Published : 08 May 2021 00:54 IST

నా వయసు అయిదు వందల ఏళ్లు!

హాయ్‌.. నేస్తాలూ బాగున్నారా? నేనో అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను. నా గురించి బోలెడన్ని విశేషాలు మీతో చెప్పుకుందామని ఇదిగో ఇలా వచ్చాను. సరేనా మరి.. చెబుతున్నా.. చెబుతున్నా.. చెప్పేస్తున్నా..!!

మీరు అప్పుడప్పుడు అమ్మానాన్నతో కలిసి అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లకు వెళుతుంటారు కదూ! నేనూ అలాంటి పార్క్‌నే. కానీ నా వయసు అయిదు వందల సంవత్సరాలు. ప్రపంచంలోనే అతి పురాతనమైన వినోద ఉద్యానవనాన్ని నేను. అయిదు శతాబ్దాల కిందటే నన్ను 1583లో నిర్మించారు.
ఇంతకీ నేను ఎక్కడ ఉంటానో.. నా పేరేంటో.. చెప్పనేలేదు కదూ! హుమ్‌.. ఒకటా.. రెండా.. నా వయసు అయిదువందల సంవత్సరాలాయె.. అందుకే ఈ మధ్య చాలా విషయాలు మరిచిపోతున్నా. నా పేరు ‘బక్కెన్‌’ పార్కు. డెన్మార్క్‌లోని కోపెన్‌ హాగన్‌, క్యాంపెన్‌బోర్గ్‌లో ఉన్నాను నేను.

అదే అసలు ఆకర్షణ...
నాలో 150కి పైగా ప్రత్యేక వినోద అంశాలున్నాయి. పిల్లలందరూ ‘రుట్చెబానెన్‌’ను చాలా ఇష్టపడతారు.
‘ఇదేంటబ్బా..’ అని ఆలోచిస్తున్నారా..? ఇదో రోలర్‌ కోస్టర్‌. దీన్ని పూర్తిగా చెక్కతో తయారు చేశారు. దీన్ని 1932లో ఏర్పాటు చేశారు. మీకు మరో విశేషం చెప్పనా.. నా పేరిట గిన్నిస్‌బుక్‌ రికార్డు కూడా ఉంది తెలుసా! మధ్యయుగంలో ఐరోపాలోని ప్రధాన నగరాల్లో ఎన్నో అమ్యూజ్‌మెంట్‌ పార్కులు నిర్మించినా.. అందులో చాలా వరకు అప్పట్లోనే మూతపడ్డాయి. ఒక్క నేను మాత్రమే నేటికీ మనుగడలో ఉన్నాను.

ఎప్పుడూ సందడే.. సందడి!
నన్ను చూడడానికి సంవత్సరానికి 2.5 నుంచి 2.9 లక్షల వరకు సందర్శకులు వస్తుంటారు. వాళ్ల రాకతో ఎప్పుడూ సందడే. ప్చ్‌.. ప్రస్తుతం కరోనా కాబట్టి పరిస్థితులు బాలేవు కానీ.. లేకుంటేనా ఆ హడావుడే వేరనుకోండి. అప్పట్లో నేనున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా ఉండేది. ఒక వేళ కొద్దోగొప్పో నీళ్లు దొరికినా.. అవీ తాగేందుకు పనికిరానంత మురికిగా ఉండేవి. అదే సమయంలో ఇక్కడికి సమీపంలోని డైర్‌హేవ్‌ అనే అడవిలో నీటిబుగ్గలు కనుగొన్నారు. ఈ స్వచ్ఛమైన నీటి కోసం కోపెన్‌హాగన్‌ నివాసులు వెతుక్కుంటూ నేనున్న ప్రాంతానికి తరలి వచ్చారు.
అలా క్రమంగా వినోదకారులు, ప్రదర్శకులు, అమ్మకందారులు చేరి నన్ను ఏర్పాటు చేశారు. 17వ శతాబ్దంలో నేనూ కొన్నాళ్లు మూతపడ్డాను. అప్పుడు నన్ను కొందరు రాజులు వేట మైదానంగా మార్చేశారు. తర్వాత 1756లో నన్ను తిరిగి తెరిచారు. అప్పుడు స్టీమ్‌ బోట్లు, రైలు, రోడ్డు సౌకర్యాలు మెరుగవ్వడంతో నేను అతిపెద్ద అమ్యూజ్‌మెంట్‌ పార్కుగా మారాను. నేస్తాలూ.. ఇవన్నమాట నా సంగతులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts