నక్కలో మార్పు!

నక్క అనగానే ముందుగా గుర్తుకొచ్చేది జిత్తులమారి అని. జంతువుల మధ్య గొడవలు సృష్టించటంలోనూ, అప్పనంగా ఆహారం సంపాదించడంలోనూ, మృగరాజుకు చాడీలు చెప్పడంలోనూ నక్క ముందు ఏ జంతువూ పనికిరాదని చదివి ఉంటారు. కానీ గోదావరికి ఆవలనున్న అడవిలో ఓ అమాయక నక్క జీవిస్తుండేది. పిరికిది కావడంతో ఇతర జంతువులకు దూరంగా ఉండేది.

Published : 19 Aug 2022 00:31 IST

క్క అనగానే ముందుగా గుర్తుకొచ్చేది జిత్తులమారి అని. జంతువుల మధ్య గొడవలు సృష్టించటంలోనూ, అప్పనంగా ఆహారం సంపాదించడంలోనూ, మృగరాజుకు చాడీలు చెప్పడంలోనూ నక్క ముందు ఏ జంతువూ పనికిరాదని చదివి ఉంటారు. కానీ గోదావరికి ఆవలనున్న అడవిలో ఓ అమాయక నక్క జీవిస్తుండేది. పిరికిది కావడంతో ఇతర జంతువులకు దూరంగా ఉండేది. వాటితో మాట్లాడాలన్నా, కలిసి తిరగాలన్నా భయపడిపోయేది. ఎక్కడ తనని ఆట పట్టిస్తాయోనని దేనికీ కనిపించకుండా తిరిగేది. క్రూరమృగాలు వదిలేసిన మాంసాన్ని, ఎవరూ లేని సమయంలో వచ్చి ఆరగించేది. ఒక్కోసారి దుంపలతోనే కాలక్షేపం చేసేది. చివరకు పిల్ల జీవులు కూడా నక్కను చులకనగా చూసేవి.

ఒకరోజు నక్కకు తన మీద తనకే అసహ్యం వేసింది. జీవితం మీద ఆశలు వదులుకుంది. భయంభయంగా జీవించటం కన్నా చావే శరణ్యం అనుకుంది. జంతువుల కదలికలు లేని ఓ ప్రదేశానికి చేరుకుంది. ప్రయాణం చేసి అలసిపోవడంతో ఒక పెద్ద చెట్టు కింద కూర్చొంది. వెంటనే నిద్రలోకి జారుకుంది. ఆ నిద్రలోనే దానికి దేవలోకం కనబడింది. అక్కడ దానికి దేవదూతలు ప్రత్యక్షమై.. నక్కను తమతో రమ్మని పిలిచారు. భయంతో అది తటపటాయించింది. ‘ఇప్పటిదాకా ఒంటరిగా బతికాను. చావే దేవదూతల రూపంలో వెతుక్కుంటూ వచ్చినప్పుడు భయం ఎందుకు? కష్టంగా చావటం కన్నా సుఖంగా దేవలోకం చేరితే పోలా’ అని అనుకుంది నక్క.

వెంటనే ముందు కాళ్లు వంచి దేవదూతలకు నమస్కరించింది. వారు కూడా ప్రసన్నులై ఆశీర్వదించారు. ‘ఒక్కసారి నేల మీదకు రండి స్వామీ!’ కోరింది నక్క. దాని మాట కాదనలేక చెట్టు దగ్గరకు వచ్చారు దేవదూతలు. వారికి మర్యాదలు చేసి.. అడవిలోకి వెళ్లి పండ్లు, తేనె తీసుకువచ్చింది. దేవదూతల ముందు ఉంచి ఆరగించమంది. ‘ఇంత రుచికరమైన పదార్థాలు దేవలోకంలో కూడా లేవు’ అని నక్కతో అన్నారు దేవదూతలు. ఆ తర్వాత నక్కను ఉద్దేశించి ‘ఎందుకు చావాలనుకుంటున్నావు?’ అని ప్రశ్నించారు. తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అడవి జంతువులు ఆట పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

నక్క పరిస్థితి దేవదూతలకు అర్థమైంది. దానిలో ఎలాగైనా మార్పు తీసుకురావాలని అనుకున్నారు. ‘ఈ అడవి వాతావరణం బాగుంది. పచ్చని చెట్లు మమ్మల్ని మైమరిపిస్తున్నాయి. కొంతకాలం ఇక్కడే.. నీ దగ్గరే ఉండాలనుకుంటున్నాం. నీకు ఇష్టమేనా!’ అని ప్రశ్నించారు దేవదూతలు. నక్క ఎగిరి గంతేసింది. ‘మీరు ఇక్కడ ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. మీకు నచ్చినన్ని రోజులు ఉండొచ్చు’ అని సమాధానమిచ్చింది. దానికి దేవదూతలు.. తమకు ప్రతిరోజు ఆహారంగా పండ్లు, తేనె కావాలన్నారు. ‘అదెంత భాగ్యం.. ఈ క్షణం నుంచి మీ సేవలో తరిస్తా’ అందది. ఓ పెద్ద చెట్టుపై దేవదూతల కోసం మంచె ఏర్పాటు చేసింది. పరుగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లి పండ్లు కోసుకొచ్చింది. తేనెటీగలు కుట్టినా.. ధైర్యంగా చిటారుకొమ్మల నుంచి తేనె సేకరించింది. అవన్నీ తెచ్చి వారి ముందుంచింది.

అలా ప్రతిరోజు ఉదయాన్నే అడవి మొత్తం జల్లెడ పట్టి మరీ.. దేవదూతలకు కావాల్సినవి నక్క సమకూర్చేది. ఒంటరిగా అడవిలో తిరగటానికి భయపడే నక్కలో మార్పు మొదలైంది. ధైర్యంగా అడవిలో తిరగటం, పండ్లు కోసుకుని రావటం, చెట్లు ఎక్కి తేనె సేకరించటం దాని దినచర్యగా మారింది. ఒకప్పుడు తన పొట్ట నింపుకొనేందుకే భయపడిన నక్క.. ఇప్పుడు అతిథుల కోసం పండ్లు, తేనె సేకరిస్తోంది. ఒకరోజు దేవదూతలు నక్కను దగ్గరకు పిలిచి.. మనం దేవలోకం వెళ్లే సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. ‘మీతో నేను ఎందుకు?’ అని ప్రశ్నించింది. ‘అదేంటి? అడవిలో జంతువుల మధ్య బతకలేక చావాలనుకున్నావుగా.. ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు?’ అని అడిగాయి.

దానికి నక్క.. ‘అప్పుడు చావాలనుకున్నాను. మీతో పరిచయమయ్యాక బతుకుపై ఆశ కలిగింది. నేను కూడా బతకగలను అనే ధైర్యం వచ్చింది. చెట్లు ఎక్కలేని నేను మీకోసం పండ్లు కోశాను.. తేనె సేకరించాను. ఇప్పుడు నా కోసం అవన్నీ చేసుకోలేనా.. నన్ను నేను బతికించుకోలేనా!’ అంది. చావడానికి తెగించిన నేను, ధైర్యంగా ఎలా బతకాలో తెలుసుకున్నాను. చిటారుకొమ్మన నాతో తేనె తెప్పించి.. చివరిదాకా బతకాలని సందేశం ఇచ్చారు. ముళ్ల చెట్ల మీద పండ్లు కోయించి ఎలా కష్టపడాలో నేర్పించారు. ఆ క్రమంలో జంతువులు ఎదురుపడినా, ధైర్యంగా ముందుకు వెళ్లాను. ఇంకెప్పుడూ చావడానికి ప్రయత్నించను. నేను బతకాలి.. నేను బతకాలి’ అంటూ గట్టిగా అరవసాగింది.

ఇంతలో నక్కకు మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే దేవదూతలు కనిపించలేదు. కలే అయినా.. బతకడం ఎలాగో తెలిసొచ్చేలా చేశారని మనసులోనే వారికి కృతజ్ఞతలు చెప్పింది. రెట్టించిన ఉత్సాహంతో తన నివాసం వైపు పరుగు తీసింది.  

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు