ఆత్మీయ ఆయుష్షు

అకాల మరణం ముప్పు తగ్గించుకోవాలని భావిస్తున్నారా? అయితే వీలైనంత ఎక్కువగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపండి.

Published : 26 Dec 2023 01:24 IST

అకాల మరణం ముప్పు తగ్గించుకోవాలని భావిస్తున్నారా? అయితే వీలైనంత ఎక్కువగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడపండి. స్నేహితులను, కుటుంబ సభ్యులను అంతగా కలుసుకోనివారికి అకాల మరణం ముప్పు అధికంగా ఉంటున్నట్టు బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ గ్లాస్గో అధ్యయనంలో బయటపడింది. పరిశోధకులు 38 నుంచి 73 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 4.50 లక్షల మంది సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించారు. ఇందులో భాగంగా నాలుగేళ్ల పాటు వీరి శారీరక ఆరోగ్యంతో పాటు సామాజిక సంబంధాలనూ పరిశీలించారు. ఎప్పుడెప్పుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు? ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుస్తున్నారా? నలుగురు కలిసే వేడుకల్లో, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? ఒంటరిగా జీవిస్తున్నారా? అనే అంశాలను క్షుణ్ణంగా విశ్లేషించారు. పన్నెండు సంవత్సరాల తర్వాత వీరిలో ఎంతమంది చనిపోయారో తెలుసుకోవటానికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తరచూ కలిసినవారితో పోలిస్తే.. ఆత్మీయులతో ఎన్నడూ కలవనివారికి అకాల మరణం ముప్పు సగటున 39% ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. వయసు, లింగ భేదం, శారీరక శ్రమ, సామాజిక ఆర్థిక స్థితి, దీర్ఘకాల జబ్బుల వంటి వాటితో సంబంధం లేకుండానే ఈ ఫలితం కనిపిస్తుండటం గమనించదగ్గ విషయం. రోజూ అనే కాదు.. వారానికోసారి, నెలకోసారి ఆత్మీయులు కలిసినా మరణం ముప్పు తగ్గుతుండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని