ఆడవారి బరువు తీరే వేరు!

కొన్ని జబ్బుల తీరుతెన్నులు ఆడవారిలో, మగవారిలో వేర్వేరుగా ఉంటాయి. ఊబకాయంలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తున్నట్టు యార్క్‌ యూనివర్సిటీ అధ్యయనంలో బయటపడింది.

Published : 17 Jan 2023 00:44 IST

కొన్ని జబ్బుల తీరుతెన్నులు ఆడవారిలో, మగవారిలో వేర్వేరుగా ఉంటాయి. ఊబకాయంలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తున్నట్టు యార్క్‌ యూనివర్సిటీ అధ్యయనంలో బయటపడింది. కొవ్వు కణజాలంలో రక్తనాళాలను సృష్టించే కణాల్లో ఆశ్చర్యకరమైన తేడాలు ఉంటున్నట్టు వెల్లడైంది. ఊబకాయంతో ముడిపడిన గుండెజబ్బులు, ఇన్సులిన్‌ నిరోధకత, మధుమేహం వంటి సమస్యలు ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఊబకాయం, దీంతో ముడిపడిన సమస్యలపై అధ్యయనం చేయటానికి పరిశోధకులు సాధారణంగా మగ ఎలుకలనే ఎంచుకుంటుంటారు. ఎందుకంటే ఇలాంటి జబ్బులు ఆడ ఎలుకల్లో తలెత్తవు. అందుకే ఆడ ఎలుకలను కాపాడుతున్న అంశాలను తెలుసుకోవటానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఊబకాయం తలెత్తినప్పుడు పెరుగుతున్న కొవ్వు కణజాలానికి ఆక్సిజన్‌, పోషకాలను అందించటానికి ఆడ ఎలుకల్లో కొత్తగా బోలెడన్ని రక్తనాళాలు పుట్టు కొస్తున్నట్టు గుర్తించారు. అదే మగ ఎలుకల్లో కొత్త రక్తనాళాలు చాలా తక్కువగా ఏర్పడుతున్నట్టు కనుగొన్నారు. దీనికి కారణం- కొవ్వు కణజాలంలో కొత్త రక్తనాళాలు విస్తరించే ప్రక్రియ ఆడ ఎలుకల్లో అధికంగా ఉండటమే. ఇక మగ ఎలుకల్లోనైతే రక్తనాళాల విస్తరణ కన్నా అంతర్గత వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. దీంతో రక్తనాళాల పైపొర కణాల పనితీరు దెబ్బతింటోందని, ఈ కణాలు విస్తరించే ప్రక్రియ మందగిస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన తారా హాస్‌ చెబుతున్నారు. దీర్ఘకాలం కొవ్వు ఎక్కువగా గల ఆహారం ఇచ్చినా కూడా ఆడ ఎలుకల్లో రక్తనాళాల వృద్ధి ఎక్కువగానే ఉంటుండటం ఆశ్చర్యకరం. ఈ కణాలను శరీరంలోంచి బయటకు తీసి, ప్రయోగ శాలలోనూ పరీక్షించారు. లైంగిక హార్మోన్లు, ఇతర కారకాలేవీ లేకపోయినా కూడా అవి విభిన్నంగానే ప్రవర్తిస్తుండటం విశేషం. ఊబకాయం తీరుతెన్నులు ఆడ, మగవారిలో ఎందుకు వేర్వేరుగా ఉంటాయో అర్థం చేసుకోవటానికిది తోడ్పగలదని భావిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు