Updated : 28 Sep 2022 00:28 IST

తన దాకా వస్తే కానీ...!

దిలీప్‌ వాళ్ల ఇంట్లో ‘స్పార్క్‌’ అనే చలాకీ పెంపుడు కుక్క ఒకటి ఉండేది. ప్రతి ఉదయం బడికి వెళ్లే ముందు దాన్ని వాకింగ్‌ కోసం పార్కుకు తీసుకెళ్లేవాడు. అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో ఉన్న తమ ఫ్లాట్‌ నుంచి స్పార్క్‌ని రోజూ లిఫ్ట్‌లో తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో లిఫ్ట్‌లోని వారు, స్పార్క్‌ని చూసి భయపడేవారు. కొద్దికొద్దిగా పక్కకు జరిగి బిగబట్టుకొని నిలబడేవారు. కొందరు మూతులు ముడుచుకునే వారు.. మరికొందరు అసహ్యించుకునేవారు.

దిలీప్‌కి మాత్రం వాళ్లను చూస్తే చాలా కోపం వచ్చేది. అందమైన, బుజ్జి స్పార్క్‌ని చూసి వారెందుకు భయపడతారో.. ఎందుకు అసహ్యించుకుంటారో అర్థమయ్యేది కాదు. ‘సొంత ఫ్లాట్‌లో అంత మాత్రం స్వాతంత్య్రం లేకపోతే ఎలా?’ అని తరచుగా అమ్మతో అనేవాడు. వేల రూపాయలు ఖర్చు చేసి, విదేశాల నుంచి తెప్పించుకున్న స్పార్క్‌ విలువ వారికి తెలియదని తిట్టిపోసేవాడు. మిగతావారు ఇబ్బంది పడుతుంటే.. పప్పీని లిఫ్ట్‌లో తీసుకెళ్లడం మంచిది కాదని అమ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు.

అది లిఫ్ట్‌లో రాజాలా ఎక్కి దిగుతూ ఉంటే ఆనందపడేవాడు దిలీప్‌. భయపడే వారిని చూసి లోలోపల సంతోషపడేవాడు. తాము ఇలా పెంచుకోవడం చూసి వాళ్లంతా కుళ్లుకుంటున్నారని అనుకునేవాడు. కొన్ని రోజుల తర్వాత అమ్మతో కలిసి పట్టణానికి దూరంగా ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగే ఫంక్షన్‌కి వెళ్లాడు దిలీప్‌. ఎనిమిదో అంతస్తులో కార్యక్రమం పూర్తి అయ్యాక.. తల్లీకొడుకులిద్దరూ లిఫ్ట్‌ ఎక్కారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ బటన్‌ నొక్కేలోపు ఇంటర్‌ చదివే ఒకమ్మాయి వచ్చి తలుపునకు చేయి అడ్డం పెట్టి లోపలికి వచ్చింది.

ఆమె తన పెంపుడు కుక్కను సాయంత్రపు నడకకి తీసుకువెళ్తోంది. నల్లటి రంగు, నాలుగు అడుగుల ఎత్తు, పదునైన దంతాలతో, తోక ఆడిస్తూ దిలీప్‌ వైపు తీక్షణంగా చూసింది. ఆ చూపులకు దిలీప్‌కి భయం పట్టుకుంది. కొన్ని సెకన్ల తర్వాత ‘భౌ భౌ’ అంటూ అతడి మీదికి ఎగిరింది. ‘గొలుసు గట్టిగా పట్టుకోండి’ అని ఆ అమ్మాయి వైపు చూస్తూ అరిచాడు దిలీప్‌. ‘భయపడాల్సిన అవసరం లేదు. అది మా ఇంట్లో.. మాతో పాటు ఉండేదే.. అయినా మొరిగే కుక్క కరవదంటారు కదా’ అని సర్దిచెప్పింది ఆ అమ్మాయి. ‘అలాగని కుక్క దగ్గరికి వస్తుంటే చూస్తూ ఊరకుంటామా?’ అని గట్టిగా అరిచాడు దిలీప్‌.

ఇంతలో అది అతడి దగ్గరికి వచ్చి వాసన చూడసాగింది. గట్టిగా కళ్లు మూసుకుని అమ్మ చేతిని బిగించి పట్టుకున్నాడు దిలీప్‌. చిన్నగా లిఫ్ట్‌ మూలకు జారుకున్నాడు. అయినా, అది దిలీప్‌ని వదల్లేదు. ఇంకా దగ్గరికి వచ్చి వాసన చూసింది. నాలుకతో కాలిని నాకింది. ‘ఎక్కడ కరుస్తుందో... కాలి కండ ఎక్కడ పీకేస్తుందో..’ అని మనసులో అనుకుంటూ గజగజా వణికాడు. ‘కుక్క కాటుకు బొడ్డు చుట్టూ ఎన్ని సూదులు వేసుకోవాల్సి వస్తుందో..!’ అనే ఆలోచన రావడంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఒంటరిగా చీకటి గదిలో బంధించి, వేట కుక్కను మీదికి వదిలినట్లు ఊపిరి కూడా సరిగ్గా ఆడలేదు. లిఫ్ట్‌లో రెండు నిమిషాల్లో ఎనిమిది అంతస్తులు దిగడం అనేది సప్తసముద్రాలు ఈదినట్లు అనిపించింది దిలీప్‌కి. ‘అది ఏమీ చెయ్యదు కన్నా.. భయపడకుండా కళ్లు తెరిచి చూడు’ అని అమ్మ ఎంతగా చెబుతున్నా.. తను మాత్రం బిగుసుకుపోయి అలాగే నిల్చుండిపోయాడు.

ఇంతలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ రావడంతో ఒక్కొక్కరుగా అందరూ దిగేశారు. పక్కనే ఉన్న అమ్మ ధైర్యం చెప్పింది. బిగుసుకున్న బాబు చేతులను విడిపించి.. కళ్లు తెరిపించి లిఫ్ట్‌ నుంచి బయటకు తీసుకువచ్చింది. అమ్మ మెల్లగా కొడుకు భుజం తడుతూ.. ‘ఎవరి కుక్క వాళ్లకి ముద్దుగానే ఉంటుంది. ఇతరులకు కూడా ఉండాలని లేదు కదా. వాటిని చూసి జడుసుకునే వాళ్లు కూడా ఉంటారు. ఎంత విలువైనవైనా, అరుదైన జాతివైనా.. విదేశాల నుంచి తీసుకొచ్చినా.. లిఫ్ట్‌లో అందరితోపాటు తీసుకెళ్తే పక్క వాళ్లకి దాదాపు అసౌకర్యంగా ఉంటుంది. అత్యవసరాల్లోనో, ఎవరూ లేనప్పుడో అయితే సరే..’ అని నొచ్చుకోకుండా చెబుతూ దిలీప్‌ని ఇంటికి తీసుకొచ్చింది. ఆరోజు మొత్తం కాస్త ముభావంగానే గడిపిన దిలీప్‌.. మరుసటి రోజు స్పార్క్‌ని మార్నింగ్‌ వాక్‌కి తీసుకెళ్లాడు. కానీ, లిఫ్ట్‌లో కాకుండా మెట్ల మీద నుంచి వెళ్లడం చూసి ‘ఎంతైనా తనదాకా వస్తే కానీ తెలియదు’ అని మనసులోనే అనుకుంది అమ్మ.

- ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని