Heart Burn- Heart Attack: ఛాతీ మంటా? గుండె పోటా?.. తెలుసుకోండిలా!

గుండె పోటు (Heart Attack)ను ఛాతీ మంట (Heart Burn)గా భావించి వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారవచ్చు. అందుకే ఈ రెండింటి లక్షణాలను తెలుసుకోవడం చాలా అవసరం. 

Updated : 08 Jan 2023 16:50 IST

ఛాతీ మంట (Heart Burn), గుండెపోటు (Heart Attack) రెండూ వేర్వేరు సమస్యలు. జీర్ణాశయంలోని ఆమ్లం పైకి గొంతులోకి ఎగదన్నుకొని రావటం (జీఈఆర్‌డీ) వల్ల ఛాతీలో మంట తలెత్తుతుంది. ఇది మామూలు సమస్య. గుండె రక్తనాళాల్లో పూడికలు, రక్తం గడ్డలు ఏర్పడటం వల్ల రక్త సరఫరా ఆగిపోవటం గుండెపోటుకు మూలం. ఇది అత్యవసరమైన సమస్య. కొన్నిసార్లు ఛాతీ మంట, గుండెపోటు లక్షణాలు ఒకేలా కనిపిస్తుంటాయి. దీంతో కొందరు పొరపడుతుంటారు.

గుండెపోటును ఛాతీమంటగా భావించి ప్రాణాల మీదికి తెచ్చుకోవటమూ చూస్తున్నాం. అందువల్ల వీటి లక్షణాల మధ్య తేడాలను తెలుసుకొని ఉండటం మంచిది. ఏదేమైనా అనుమానం వస్తే డాక్టర్‌ను సంప్రదించి నివృత్తి చేసుకోవటం మంచిది. మామూలు ఛాతీమంట అయితే ఇబ్బందేమీ లేదు. అదే గుండెపోటు అయితే ప్రాణాపాయం తలెత్తకుండా చూసుకోవచ్చు.


తేడా ఏంటి?


గుండెపోటు

  • సాధారణంగా ఛాతీ మధ్యలో నొప్పి వస్తుంది. ఛాతీ బిగపట్టినట్టు, లోపలేదో పిండేస్తున్నట్టు, పొడుస్తున్నట్టు అనిపిస్తుంది. లేదూ నొప్పి స్వల్పంగా, వస్తూపోతూ ఉండొచ్చు. 
  • నొప్పి ఛాతీలోంచి భుజాలు, మెడ, చేతుల వైపు పాకుతుండటం.
  • గుండె వేగంగా కొట్టుకోవటం.
  • చల్లటి చెమట్లు పట్టటం.
  • తల తేలిపోవటం, బలహీనత, తలతిప్పు. 
  • శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది. 
  • వికారం, అజీర్ణం. కొన్నిసార్లు వాంతి కూడా కావొచ్చు.
  • ప్రత్యేకించి పనులు చేస్తుంటే లక్షణాలు తీవ్రం కావటం.

ఛాతీమంట

  • ఛాతీలో మంటతో కూడిన నొప్పి రావటం. ఇది ఛాతీలో పక్కటెముకలు కలిసే పొడవాటి ఎముక (స్టెర్నమ్) వద్ద మొదలవుతుంటుంది.
  • నొప్పి గొంతు వైపు వెళ్తుంది. కానీ భుజాలు, మెడ, చేతులకు పాకదు. 
  • జీర్ణాశయంలోంచి ఆహారం నోట్లోకి వస్తున్న అనుభూతి కలుగుతుంది. 
  • పులి తేన్పులు రావటం, గొంతుచేదుగా అనిపించటం.
  • పడుకున్నా, ముందుకు వంగినా నొప్పి ఎక్కువ కావటం.
  • ఎక్కువగా, మసాలా పదార్థాలు తిన్న తర్వాత లక్షణాలు కనిపించటం.

     


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని