లాలాజలం ఎంతో ఘనం!

ఇష్టమైన వంటకాన్ని తలచుకోగానే ఎవరికైనా నోట్లో నీరూరుతుంది. లాలాజలం, ఉమ్మి అని ఎలా పిలుచుకున్నా ఇది ఆరోగ్యం విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది.

Updated : 09 Jan 2024 04:28 IST

ఇష్టమైన వంటకాన్ని తలచుకోగానే ఎవరికైనా నోట్లో నీరూరుతుంది. లాలాజలం, ఉమ్మి అని ఎలా పిలుచుకున్నా ఇది ఆరోగ్యం విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. మామూలుదే అనిపించినా దీని గురించి తెలిస్తే ఎంత ఘనమైనదో అనకుండా ఉండలేం.

నం తిన్న ఆహారం జీర్ణం కావటం నోటి నుంచే మొదలవుతుంది. ఇందులో లాలాజలం పాత్ర కీలకం. పదార్థాలను నములుతున్నప్పుడు లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఎంత గట్టిగా నమిలితే అంత ఎక్కువగా లాలాజలం పుట్టుకొస్తుంది. ఇది ఆహారాన్ని తడిగా, ముద్దగా చేసి మింగటానికి అనువుగా మారుస్తుంది. పదార్థాల రుచినీ తెలియజేస్తుంది. బుగ్గల లోపల, నాలుక కింద, పళ్లకు సమీపంలో ఉండే లాలాజల గ్రంథుల నుంచి ఉమ్మి తయారవుతుంది. సాధారణంగా రోజుకు సుమారు లీటరు నుంచి 2 లీటర్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇది చాలావరకు (సుమారు 99%) నీటితో కూడినదే అయినా ఇందులో వెయ్యికి పైగా వేర్వేరు రకాల ప్రొటీన్లు, ఖనిజాలు, ఇతర అణువులుంటాయి. ఇవి ఆహారం జీర్ణం కావటానికి, పళ్లు బలంగా ఉండటానికే కాదు.. దంతాల మీద గట్టి పింగాణీ పొర దెబ్బతినకుండానూ కాపాడతాయి. లాలాజలం నోటిని తడిగా ఉంచుతూ పళ్లు పుచ్చిపోకుండా, చిగుళ్ల జబ్బు దరిజేరకుండానూ చూస్తుంది. సూక్ష్మక్రిములను అడ్డుకునే యాంటీబాడీలు కూడా ఉండటం వల్ల ఇది నోటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఉత్పత్తి తగ్గటం

లాలాజలాన్ని పెద్దగా పట్టించుకోం గానీ ఇది మన జీవితంలో ఒక భాగం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇది ఎల్లవేళలా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఆశ్చర్యంగా అనిపించినా మనం మాట్లాడటానికీ లాలాజలం సాయం చేస్తుంది. మాట్లాడుతున్నప్పుడు పెదాలు, నాలుక, దంతాలు ఒక క్రమ పద్ధతిలో కదులుతుంటాయి కదా. ఇది నోట్లో తేమ మీదే ఆధారపడి ఉంటుంది. ఉమ్మి సరిగా ఉత్పత్తి కాకపోయినా, మరీ ఎక్కువగా ఉత్పత్తి అయినా సమస్యలకు దారితీస్తుంది. లాలాజలం తగ్గితే నోరు ఎండిపోతుంది. దీన్ని జెరొస్టోమియా అంటారు. ఉమ్మి తగినంత ఉత్పత్తి కాకపోయినా, లాలాజల అంశాల్లో మార్పులు తలెత్తినా ఈ సమస్య మొదలవుతుంది. ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు, ఒత్తిడికి గురైనప్పుడు తాత్కాలికంగా నోరు ఎండిపోవచ్చు. అయితే కొందరిలో ఇది దీర్ఘకాలం కొనసాగొచ్చు. దీంతో ముద్ద మింగటం కష్టమవుతుంది. పదార్థాల రుచీ తగ్గుతుంది. దీంతో ఆహారాన్ని ఆస్వాదించటమూ తగ్గుతుంది. నమలటం, మాట్లాడటంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి. నోరు ఎండిపోవటానికి అలర్జీ, ఆందోళన, అధిక రక్తపోటు వంటి సమస్యలకు వాడే కొన్ని రకాల మందులు.. క్యాన్సర్‌లో ఇచ్చే కీమో, రేడియో థెరపీలు కారణం కావొచ్చు. మధుమేహం, ఎయిడ్స్‌, షోగ్రెన్స్‌ వంటి జబ్బులూ దీనికి దారితీయొచ్చు. షోగ్రెన్స్‌ జబ్బులో లాలాజల గ్రంథులే కాదు, కన్నీటి గ్రంథులూ దెబ్బతింటాయి. దీంతో నోటితో పాటు కళ్లూ పొడిబారతాయి. దీన్ని నిర్ధరించటం కష్టం. ఎందుకంటే దీని లక్షణాలు ఇతరత్రా జబ్బులను పోలి ఉంటాయి. పొగ తాగే అలవాటు గలవారిలోనూ నోరు ఎండిపోవటం చూస్తుంటాం. ఇలాంటివారు నీరు ఎక్కువగా తాగటం మంచిది. చక్కెర లేని బిళ్లలూ చప్పరించొచ్చు. మరీ ఎక్కువగా ఎండిపోతే డాక్టర్లు కృత్రిమ లాలాజలంతో నోటిని పుక్కిలించుకోవాలని సూచిస్తారు.

ఉత్పత్తి పెరగటం

కొందరికి లాలాజలం అవసరానికి మించి ఉత్పత్తి కావొచ్చు. ఇది మితిమీరితే చొంగలా కారుతుంది. పిల్లలు తరచూ చొంగ కార్చటం మామూలే. పెద్దవారూ నిద్ర పోయినప్పుడు చొంగ కారుస్తుంటారు. ఇదేం సమస్య కాదు. ఒకటో రెండో లాలాజల గ్రంథులు అతిగా స్పందించటం, మింగటంలో ఇబ్బంది వంటివి దీనికి కారణం కావొచ్చు. కానీ కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్లు.. పార్కిన్సన్స్‌, పక్షవాతం వంటి నాడీ సమస్యలకు ఇదొక లక్షణం కావొచ్చు. దీనికి ఆయా కారణాలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. సమస్య మరీ తీవ్రమైతే లాలాజల ఉత్పత్తిని తగ్గించే మందులు ఉపయోగపడతాయి. డాక్టర్లు అవసరమైతే లాలాజల గ్రంథుల్లోకి బొటాక్స్‌ ఇంజెక్షన్లు ఇస్తుంటారు. శస్త్రచికిత్స చేసి లాలాజల గ్రంథులను లేదా లాలాజల మార్గాన్ని తొలగించొచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని