. ఇది కంటి నిండా నిద్రపోవటం లేదనటానికి సూచిక కావొచ్చు. పగటి పూట హుషారుగా ఉంటూ పడుకున్న వెంటనే నిద్రపడితే ఆందోళనేమీ అవసరం లేదు. కానీ పగలు నిద్రమత్తు అనిపిస్తూ, పడుకున్న తక్షణం నిద్ర పోతే.. ముఖ్యంగా ఆఫీసులోనో, ఎవరితోనైనా మాట్లాడుతూనో నిద్ర ముంచుకొస్తే జాగ్రత్త పడాల్సిందే. దీనర్థం రాత్రిపూట సరిగా నిద్ర పట్టటం లేదనే.

మెలటోనిన్‌ సహజమే అయినా

కొందరు నిద్ర పట్టటానికి మెలటోనిన్‌ హార్మోన్‌ మాత్రలు వేసుకుంటుంటారు. ఇది సహజ హార్మోనేనని, దీంతో ఇబ్బందేమీ ఉండదని భావిస్తుంటారు. తక్కువ మోతాదులో మెలటోనిన్‌ తీసుకుంటే చాలావరకు సురక్షితమే. కానీ పెద్దమొత్తంలో వేసుకుంటే తలనొప్పి, రక్తపోటు పెరగటం లేదా తగ్గటం, పగటిపూట నిద్రమత్తు, వాంతుల వంటి సమస్యలు తలెత్తొచ్చు. సాధారణంగా మెలటోనిన్‌ను పడుకోవటానికి ఒకట్రెండు గంటల ముందు 0.3 మి.గ్రా. నుంచి 5 మి.గ్రా. మోతాదులో వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఈ నిర్ణీత మోతాదు తీసుకున్నా కూడా పగటిపూట నిద్రమత్తుగా అనిపించొచ్చు. వాంతుల వంటి సమస్యలు వేధించొచ్చు. గర్భనిరోధక, రక్తపోటు మాత్రలతోనూ మెలటోనిన్‌ చర్య జరుపుతుంది. దీన్ని గర్భం ధరించినప్పుడు వాడకూడదు కూడా. కాబట్టి మెలటోనిన్‌ వాడే ముందు డాక్టర్‌ సూచించిన జాగ్రత్తలను విధిగా పాటించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని