అక్షర సత్యం!

వరుస కరవులతో రాజ్యం సంక్షోభంలో పడింది. వీరవర్మకు కంటి మీద కునుకు కరవైంది. ఇప్పుడు పరిపాలన తలకు మించిన భారమైంది. ఎన్ని విధాల మంత్రాంగం జరిపినా ఫలితం లేకపోయింది. అప్పుడే విద్యాభ్యాసం ముగించుకొచ్చిన కొడుకు కుమారవర్మకు పరిపాలన బాధ్యతలు

Published : 04 Aug 2022 00:19 IST

వరుస కరవులతో రాజ్యం సంక్షోభంలో పడింది. వీరవర్మకు కంటి మీద కునుకు కరవైంది. ఇప్పుడు పరిపాలన తలకు మించిన భారమైంది. ఎన్ని విధాల మంత్రాంగం జరిపినా ఫలితం లేకపోయింది. అప్పుడే విద్యాభ్యాసం ముగించుకొచ్చిన కొడుకు కుమారవర్మకు పరిపాలన బాధ్యతలు అప్పగించి, ఒత్తిడి నుంచి కొంత కాలం విశ్రమించాలనుకున్నాడు. అందుకు మానసిక ఉల్లాసానికి మించిన మందు లేదనుకున్నాడు.

కుమారవర్మను పిలిపించి మంత్రి సమక్షంలో రాజ్యపరిస్థితులను వివరించాడు వీరవర్మ. అనంతరం తన మనసులో మాటను చెప్పాడు. ఒత్తిడితో చేసే పని అనారోగ్యానికి కారణమవుతుంది. తండ్రి ఆరోగ్యం దృష్ట్యా, ఆయన కోరికను మన్నించడమే ఉత్తమమైందనుకొని సరే అన్నాడు.

‘ఇంతకీ మానసిక ఉల్లాసానికి ఏమి చేయాలనుకుంటున్నారు’ అని తండ్రిని అడిగాడు కుమారవర్మ. ‘బాల్యమిత్రులతో చిన్నప్పటి సంగతులు ముచ్చటించడం, ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించడం, నచ్చిన గ్రంథాలను చదవడం, జంతువులను పెంచడం.. ఇవన్నీ మానసిక ఉల్లాసానికి దారులే’ అని వివరించాడు వీరవర్మ.

ఇంతలో వీరవర్మ బాల్యమిత్రుడు కనకయ్య పులి కూనలతో అక్కడకు వచ్చాడు. తన రాకను భటుల ద్వారా వీరవర్మకు తెలిపాడు. బాల్యమిత్రుడనేసరికి వీరవర్మకు ఎక్కడాలేని ఉత్సాహం ముంచుకొచ్చింది. వెంటనే లోపలకు పంపించమని ఆజ్ఞాపించాడు.
కనకయ్య తన రెండు చేతుల్లో రెండు పులికూనలను పట్టుకొని లోపలికి ప్రవేశిస్తూ... ‘జయం జయం మిత్రమా! నిన్నటి వేటలో తల్లి పులి నా బాణాలకు బలైంది. ముద్దొస్తున్న దాని కూనలు నా చేతికి చిక్కాయి. మీకు బహుమతిగా తెచ్చాను’ అంటూ అందించాడు. చూడముచ్చటగా ఉన్న పులికూనలను చూసి తన్మయత్వం చెందిన వీరవర్మ, బాల్యమిత్రుణ్ని ఆలింగనం చేసుకుని ప్రశంసించాడు. అక్కడితో ఆగక పులి గోర్లు కూడా అందించాడు బాల్యమిత్రుడు. వీరవర్మ ముఖం మరీ వికసించింది.

‘కుమారవర్మా! ఇతను నా బాల్యమిత్రుడు. మా ఇద్దరికీ వేటంటే ఇష్టం! అభిరుచులు కలవడంతో ఈ రోజుకూ మిత్రుత్వం కొనసాగుతోంది. నా ఇష్టాలు తెలిసిన మిత్రుడు కాబట్టి.. ప్రాణాలకు తెగించి, పులిని చంపి పులిగోర్లు తెచ్చాడు’ అని గొప్పగా చెప్పాడు వీరవర్మ.

‘పులిగోర్లంటే మీకు అంత ఇష్టమా?’ అని తండ్రిని అడిగాడు కుమారవర్మ. ‘పులిగోర్లతో పతకం చేయించుకుని మెడలో ధరించడమంటే రాజసానికి పెట్టింది పేరు. పులిగోర్లు పొందడంలో నన్ను మించిన రాజు ఈ చుట్టుపక్కల లేరు. మన రాజ్యంలో పులిని ఎవరు వేటాడినా.. గోర్లు మాత్రం నాకే బహుమతిగా అందజేస్తారు. ఇప్పుడంటే వేటకు దూరంగా ఉంటున్నాను కానీ, నేను వేటకు వెళ్లిన రోజుల్లో పులిని చంపకుండా రావడం అరుదు’ అని మీసం మెలేసి చెప్పాడు వీరవర్మ. అనంతరం తన మెడలో ఉన్న పులిగోర్ల పతకాన్ని కుమారవర్మ మెడలో వేస్తూ.. ‘ఈ రోజు నుంచి కొద్ది రోజుల పాటు రాజ్యాధికారం నీకు అప్పగిస్తున్నాను’ అన్నాడు.

‘అయితే నా మొదటి నిర్ణయం కొద్దిరోజుల పాటు పులిపిల్లలను సంరక్షించి తరువాత వాటిని అడవిలో విడిచి పెట్టాలి’ అని ప్రకటించాడు. కుమారవర్మ నిర్ణయం మింగుడు పడని వీరవర్మ ‘పెంచడమెందుకు? తిరిగి అడవిలో విడిచి పెట్టడమెందుకు?’ కాస్త ఆగ్రహంగానే అడిగాడు. ‘తల్లిని చంపి, పిల్లలను అనాథలు చేయడం మానవత్వం అనిపించుకోదు. మన విలాసాల కోసం పులులను బలి చేయడం తగదు’ అని హితవు పలికాడు.

‘రాజసానికి ఎల్లలు లేవు’ వీరవర్మ సమర్థించుకున్నాడు. ‘అంటే మన రాజ్యంలో పులులు అంతరించిపోతున్నా.. కిమ్మనకుండా ఉండిపోవడం శ్రేయస్కరమా?’ ఆందోళన చెందుతూ అడిగాడు కుమారవర్మ. ‘అంత ఆందోళన అవసరం లేదు. పులి క్రూర జంతువు. దానివల్ల ప్రజలకు నష్టమే కానీ, లాభం లేదు. అంతరించిపోతున్న పులుల వల్ల ప్రాణభయం తప్పి, ప్రజలు నిశ్చింతగా బతుకుతున్నారు’ వివరణ ఇచ్చాడు వీరవర్మ.

‘పులి క్రూరజంతువు కాబట్టే అడవిలో దాని ఉనికి అవసరం. అడవిలో పులులు తిరిగితే, మానవసంచారం తగ్గి పచ్చదనం పెరిగే అవకాశం ఉంటుంది. అడవికి రక్షణ దొరుకుతుంది’ చెప్పాడు కుమారవర్మ.

‘అడవి నుంచి మానవుణ్ని దూరంగా ఉంచినా, అక్కడ పెరిగే శాకాహార జంతువులు.. పెరుగుతున్న మొక్కలను ఆహారంగా తీసుకొని అడవి వృద్ధికి అడ్డుగా నిలిచే అవకాశం ఉంది కదా’ అని వాదించాడు వీరవర్మ.

‘ఆహార సంపాదన విషయంలో సింహంలా ఒక్క జంతువుతో తృప్తి పడదు పులి. అడవిలో ఆకులు, అలములు తిని పెరుగుతున్న జంతువులను ఎక్కువగా వేటాడే ప్రయత్నం చేస్తుంది. అందుకే శాకాహార జంతువులు అప్రమత్తంగా ఉండి, తమకు అవసరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. అలా పరోక్షంగా అడవిలో వృక్ష సంపద పెరిగేందుకు పులి దోహదపడుతుంది. పెరిగే వృక్షసంపద వానలు కురిపించి కరవు కాటకాలను దూరం చేస్తుంది’ వివరించాడు కుమారవర్మ.

‘పులులు అంతరిస్తే అడవి అంతమవుతుంది. అడవి అంతమైతే వర్షాలు లేక భూమి ఎడారిగా మారుతుంది. పర్యావరణ పరిరక్షణలో పులిది పెద్దన్న పాత్ర అని ఇప్పుడు అర్థమైంది’ తాను అర్థం చేసుకున్న విషయాలు చెప్పాడు. ‘అందుకే పులిని మన జాతీయ సంపదగా గుర్తించాలి. దాన్ని సంరక్షించుకోవాలి. పర్యావరణ విద్య నేర్చుకోబట్టే నాకు ఈ విషయాలు తెలిశాయి’ అంటూ తండ్రికి చెప్పాడు కుమారవర్మ.

కొడుకు మాటలు వీరవర్మను ఆలోచనలో పడేశాయి. పులుల సంరక్షణ కోసం కఠిన చట్టాలు తీసుకొచ్చాడు. పర్యావరణ విద్య కూడా పిల్లలకు అందుబాటులోకి తెచ్చాడు. కొన్ని సంవత్సరాలకే రాజ్యం సుభిక్షంగా మారింది. ఇంకెప్పుడూ కరవు కోరల్లో చిక్కుకోలేదు.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని