వేవిళ్లు ఎందుకు?

గర్భం ధరించిన తొలినాళ్లలో చాలామంది వేవిళ్లతో సతమతమవటం తెలిసిందే. వికారం, వాంతులతో తెగ ఇబ్బంది పడుతుంటారు. కొందరికైతే ఇవి చాలా తీవ్రంగానూ ఉంటాయి.

Published : 26 Dec 2023 01:30 IST

గర్భం ధరించిన తొలినాళ్లలో చాలామంది వేవిళ్లతో సతమతమవటం తెలిసిందే. వికారం, వాంతులతో తెగ ఇబ్బంది పడుతుంటారు. కొందరికైతే ఇవి చాలా తీవ్రంగానూ ఉంటాయి. దీన్ని హైపర్‌ఎమెసిస్‌ గ్రావిడేరమ్‌ (హెచ్‌జీ) అంటారు. దీంతో బరువు, ఒంట్లో నీటిశాతం తగ్గుతాయి. కొందరిని ఆసుపత్రిలో చేర్చాల్సిన పరిస్థితీ తలెత్తుతుంటుంది. ఇంతకీ వేవిళ్లు ఎందుకు వస్తాయి? దీనికి జీడీఎఫ్‌15 హార్మోన్‌ కారణమవుతున్నట్టు వివిధ దేశాల పరిశోధకుల అధ్యయనంలో బయటపడింది. గర్భధారణ సమయంలో జీడీఎఫ్‌15 మోతాదులు పెరుగుతాయి. అయితే దీనికి అందరూ ఒకేలా స్పందించటం లేదని పరిశోధకులు గుర్తించారు. గర్భధారణకు ముందు దీని మోతాదులు తక్కువగా ఉన్నవారు గర్భం ధరించిన తర్వాత అధికంగా స్పందిస్తున్నట్టు వెల్లడైంది. దీని ఆధారంగా చికిత్సలనూ పరిశోధకులు గుర్తించారు. గర్భధారణకు ముందు మందులతో జీడీఎఫ్‌15 మోతాదులకు ఎక్కువగా స్పందిచేలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తున్నట్టు ఎలుకలపై చేసిన ప్రయోగంలో బయటపడింది. ఈ హార్మోన్‌, దీని గ్రాహకాలను అడ్డుకునే యాంటీబాడీ చికిత్స కూడా పరిష్కారం చూపగలదని భావిస్తున్నారు.


 పిల్లలకు పీఎఫ్‌ఏల శాపం

 ఆహార ప్యాకేజీలు, సౌందర్య సాధనాలు, రోజూ వాడే ఇతర వస్తువుల్లో ఉండే పర్‌ అండ్‌ పాలీఫ్లోరోఆల్కైల్‌ (పీఎఫ్‌ఏ) రసాయనాలు యుక్తవయసు పిల్లల్లో ఎముక సాంద్రత తగ్గటానికి దారితీస్తున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. పీఎఫ్‌ఏలు ఎప్పటికీ క్షీణించవు. అందుకే వీటిని ‘అమర రసాయనాలు’ అని పిలుచుకుంటారు. ఇవి సంతానలేమి, క్యాన్సర్‌ ముప్పు పెరగటానికి దారితీస్తున్నట్టు గత అధ్యయనాల్లో బయటపడింది. ఇవి పిల్లల్లో ఎముక సాంద్రత తగ్గటం, ఎముకలు గుల్లబారే ముప్పు పెరగటానికీ కారణమవుతున్నట్టు కొత్తగా గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని