ఆచార్యదేవోభవ!

అవంతికా రాజ్యానికి పొలిమేరలో సదానందులవారి గురుకులం ఉండేది. ఆయన.. చదువుకోవాలని వచ్చేవారికి ఉచితంగా విద్యాబోధన చేయడమే గాక, వారికి కావాల్సిన భోజనం, వసతులను కూడా సమకూర్చేవాడు. ఇందుకు ఆయనకు రాజు అనంద గుప్తుడు సహాయ సహకారాలు పూర్తిగా లభించేవి. 

Published : 23 Sep 2022 00:23 IST

వంతికా రాజ్యానికి పొలిమేరలో సదానందులవారి గురుకులం ఉండేది. ఆయన.. చదువుకోవాలని వచ్చేవారికి ఉచితంగా విద్యాబోధన చేయడమే గాక, వారికి కావాల్సిన భోజనం, వసతులను కూడా సమకూర్చేవాడు. ఇందుకు ఆయనకు రాజు అనంద గుప్తుడు సహాయ సహకారాలు పూర్తిగా లభించేవి. 

ఈ విధంగా చాలాకాలం గడిచింది. వందలమంది విద్యార్థులు చదువుకుని వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారు. సదానందులవారు గురుకులం బాధ్యతలు ఎవరికైనా అప్పగించి, తాను విశ్రాంతి తీసుకోదలిచాడు. అందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.

ఆ సమయం రానే వచ్చింది. ఆ ఏడాదే శశాంకుడు, తారాంగుడు అనే ఇద్దరు విద్యార్థులకు విద్యాభ్యాసం పూర్తైంది. వారిక ఇళ్లకు వెళ్లి జీవితంలో స్థిరపడదలుచుకున్నారు. ఆ విషయం గమనించి, సదానందుడు వారితో.. ‘ఈ మధ్య మంత్రిగారు నాతో విద్యావంతుడు ఒకరు కావాలని చెప్పారు. రాజాస్థానంలో మంచి ఉద్యోగం ఉందని చెప్పారు. మీలో ఒకరు ఆ ఉద్యోగానికి వెళ్లవచ్చు. మరొకరు ఈ గురుకులాన్ని నడిపే బాధ్యతను స్వీకరించాలి. తప్పదు.. నాకు వయసు పైబడింది. నేనిక ఎక్కువ కాలం బాధ్యతలను మోయలేను. ఆలోచించుకుని రేపు ఉదయం ఏ విషయం చెప్పండి’ అన్నాడు.

ఆ రాత్రంతా శశాంకుడు ఇలా ఆలోచించాడు. ‘బతకలేనివాడు బడిపంతులన్నారు పెద్దలు. ఎంతకాలం ఆ వృత్తి చేసినా గొర్రె తోక బెత్తెడే! అదే రాచకొలువులో ఉద్యోగం అయితే జీతమూ బావుంటుంది. జీవితమూ బాగుంటుంది. హోదాతో కూడిన అధికారమూ ఉంటుంది’ అనుకున్నాడు.

అదే సమయంలో తారాంగుడు.. ‘పెద్దలు... ఆచార్యదేవోభవ అంటారు కదా! అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది. అదీగాక మనకు తెలిసిన జ్ఞానాన్ని పదిమందికి పంచడంలో ఏదో తెలియని తృప్తీ, ఆనందం ఉన్నాయి. పైపెచ్చు పెద్దవారైన గురువుగారి కోరిక తీర్చినట్లుంటుంది’ అనుకున్నాడు.

వారిద్దరూ ఉదయాన్నే గురువు దగ్గరకు వచ్చి తమ మనసులోని మాటను తెలిపారు. సదానందులవారు సంతోషించి, ఒక లేఖ ఇచ్చి శశాంకుణ్ని మంత్రి దగ్గరకు పంపాడు. మంచి సమయం చూసి తారాంగుడికి గురుకుల నిర్వహణ బాధ్యతలను అప్పగించాడు. ఇలా కొంతకాలం గడిచింది.

అవంతిరాజు ముసలివాడయ్యాడు. కుమారుడికి పట్టాభిషేకం చేసి, తానూ విశ్రాంతి తీసుకోదలిచాడు. మందీమార్బలాన్ని గురుకులానికి పంపి తారాంగుని సగౌరవంగా రాచకొలువుకు రప్పించాడు. తారాంగుడు అభ్యంతరం చెబుతున్నా.. రాజు వినకుండా సింహాసనం మీద కూర్చోబెట్టి తను కింద కూర్చుంటూ ఇలా అన్నాడు... ‘గురువుగారిని ఆసనం మీద కూర్చోబెట్టి వారి పాదాలచెంత రాజు కూర్చోవడం రాచరిక వ్యవస్థలో అనాదిగా వస్తున్న ఆచారం. ఆ సింహాసనం మీద కూర్చోగలిగేది రాజు తరవాత గురువే’ అంటూ తారాంగుని రాచకొలువుకు రప్పించటానికి కారణం చెప్పాడు.

‘యువరాజు పట్టాభిషేకానికి మీరే మంచిరోజు నిర్ణయించాలి. అంతేకాదు, దగ్గరుండి ఆ కార్యక్రమాన్ని ఎలాంటి లోటూ లేకుండా విజయవంతంగా మీరే జరిపించాలి’ అని కోరాడు. తారాంగుడు సరేనని సంతోషంగా ఒప్పుకొని అప్పటికప్పుడే మంచి ముహూర్తాన్ని నిర్ణయించాడు. ‘ప్రభూ! మా శశాంకుడు మీ కొలువులో చాలాకాలంగా ఉన్నాడు. కాస్త పిలిపించగలరు. చూడాలని ఉంది’ అన్నాడు.

మిత్రుడికి లభిస్తున్న విశేష గౌరవ మర్యాదలను సభలో దూరం నుంచి చూసి ఆనందిస్తున్న శశాంకుడు ముందుకు వచ్చాడు. సింహాసనం మీద నుంచి లేచి వచ్చి తారాంగుడు ఆనందంగా ఆలింగనం చేసుకుని మిత్రుడి యోగ క్షేమాలనడిగాడు. తారాంగుని మిత్ర వాత్సల్యానికి రాజు ఎంతో సంతోషించాడు. శశాంకుడిలో పశ్చాత్తాపం కలిగింది. గురు స్థానం గురించి తక్కువ అంచనా వేశాను. తల్లీతండ్రి తరవాత పెద్దలు గురువుకే అత్యున్నత స్థానం ఇచ్చారు. తను ఆరోజు సరిగా ఆలోచించలేదు. కచ్చితంగా గురువు స్థానం అద్వితీయమైంది. అందుకే రాజుగారి సింహాసనం మీద కూర్చొనే భాగ్యం దక్కింది. అయినా తన మిత్రుడేగా ఆ స్థానంలో ఉన్నాడు. తనకు అంతకంటే మించిన ఆనందం ఏముందనుకుని తృప్తి పడ్డాడు. రాజుగారు కోరినట్లే యువరాజు పట్టాభిషేకాన్ని దగ్గరుండి విజయవంతం చేశాడు తారాంగుడు.

- గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని