రాజుకు కనువిప్పు!

అవంతీపుర రాజ్యానికి విద్యాధరుడు రాజు. రాజుల్లోకెల్లా గొప్ప వ్యక్తిగా పేరు సాధించాలని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉండేవాడాయన. అందులో భాగంగానే పొరుగు రాజ్యాలపైకి దండెత్తాలని అనుకున్నాడు. ఆయా దేశాధినేతలను ఓడించి.. తన రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు.

Published : 25 Sep 2022 00:16 IST

అవంతీపుర రాజ్యానికి విద్యాధరుడు రాజు. రాజుల్లోకెల్లా గొప్ప వ్యక్తిగా పేరు సాధించాలని ఎప్పుడూ ఆరాటపడుతూ ఉండేవాడాయన. అందులో భాగంగానే పొరుగు రాజ్యాలపైకి దండెత్తాలని అనుకున్నాడు. ఆయా దేశాధినేతలను ఓడించి.. తన రాజ్యాన్ని విస్తరించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా సమీప రాజ్యం చంద్రగిరిని ఆక్రమించాలని అనుకొని, ఆ రాజు పల్లవ వర్మపైన యుద్ధాన్ని ప్రకటించాడు. ‘విజయమా.. లేక మాకు దాసోహమా.. ఏది కావాలో తేల్చుకో పల్లవ వర్మా?’ అంటూ చంద్రగిరికి సందేశం పంపించాడు. ‘రాజా.. మన సైనిక బలం తక్కువగా ఉంది. ఈ సమయంలో యుద్ధానికి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదేమో!’ అని విద్యాధరుడితో అన్నాడు మంత్రి సులోచనుడు.

‘మన సైనిక బలం మీద నాకు నమ్మకం ఉంది. అనవసరంగా ఆందోళన పడకండి’ అని మంత్రి మాటలను పట్టించుకోలేదు విద్యాధరుడు. తనకున్న పరిమిత సైనిక బలంతోనే పల్లవ వర్మ మీదకు దండెత్తాడు. చివరకు విజయం సాధించాడు. కానీ, యుద్ధం ద్వారా విద్యాధరుడు తన రాజ్యంలో సైనిక బలం బాగా తక్కువ ఉందని, మంత్రి మాటలు నిజమేనని గ్రహించాడు. అందుకే.. వెంటనే సైనిక బలాన్ని పెంచేందుకు సమాలోచన చేయమని మంత్రికి సూచించాడు. అప్పుడు మంత్రి ‘మహారాజా.. సైన్యంలోకి వచ్చేందుకు యువతకు మనం అండగా నిలవాలి. వారి కుటుంబానికి భద్రతనిచ్చేలా భరోసా ఇవ్వాలి. ఆర్థిక రక్షణ కల్పించాలి’ అని అన్నాడు మంత్రి.

మంత్రి మాటలను విద్యాధరుడు మరో రకంగా అర్థం చేసుకున్నాడు. ‘మంత్రీ.. మన రాజ్యంలో పన్నెండు సంవత్సరాలు దాటిన అబ్బాయిలందరూ కచ్చితంగా సైన్యంలో చేరాల్సిందేనని ఆజ్ఞ జారీ చేయండి. చేరని పక్షంలో శిక్షలు తప్పవని హెచ్చరించండి’ అని ఆదేశించాడు రాజు. ‘రాజా.. సైన్యంలోకి రావాలంటే అభిరుచి ప్రధానం. అది అందరికీ ఉండకపోవచ్చు. అయినా, అందుకు వయసు కూడా సహకరించాలి. బొత్తిగా పన్నెండేళ్లు అంటే మరీ చిన్నవారు అవుతారు. మరొక్కసారి మీ నిర్ణయంపై ఆలోచించండి’ అని కోరాడు మంత్రి. మంత్రి మాటలు విద్యాధరుని చెవికెక్కలేదు. ‘ఇది నా మాట. నా మాటే శాసనం. సలహాలివ్వడం ఆపి, చెప్పిన పని చేయండి’ అని కోపంగా అన్నాడు. రాజు మాటలకు ఎదురు చెప్పలేక ‘చిత్తం.. మహారాజా’ అంటూ వెళ్లిపోయాడు మంత్రి.  
వారానికోసారి వన విహారానికి వెళ్లడం రాజుకు ఇష్టం. ఆ అలవాటులో భాగంగా ఒకరోజు అడవికి వెళ్లాడు రాజు. అక్కడకు ముందుగానే చేరుకున్న సులోచనుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. అక్కడ చెరువు ఒడ్డున రంగురంగుల సీతాకోకచిలుకలు చక్కగా ఎగురుతూ.. పూల మొక్కల మీద వాలుతూ ఎంతో అందాన్ని, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. విద్యాధరుడు వాటిని చూస్తూ ఎంతో సంతోషిస్తున్నాడు. అంతలోనే ఆయన దృష్టి.. అక్కడే దూరంగా ఉన్న మంత్రి మీద పడింది. అక్కడ సులోచనుడు గొంగళి పురుగులను బలవంతంగా చిన్న చిన్న చిల్లులున్న పెట్టెలో బంధిస్తూ.. ‘మీరు త్వరగా సీతాకోకచిలుకలుగా మారిపోవాలి. ప్రకృతి అందాన్ని పెంచాలి. రాజుగారికి మరింత ఆనందాన్ని కలిగించాలి’ అని గట్టిగా అంటున్నాడు.

రాజు వెంటనే.. ‘మంత్రీ.. మీరు చేస్తున్న పని చూస్తుంటే విచిత్రంగా అనిపిస్తోంది. నవ్వు కూడా వస్తోంది. మీరు అరిచినంత మాత్రాన.. నా ఆనందం కోసం అవి వెంటనే సీతాకోకచిలుకలుగా మారిపోతాయా? అందుకు పరిపక్వత అవసరమని మీకు తెలియదా?’ అని అన్నాడు. ‘అలా అనకండి మహారాజా! ఆసక్తితో పనిలేకుండా పన్నెండేళ్లు దాటిన వారిని సైన్యంలోకి బలవంతంగా తీసుకుంటున్నాం. అక్కడ అవసరం లేని పరిపక్వత ఇక్కడ ఎందుకు? మీరు చెప్పిన బాటలోనే నడుస్తున్నాను’ అన్నాడు సులోచనుడు. మంత్రి మాటలు.. రాజును ఆలోచనలో పడేశాయి. పరిపక్వత లేకుండా చేసే పని, సరైన ఫలితం ఇవ్వదని గ్రహించాడు. తన నిర్ణయం మార్చుకున్నాడు. పాతికేళ్లు దాటి, ఆసక్తి ఉన్నవారినే సైన్యంలోకి రావాలని ప్రకటించాడు. రాజులో వచ్చిన మార్పును చూసి సంతోషించాడు మంత్రి.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని