Published : 20 Nov 2021 00:34 IST

మూడు కాళ్ల చిరుత!

నగనగా ఓ అడవి. అందులో చాలా చిరుతలున్నాయి. వాటిలో ఓ చిరుత.. వేటకు వెళ్లేటప్పుడు, ఈ మధ్య కొత్తగా మూడు కాళ్లతో పరిగెడుతోంది. దానికి ఆహారం నోటికి అందినట్లే అంది, అంతలోనే చేజారిపోతోంది. అప్పుడప్పుడు అతికష్టం మీద ఏ చిన్నాచితకా జీవో, అతి బద్ధకం ప్రాణో, పసికూనో, ముసలీముతకా జంతువులో తప్ప దానికి చురుకైన ఏ ప్రాణీ చిక్కడం లేదు.

‘పాపం.. దాని కాలికి గాయమైందేమో..’ అని ఆ అడవిలోని జీవులు మొదట్లో అనుకునేవి. కానీ వేటకు వెళ్లేటప్పుడు మాత్రమే ఆ చిరుత మూడు కాళ్లతో పరిగెడుతూ, మిగతా సందర్భాల్లో చక్కగా నాలుగు కాళ్లతో నడుస్తుండటం, పరిగెడుతుండటం అవి గమనించాయి. దాంతో అవి చిరుతను చులకన చేసి మాట్లాడటం మొదలు పెట్టాయి. ఆ మాటలు విన్న మిగతా చిరుతల మనసులు చివుక్కుమన్నాయి.

చిరుతలన్నీ కలిసి.. సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ‘ఈ అడవిలోని చిరుతలన్నింటిలోనూ చురుకైన నువ్వు మా అందరికన్నా వేగంగా పరిగెత్తి వేటాడేదానివి. చాలాసార్లు నువ్వు వేటాడిన ఆహారమే తోటి చిరుతలమైన మేము తినేవాళ్లం. మేము కూడా తినగా మిగిలింది.. కాకులు, గద్దలూ, అడవి కుక్కలూ, నక్కలూ తినేవి. అలాంటి నువ్వు ఇప్పుడు మూడుకాళ్లతో పరిగెడుతూ వేటాడుతున్నావు. నువ్వు సరిగా వేటాడలేక, ఆహారం కోసం మేం చేసే వేట మీద ఆధారపడుతున్నావు. అసలు నీకేమైంది? ఎందుకిలా చేస్తున్నావు’ అని మూడుకాళ్ల చిరుతను నిలదీశాయి తోటి చిరుతలు.

ఆ చిరుత, ఓ చిరునవ్వు నవ్వేసి.. ‘ఆ రహస్యం నా నోటితో నేను చెప్పకూడదు’ అనేసి అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. ‘ఈ మూడు కాళ్ల చిరుత ఏదో దాస్తోంది. దీని కదలికల మీద ఓ కన్నేసి ఉంచండి. అసలు గుట్టు తెలుసుకోండి’ అని ఆ చిరుతలన్నింటికీ సలహా ఇచ్చింది ఒక వృద్ధ చిరుత. మూడుకాళ్ల చిరుత ఒక కొలను వైపు రోజూ వెళ్లి ఒక కొంగతో మాట్లాడుతుండటం గమనించాయి చిరుతలు. ఒకరోజు మూడు కాళ్ల చిరుత చూడకుండా మిగతా చిరుతలన్నీ కలిసి ఆ కొంగ దగ్గరకు వెళ్లాయి. ‘మా మూడు కాళ్ల చిరుత నీ దగ్గరకు రోజూ ఎందుకు వస్తోంది. దానికి నీతో ఏం పని?’ అని అడిగాయి. ‘ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. మేం ఇద్దరం మంచి స్నేహితులం. అందుకే రోజూ కష్టసుఖాలు మాట్లాడుకుంటాం’ అని చెప్పి తప్పించుకోబోయింది ఆ కొంగ.

‘నువ్వు నిజం చెప్పకపోతే.. మేము ఈ అడవిలోని ఏ కొంగనూ బతకనివ్వం. కొంగల జాతిని నాశనం చేస్తాం’ అని చిరుతలన్నీ తీవ్రంగా హెచ్చరించాయి. అప్పుడు ఆ కొంగ ‘మీకు ఆ చిరుత సంగతి తెలుసుకదా! ఈ అడవిలో అత్యంత దుర్మార్గమైన క్రూరమృగం అది. అడవి నియమాలకు విరుద్ధంగా... ఆకలి ఉన్నా, లేకున్నా.. కనిపించిన ప్రతి జంతువు మీదా అకారణంగా దాడి చేసేది. దాని వల్ల అనేక జంతువులు చనిపోయాయి. దాని దాడిలో చనిపోయిన జంతువుల్లో చిరుతల కూనలు, ముసలి చిరుతలు, బలహీన చిరుతలు కూడా ఉన్నాయి. ఆ విషయం మీకూ తెలుసు కదా! దాని దుర్మార్గం ఎంతవరకూ ఉండేదంటే.. పనీపాటా లేకపోతే అడవిలోని మొక్కలు, పొదలను కూడా పీకి పారేసేది. అసలు అడవిలో జంతువులు, మొక్కలు లేకపోతే మన మనుగడ ఎలా! దాని దాష్టీకాలు తెలిసి, దానికి బుద్ధి చెప్పాలని అనుకునేదాన్ని. ఆ సమయం రానే వచ్చింది. ఒకరోజు ఆ చిరుత నాదగ్గరకు వచ్చింది. అప్పుడు నేను ఒంటికాలి మీద కొలనులో నిలబడి చేపల వేటకు సిద్ధంగా ఉన్నాను. నన్ను చూసి అది.. ‘ఏయ్‌ కొంగా! నువ్వు ఒంటికాలు మీద నిలబడ్డావు.. అది ఏదైనా వ్రతమా!’ అని అడిగింది.

అప్పుడు నాకు మెరుపులాంటి ఆలోచన వచ్చి ‘అవును మిత్రమా! వేటాడేటప్పుడు ఒంటికాలి మీద నిలబడితే మరుజన్మలో హంసగా పుడతావని ఒక మునివర్యులు చెప్పారు. నాకు హంసగా పుట్టాలని కోరికగా ఉంది. అందుకే ఈ జపం అని చెప్పాను. ‘అయితే నాకు మరుజన్మలో సింహంగా పుట్టాలనే కోరిక ఉంది’ అని ఆ చిరుత తెలిపింది. ‘అయితే ఆలస్యం ఎందుకు? ఇకపై వేటకు వెళ్లేటప్పుడు రెండు కాళ్లతో పరిగెత్తు. అలా సాధ్యం కాకపోతే కనీసం మూడు కాళ్లతో అయినా పరిగెత్తు అని చెప్పా. అప్పటి నుంచి ఆ చిరుత వేట సమయంలో మూడుకాళ్ల చిరుత అవుతోంది’ అని చెప్పింది కొంగ.

‘అయితే నువ్వే మా చిరుతకు మాయ మాటలు చెప్పి మోసం చేశావన్నమాట’ అని కొంగపై అరిచాయి కొన్ని చిరుతలు. అప్పుడు ఒక ముసలి చిరుత కలుగజేసుకుని ‘ఈ కొంగ చేసినదాంట్లో తప్పు లేదు. మనం కూడా ఆ చిరుతకు నిజం చెప్పకుండా.. దాన్ని అలాగే ఉండనిద్దాం. అదే ఈ అడవికీ, మనకూ మంచిది’ అని చెప్పింది. కొంగ ‘హమ్మయ్య!’ అనుకుని.. అక్కడి నుంచి ఎగిరి వెళ్లిపోయింది.

- ఎం.వి.స్వామి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని