రాజీ

తన కొడుకు తేజకు ఎంసెట్‌లో స్టేట్‌ ఫస్ట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలో పదో ర్యాంకు వచ్చిన సందర్భంలో, లెక్చరర్‌ సుజాత తన కాలేజీలోని అధ్యాపక బృందానికి గ్రాండ్‌ పార్టీ ..

Updated : 09 Apr 2020 15:46 IST

డా।। పి.ఎన్‌.పార్వతీదేవి

తన కొడుకు తేజకు ఎంసెట్‌లో స్టేట్‌ ఫస్ట్, ఐఐటీ ప్రవేశ పరీక్షలో పదో ర్యాంకు వచ్చిన సందర్భంలో, లెక్చరర్‌ సుజాత తన కాలేజీలోని అధ్యాపక బృందానికి గ్రాండ్‌ పార్టీ ఇచ్చింది. ప్రిన్సిపాల్‌తో సహా, స్టాఫ్‌ అందరూ ఆమె చుట్టూ చేరి అభినందన పరంపరలను అందిస్తుంటే, ‘‘మేడమ్, వీళ్ళబ్బాయి తేజ సాక్షాత్తూ శ్రీరామచంద్రుడు. వాడేం చదవాలో ఎక్కడ చదవాలో అమ్మా నాన్నా డిసైడ్‌ చేసి చెప్తారు. అంతే, వాడదే చేస్తాడు. కుర్రాడు చాలా ఇంటెలిజెంట్‌’’ అంటూ, సుజాత ప్రియసఖి నీరజ ప్రిన్సిపాల్‌తో అంది. అవునా అన్నట్టు, ఆవిడ సుజాత వైపు చూస్తూ, ‘‘అయితే వాడి గొప్పతనంలో సింహభాగం మీదేనన్నమాట’’ అంటూ మరోసారి అభినందించింది.

అభినందనల వర్షంలో తడిసిముద్దయిన సుజాత, కారులో ఇంటికి తిరిగివస్తూ, నీరజ మాటలను తలచుకుని నవ్వుకుంది. తేజకు తన ఫ్రెండ్స్‌ పెట్టిన ముద్దుపేరు శ్రీరామచంద్రుడు. ‘నిజంగా వాడు శ్రీరామచంద్రుడే’ అని ప్రేమగా అనుకుంటూ, ఒకసారి గతంలోకి జారిపోయింది.

సెవెన్త్‌ వరకు చదివిన స్కూలు నుండి అకస్మాత్తుగా మార్చి దానికంటే మంచి పేరున్న మరో స్కూల్లో చేరిస్తే, మారుమాట్లాడకుండా అందులో చేరాడు. తేజకు చిన్నప్పటినుండి తండ్రి డాక్టరు రామకృష్ణే ఒక హీరో. 

అతనిలా నడవడం, మాట్లాడటం తనకు తెలియకుండానే అనుకరించేవాడు. తండ్రి టేబుల్‌ మీద ఉంచిన స్టెత్‌ మెడలో తగిలించుకుని, ‘నేను డాక్టర్ని, ఏదీ టెస్టు చేయనీ’ అంటూ తల్లివెంట పడేవాడు.

టెన్తులో స్కూలు ఫస్టేగాక, స్టేట్‌లో పదో ర్యాంకు కూడా సాధించాడు తేజ. సంతోష సముద్రంలో మునిగిపోయిన సుజాత దగ్గరకొచ్చి, ‘‘అమ్మా, మా ఫ్రెండ్స్‌- సాయి, జాన్, నేను అందరం ఇంటరులో బైపీసీ తీసుకుని డాక్టరు అవ్వాలని డిసైడ్‌ చేసుకున్నాం’’ అని గర్వంగా చెప్పాడు.

షాక్‌ తిన్నట్టు చూసింది సుజాత.

‘‘వద్దు నాన్నా, చూడటానికీ చెప్పుకోవడానికీ డాక్టరు వృత్తి బాగానే ఉంటుంది. కానీ, జీవితమంతా టెన్షనే. ఏ ముచ్చటా ఉండదు. చూడు... ఏనాడైనా నువ్వూ నేనూ నాన్నా కలిసి ఒక సినిమాకు కానీ పిక్నిక్‌కు కానీ సరదాగా వెశ్ళామా? నాన్నను చూశాక డాక్టరంటేనే భయంవేస్తుంది. అదే ఎంపీసీ తీసుకుని ఏదైనా మంచి ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీరింగ్‌ చేశావనుకో... మంచి జీతాలు, హాయిగా ఉండే జీవితం. డాక్టరులా అంత టెన్షన్‌ ఉండదు నాన్నా’’ అంటూ తల నిమురుతూ చెప్పింది.

తల్లి చేతుల్ని తన తలపై నుండి వెనక్కి తోస్తూ, నేరుగా తన గదిలోకి వెళ్ళి మంచంమీద పడుకున్నాడు. అన్నానికి రమ్మని తల్లి ఎంత బతిమాలినా ‘ఆకలి లేదంటూ’ అటు తిరిగి పడుకున్నాడు. సుజాతకు అర్థమైంది- వాడి ఆశలమీద నీళ్ళు చల్లిందని. ఎలా ఓదార్చడమా అని ఆలోచిస్తుండగా, కొడుకుకు ర్యాంకు వచ్చిన సంతోషంలో హాస్పిటల్‌ నుండి ఇంటికి తొందరగా వచ్చిన రామకృష్ణకు జరిగినదంతా చెప్పింది.

తేజ గదిలో అడుగుపెట్టిన రామకృష్ణ తేజ నిద్రపోవటంలేదన్న విషయం గమనించి, వాడి పక్కనే కూర్చుని ‘‘హల్లో... స్కూలు ఫస్టూ, డిస్ట్రిక్ట్‌ ఫస్టూ, స్టేట్‌ టెన్తు ర్యాంకు పుత్రరత్నంగారూ, లేవండీ’’ అంటూ ప్రేమగా లేపే ప్రయత్నం చేశాడు. లేవకుండా దుప్పటిని పైకి లాక్కుంటుంటే, వాడి చేతిని పట్టుకుని ‘‘లేవరా బంగారూ, నీకోసం ఏం తెచ్చానో చూడు’’ అంటూ తాను తెచ్చిన గిఫ్టు ప్యాకెట్‌ను వాడి చేతిలోపెట్టి, వాడిని పైకిలేపి, నుదుటిమీద ముద్దుపెట్టుకున్నాడు. ‘‘ఏమైందిరా బంగారూ, ఆసుపత్రిలో ప్రతి ఒక్కరు ‘స్టేట్‌ ర్యాంకా, అమ్మో’ అని నన్ను కంగ్రాట్స్‌ చేసేవాళ్ళే. నీకు దిష్టి బాగా తగిలింది. అందుకే ఇలా నీరసంగా ఉన్నావు. సుజా, ముందు వీడికి దిష్టి తీసెయ్‌’’ అంటూ భార్యను పిలిచాడు.

తండ్రి గారంతో కొంత సర్దుకున్న తేజ, తండ్రి భుజంమీద వాలిపోతూ ‘‘నాన్నా నేను బైపీసీనే తీసుకుంటాను’’ అన్నాడు.

‘‘ముందు అన్నం తిను, ఆ తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. సరేనా’’ అని వాడి చేయి పట్టుకుని డైనింగ్‌ టేబిల్‌ ముందు కూర్చున్నాడు. అన్నం తిన్న తర్వాత, తేజ కొంత రిలాక్స్‌డ్‌గా కనిపించాడు. రామకృష్ణ అతని పక్కన కూర్చుని, తలమీద చేయివేసి, ‘‘చూడు నాన్నా, నువ్వు బైపీసీ చదివి, డాక్టరయితే నాకంటే సంతోషించేవాళ్ళెవరూ ఉండరు. చిన్నప్పుడు నేనూ నీలా డాక్టరవుతానని అందరితో అనేవాడిని. డాక్టరంటే ఆ రోజుల్లో అంత క్రేజ్‌. ఏంచేస్తున్నా ఆలోచించి కొంచెం ప్లాన్డ్‌గా చేయవలసిన రోజులివి. ఆ రోజుల్లో కాబట్టి, ఎంబీబిఎస్‌ చేసిన వెంటనే, ఇదిగో ఇలా డాక్టరైపోయాను. కానీ ఈ రోజుల్లో మరో రెండు సంవత్సరాలు చదివి, ఎంఎస్‌ గానీ ఎండీ గానీ చేస్తే తప్ప కుదరదు. పైగా ఆస్పత్రి పెట్టాలంటే బోల్డంత పెట్టుబడి అవసరం. అంతేకాదు, క్షణం విశ్రాంతి లేకుండా కష్టపడాలి. చూశావుగా, ఎప్పుడు చూసినా... ఆస్పత్రీ, రోగులంటూ తీరికలేకుండా ఉన్నాను. సరదాగా మనందరం ఎప్పుడైనా బయట గడిపామా! ఈరోజుల్లో సాఫ్ట్‌వేర్‌కి మంచి డిమాండ్‌ ఉంది. మంచి ఇన్‌స్టిట్యూట్‌లో ఇంజినీరింగు సీటుగానీ వచ్చిందా, ఇంక మనం ఉద్యోగం కోసం వెతుక్కోనక్కరలేదు. క్యాంపస్‌ సెలెక్షన్సు అంటూ పెద్దపెద్ద కంపెనీవాళ్ళే కాలేజీలకు వచ్చి గొప్పగొప్ప ఉద్యోగాలిచ్చేస్తున్నారు. నాలుగేళ్ళల్లో చదువైపోతుంది. మాకులా కాకుండా ఇంజినీర్లకు రిలాక్స్‌ అవటానికి కొంచెం టైముంటుంది. ఇవన్నీ ఆలోచించే అమ్మా నేనూ, నువ్వు ఎంపీసీ తీసుకుంటే మంచిదనుకున్నాం. ఏమంటావు? బాగా ఆలోచించి చెప్పమ్మా’’ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

మర్నాడు పొద్దున్న రామకృష్ణ ఆస్పత్రికి బయలుదేరుతుంటే, తేజ అతని దగ్గరకొచ్చి ‘‘బాగా ఆలోచించాను. అమ్మా నువ్వూ చెప్పిందే కరెక్టనిపించింది. ఎంపీసీలోనే చేరతాను’’ అన్నాడు.

‘తన బిడ్డ బంగారం. నీరజ అన్నట్లు నిజంగా శ్రీరామచంద్రుడే’ సుజాత గతంనుండి వర్తమానంలోకి వచ్చి అనుకుంది.

మర్నాడు సుజాత సెల్‌లో ‘అవును, చెన్నై ఐఐటీలో చేరుస్తున్నాం’ అని ఎవరితోనో చెప్తుంటే తేజ విన్నాడు.

‘‘చెన్నైలోనా నన్ను చేర్చేది! వద్దమ్మా, అక్కడ హాస్టల్‌ ఫుడ్‌ తినాలి. నాకిష్టం ఉండదు. 

పైగా ఇంటిమీద బెంగ ఉంటుంది. ఇక్కడున్న ఇంజినీరింగు కాలేజీలో చేరతాను’’ అన్నాడు.

‘‘ఐఐటీకి ఉన్న విలువే వేరు నాన్నా. అందులో, చెన్నై ఐఐటి మరీ బాగుంటుందంటారు. ఇటీజ్‌ మై డ్రీమ్‌ నాన్నా. అక్కడగానీ చదివితే మంచి కంపెనీలో పెద్ద ఉద్యోగం, గొప్ప జీతం ఖాయం. కొత్తలో కొంత ఇబ్బంది ఉన్నా, నెమ్మదిగా ఆ ఊరూ కాలేజీ అన్నీ అలవాటవుతాయి’’ అంటూ చెప్పి ఒప్పించింది సుజాత.

మొదట్లో ‘నాకు ఈ భోజనం పడటంలేదు, ఇంటిమీద బెంగగా ఉందని’ రోజూ ఫిర్యాదు చేస్తూనే ఉండేవాడు. ‘అలవాటు చేసుకోమ్మా’ అంటూ చెప్పేది. మూడో సంవత్సరం చివర్లో క్యాంపస్‌ సెలెక్షన్‌ జరిగి, గొప్ప పేరున్న కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది తేజకు.

‘‘చూశావా నాన్నా, ఐఐటీలో చదవడంవల్లే నీకింత మంచి ఉద్యోగం వచ్చింది. జీతం నెలకు నలభై నుండి ఏభై వరకు రావచ్చు’’ అంది సంతోషంగా.

అదృష్టంకొద్దీ తానుండే హైద్రాబాద్‌లోనే ఉద్యోగం అనేసరికి, ఇక భోజన సమస్య ఉండదు, అమ్మా నాన్నలతోనే ఉండొచ్చని తెగ సంతోషపడిపోయాడు తేజ.

సెలవుల్లో ఇంటికివచ్చిన తేజకు తండ్రి తన పాస్‌పోర్ట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసింది. తల్లిని అడిగాడు.

‘‘అదేంట్రా బి.టెక్‌. అవగానే యు.ఎస్‌. వెళ్ళి ఎం.ఎస్‌. చేయాలిగా. మంచి యూనివర్సిటీలు ఏవో, అక్కడికి ఎలా అప్లై చేయాలో నెట్‌లో చూసి అన్ని వివరాలూ సేకరించి ఉంచాం’’ అంది.

‘‘నేనెక్కడకూ వెళ్ళను. ఇక్కడే ఉంటాను’’ తేజ మొండిగా అన్నాడు.

‘‘కాదు నాన్నా, మా కాలేజీలో స్టాఫ్‌ పిల్లలందరూ బి.ఇ. చేయగానే యు.ఎస్‌.కో యు.కె.కో ఆస్ట్రేలియాకో వెళ్ళిపోతున్నారు. ఇంత మంచి ర్యాంకు స్టూడెంట్‌వి అయ్యుండి నువ్వు ఇక్కడే ఉండిపోతే అందరూ ‘అదేం’ అని అడుగుతారు. మావాడూ యు.ఎస్‌.లోనే ఉన్నాడని చెప్పుకోవాలిరా’’ అంది.

‘‘ఎవరికోసమో నేనెందుకు వెశ్ళాలి? 

మా వాడికి ఇండియా అంటేనే ఇష్టం, ఇక్కడే ఉంటాడని చెప్పేయి’’ అంటూ లోపలకు వెళ్ళబోయాడు. వెళ్తున్నవాడిని ఆపి ‘‘చూడరా నాన్నా, నీ భవిష్యత్తు బాగుండాలనే యు.ఎస్‌.కు వెళ్ళమంటున్నాం. ఇక్కడ జీతం వేలల్లో అయితే, అక్కడ లక్షల్లో ఉంటుంది. పైగా ముందుముందు నువ్వు ఏదైనా ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాలన్నా పిహెచ్‌.డి. చేయాలన్నా అక్కడ అవకాశాలు ఎక్కువ. మంచి ప్రోత్సాహం ఉంటుంది’’ అంది.

రామకృష్ణ కూడా ఈ విషయంగా తేజాతో చాలాసేపు చర్చించాడు.

చివరికి తేజ తప్పనిసరై ‘సరే’నన్నాడు. చదువు పూర్తయింది. తేజ యు.ఎస్‌.కు వెళ్తున్న సంతోషం ఒకవైపున్నా ముద్దులకొడుకును విడిచి ఉండవలసిరావడం సుజాత, రామకృష్ణలకు చాలా బాధనిపించింది.

వస్తున్న ఏడుపును ఆపుకుంది సుజాత.

విమానాశ్రయంలో తనను సాగనంపడానికి వచ్చిన తల్లిదండ్రులను చూస్తుంటే తేజ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ‘‘అక్కడి ఫుడ్‌ నాకు నచ్చుతుందా? అక్కడ నాకెవ్వరూ తెలియదు. ఇంటిమీద బెంగగా అనిపిస్తుంది. మళ్ళీ సంవత్సరం వరకు రావడం కుదరదేమో, ఎలాగమ్మా’’ అంటున్న తేజ మాటలకు, ఉబికివస్తున్న తన  కన్నీళ్ళు వాడి కంటపడకుండా కొడుకును తన గుండెలకు హత్తుకుంది.

‘‘లేదు నాన్నా, కొత్తలో ఇబ్బందిగా అనిపిస్తుందిగానీ ఆ తర్వాత్తర్వాత అక్కడే బాగున్నట్లనిపిస్తుంది. సంవత్సరం అంటే ఎంత? రోజూ ఫోన్లో మాట్లాడతాం, నెట్‌లో చాటింగ్‌ చేయొచ్చు. అప్పుడు ప్రపంచం ఎంత చిన్నదో అనిపిస్తుంది’’ అంది ధైర్యం చెబుతూ.

వస్తున్న కన్నీళ్ళు కొడుకు కంటబడకూడదని అటు తిరిగిన రామకృష్ణ, కళ్ళు తుడుచుకుని కొడుకు వైపు తిరిగి ‘‘నీకుగానీ గ్రీన్‌కార్డ్‌ వచ్చేసిందనుకో, మేమిద్దరం నీ దగ్గరకే వచ్చేస్తాం. సరేనా’’ అన్నాడు.

కొడుక్కు వీడ్కోలు చెప్పి, ఎయిర్‌పోర్ట్‌ నుండి బయటకు వస్తున్న సుజాత భోరున ఏడ్చేసింది. ‘‘వాడిముందు ఏడిస్తే ఎక్కడ వెళ్ళనంటాడోనని నిగ్రహించుకున్నానండీ. వాడిని అంతదూరం పంపి తప్పు చేశామా?’’

తనవైపు బేలగా చూస్తున్న భార్యతో ‘‘మనం వాడిని ఓవర్‌ ప్రొటెక్ట్‌ చేసేశాం అనిపిస్తుంది. కొంచెం స్వతంత్రంగా ఆలోచించడం, పనులు చేయడం ఇప్పుడైనా నేర్చుకుంటాడు. మనం దగ్గర లేకపోతే బతకలేనేమోనని భయపడిపోతున్నాడు. దూరంగా వెళ్ళడం ఒకవిధంగా మంచిదేనేమో! కానీ, వాడు దూరంగా ఉంటే మనం మాత్రం హాయిగా ఉండగలమా? 

ఏం చేస్తాం, ఇవాళ్రేపు యు.ఎస్‌.కు వెళ్ళడం ప్రతిష్ఠకు సంబంధించిన విషయంగా మారిపోయింది. అందరూ అడ్జస్ట్‌ అవుతున్నారుగా, అలాగే మనమూనూ...’’ అన్నాడు రామకృష్ణ.

యు.ఎస్‌.కు వెళ్ళిన తేజ, దాదాపు ప్రతిరోజూ ఫోన్‌ చేసేవాడు. వారానికి రెండుసార్లు నెట్‌లో చాటింగ్‌ చేసేవాడు. ‘భోజనం నచ్చటంలేదు, మీమీద బెంగగా ఉంది’ అన్నదే అతను క్రమంతప్పకుండా చేసే ఫిర్యాదు. తిరిగి వచ్చేస్తే తమ పరువు పోతుంది, మంచి భవిష్యత్తు చేతులారా చెడగొట్టుకున్నట్టవుతుంది, కాబట్టి అతనికి ధైర్యం కలిగేలా మాట్లాడేవాళ్ళు సుజాత, రామకృష్ణలు.

నెమ్మదిగా తేజ స్థిరపడుతున్నట్లు అనిపించింది. వారానికి రెండుసార్లు మాత్రమే ఫోన్‌ చేస్తున్నాడు. పదిరోజులకోసారి చాటింగు. ‘ఒక మంచి ఫ్రెండ్‌తో కలిసి ప్రాజెక్ట్‌ వర్క్‌ చేస్తున్నాననీ అందులో చాలా బిజీగా ఉండటంవల్ల ఎక్కువగా ఫోన్‌ చేయలేకపోతున్నా’ననీ చెప్పాడు.

తేజకు పెళ్ళి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. ఇంగ్లిషు లెక్చరరు ప్రమద్వర, బీటెక్‌ చదివిన తన కూతురిని చేసుకుంటారేమోనని నీరజ ద్వారా అడిగించింది. తెల్లగా అందంగా ఉండే తేజకు, కొంచెం ఛాయ తక్కువగా అనిపించే ఆ అమ్మాయి సరిపోదనిపించింది. సుజాతకు బంగారుబొమ్మ లాంటి అమ్మాయే కోడలు కావాలనే పట్టుదలతో ఉన్న సుజాత ఆ సంబంధాన్ని సున్నితంగా తిరస్కరించింది. ఏ పిల్లను చూసినా ఏదో ఒక లోపం ఆమెకు కనిపించేది. ఎన్నో ప్రయత్నాలమీద, తాననుకుంటున్నట్లుగా ఉన్న ఏలూరు సంబంధంతో తృప్తిచెంది, దాదాపు ఖాయం చేసుకున్నారు. 

ఈ విషయం ఈమెయిల్‌ ద్వారా తేజకు తెలియజేసింది. తేజ దగ్గర నుండి మూడు వారాలుగా ఒక ఫోనూ రాలేదు. ‘ప్రాజెక్ట్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాను. అవసరమైతే నేనే చేస్తాను, మీరు చేయవద్ద’ని చెప్పడంతో సుజాత ఫోన్‌ చేయలేకపోయింది. రోజూ ఈమెయిల్‌ చెక్‌ చేసేది. కానీ అదీ మూడు వారాలుగా ఖాళీగానే ఉంది. కంగారుపడ్డారు సుజాత, రామకృష్ణలు. కనీసం ఈరోజైనా విషయం తెలుసుకుందామని కంప్యూటర్‌ ముందు కూర్చున్న సుజాత, తేజ ఈమెయిల్‌ చూడగానే సంతోషంగా రామకృష్ణను పిలిచింది.

ప్రియమైన అమ్మా నాన్నాలకు,

ఇన్ని రోజులుగా ఫోనుగానీ చాటింగుగానీ ఈమెయిల్‌గానీ ఇవ్వక మిమ్మల్ని చాలా బాధపెట్టాను. క్షమించాలి. జోన్స్‌ అనే అమ్మాయి నాతోపాటు ప్రాజెక్ట్‌ వర్క్‌ చేస్తుంది. తల్లి నల్లజాతి, తండ్రి అమెరికన్‌. రంగు కొంచెం తక్కువేకానీ, ఆ అమ్మాయి చాలా మంచిది. మనదేశమన్నా సంప్రదాయాలన్నా చాలా ఇష్టం. ఒకసారి మనదేశానికి వచ్చి, మన హైద్రాబాదులో నెలరోజులుందట. కొత్తలో ఇక్కడి భోజనం, పద్ధతులూ నచ్చక అవస్థపడుతుంటే, మన తెలుగు భోజనం వండిపెట్టేది. అమ్మా, ఆ అమ్మాయి అంతా నీకులానే. నాకేది మంచిదో ఏది వద్దో అన్నీ చెప్పేది. చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. పోయినవారం అనుకోకుండా మా పెళ్ళి జరిగిపోయింది. మీకిది చాలా షాకింగ్‌గా ఉంటుందని తెలుసు. నన్ను క్షమించండి. 

మీ ఆశీస్సులు నాకు కావాలి. మీరు రమ్మని, ఒక వారంరోజుల్లో ఈమెయిల్‌ ఇస్తే, ఇద్దరం వస్తాం. అలా వారంరోజుల్లో మీ మెయిల్‌గాని రాకపోతే, మీరు నన్ను క్షమించలేదని అర్థం. ఇంక ఎప్పటికీ ఇక్కడ ఉండాల్సిందే.

మీ తేజ

తేజ ఈమెయిల్‌ చదివిన సుజాత, ముందు మాటరాక పిచ్చిపట్టినదాన్లా అలా చూస్తూ ఉండిపోయింది. తొందరగానే షాక్‌ నుండి తేరుకున్న రామకృష్ణ ఆమె భుజాలను పట్టుకుని కుదపగా ‘‘ఇదేమిటండీ, మన తేజానా... ఇలా..?’’ అని వెక్కివెక్కి ఏడ్చింది. 

ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది. ‘‘నాన్నా అని తప్ప, ఏనాడైనా వాడిని పేరుపెట్టి పిలిచామా? ఏం చేసినా వాడి మంచికోసమే కదా చేశాం? చివరికి ఏం చేశాడో చూశారా? మనకు కాకుండాపోయాడు’’ అంటూ ఏడుస్తూనే ఉంది. రెండురోజుల వరకు ఇల్లు కదలలేదు. 

రామకృష్ణ కూడా ఆస్పత్రి వైపు చూడలేదు. మూడోరోజు బాధ తీవ్రత కొంత తగ్గినట్లనిపించింది. ఒంటరిగా చాలాసేపు ఆలోచించాడు. నెమ్మదిగా వచ్చి సుజాత పక్కన కూర్చుని ‘‘సుజా, నేను చెప్పేది కొంచెం ఆలోచించి చూడు. బాధపడుతూ కూర్చోకు. జరిగిపోయినదానికి మనం ఏమీ చేయలేం. ఏం చేయాలన్నది ఆలోచిద్దాం’’ అన్నాడు.

సుజాత కన్నీళ్ళు తుడుచుకుంటూ ‘‘వాడు మన ప్రాణం అనుకున్నాం. కానీ ఈనాడు ఆ ప్రాణం దూరమైపోయింది. ఇక మనం బతకడం ఎందుకు?’’ తలమీద చేతులతో కొట్టుకుంది.

‘‘సుజా, ఆవేశపడకు. మన కోరికలకు తగ్గట్లుగా వాడిని మలచుకున్నాం. వాడికి తెలిసిన లోకం నువ్వూ నేనే. వాడికిష్టమైనా కష్టమైనా మనం చెప్పినదానితోనే రాజీపడేవాడు కదా! పాపం, వాడు అంతదూరం వెళ్ళననే అన్నాడు. మనమే ‘పేరూ ప్రతిష్ఠా’ అంటూ బలవంతంగా పంపాం. అక్కడ వాడు మనల్ని ‘మిస్‌’ అయ్యాడు. ఆ అమ్మాయి నీలా వండటం, నీకులా వాడి మంచిచెడ్డలు చూసుకోవడంతో, ఆ అమ్మాయిలో నిన్ను చూసుకున్నాడు. అందుకే ఆ అమ్మాయే ఇప్పుడు వాడి లోకమైపోయింది. వదలలేకపోతున్నాడు’’.

రామకృష్ణ మాటలకు సుజాత ఉక్రోషంతో ‘‘అంటే, ఇక మీ అవసరం నాకులేదు అనేగా వాడి ఉద్దేశం. వాడిని మీరు సమర్థిస్తున్నారా?’’ అంది.

‘‘సుజా, ఆవేశపడకు. వాడిని సమర్థించటంలేదు. మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈమెయిల్‌లో ఏమన్నాడు... మీకిష్టం లేకపోతే ఇక రానని అన్నాడేగానీ, మీకిష్టం లేకపోతే ఆ అమ్మాయిని వదిలేస్తానని అనలేదు. అంటే వాడు మనల్ని వదలడానికైనా సిద్ధమేగానీ ఆ అమ్మాయిని కాదు. కానీ, వాడు మనకు కావాలి. మన బతుకే వాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే, ఉన్న పరిస్థితులతో మనం రాజీపడక తప్పదు’’.

అయితే ఏం చేయాలన్నట్లు సుజాత అతనివైపు చూసింది. ‘‘వాడిని రమ్మందాం. ఆ పిల్ల మనకు నచ్చకపోవచ్చు. కానీ వాడికి నచ్చింది. చిన్నప్పటినుంచీ మనకోసం ఎన్నో విషయాల్లో వాడు సర్దుకుపోయాడు. వాడికోసం ఈ విషయంలో మనం రాజీపడదాం. వాళ్ళిద్దరినీ పిలిపించి, మన పద్ధతిలో ఇక్కడ పెళ్ళి జరిపిద్దాం. మన బిడ్డ మనసు గెలుచుకున్న అమ్మాయిని మనమూ దగ్గరకు తీసుకుందాం. ఏమంటావు?’’

‘‘నాకు మనసొప్పటంలేదండీ’’ అని ఏడుస్తూ, బెడ్‌రూంలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న రామకృష్ణ ఒక్కసారిగా మెలకువ వచ్చి, వెనక్కి తిరిగిచూస్తే, పక్కన సుజాత కనిపించలేదు. పక్కగదిలో లైటు వెలుగుతుండటంతో నెమ్మదిగా ఆ గదిలోకి వెళ్ళి చూశాడు. సుజాత కంప్యూటర్‌ ముందు కూర్చుని ఉంది. చప్పుడు చేయకుండా ఆమె ఇస్తున్న ఈమెయిల్‌ చదివాడు.

‘నాన్నా, మీరిద్దరు ఇక్కడకు ఎప్పుడొస్తున్నారు? తెలియజేయండి. మన పద్ధతిలో మీకు పెళ్ళిచేయాలి కదా... ...’ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని