Published : 01 Oct 2022 00:12 IST

సరైన ఎంపిక!

‘సమర్థులు, తెలివైన వారిని నమ్ముకుంటేనే పనులు చక్కగా జరుగుతాయి. ముందూవెనకా ఆలోచించకుండా.. ఎవరికో ఒకరికి పనులు అప్పగిస్తే కష్టాలపాలవుతాం. ఆ పనులు కాకపోగా, మనం నష్టపోవాల్సి వస్తుంది. దీనికి ఉదాహరణగా మీకో కథ చెబుతా’ అంటూ తన చుట్టూ చేరిన పిల్లలతో అన్నారు టీచర్‌ విద్యావతి. ‘చెప్పండి.. చెప్పండి’ అని ఎంతో ఆసక్తిగా అడిగారు ఆ పిల్లలందరూ. టీచర్‌ కథ చెప్పడం మొదలు పెట్టారు.

ఒక చెరువు పక్కనున్న చిట్టడవిలో ఓ కుందేలు చక్కగా ఆడుకుంటూ.. దొరికిన పండ్లు, కాయలూ తింటూ రోజూ ఆనందంగా గడిపేది. ఒకరోజు అది చెరువు గట్టు మీదుగా వెళుతుంటే.. దానికి అందులో నివసించే రెండు బాతులు పరిచయం అయ్యాయి. అవి తాము నీటిలో చేపల్ని ఎలా పట్టుకునేది.. ఎలా తినేది.. నీటిలో ఈత ఎలా కొట్టేదీ.. తదితర విషయాలను ఆసక్తికరంగా చెప్పేవి! అవి ఎప్పుడు కుందేలును కలిసినా.. వేరే మాటలు మాట్లాడేవి కావు. కేవలం చేపల రుచి, తమ వేట నేర్పు గురించి మాత్రమే మాట్లాడేసరికి.. కుందేలుకు వాటి మీద నమ్మకం ఏర్పడింది. బాతులను అది మంచి స్నేహితులుగా భావించింది.

ఇలా ఉండగా.. ఒకరోజు కుందేలు చెరువు అవతలి ఒడ్డుకు వెళ్లి, అక్కడి విశేషాలను చూడాలనుకొంది. ఆ విషయం బాతులతో చెప్పింది. ‘ఓ.. అదెంత పని మిత్రమా.. మేముండగా నీకు భయమెందుకు? మేమిద్దరం చెరువు అవతలి గట్టుకు తీసుకెళ్తాం. నీ ముందరి కాళ్లు ఒకరి మీద, వెనుక కాళ్లు మరొకరి మీద పెట్టు. ఇద్దరం కలిసి నిన్ను జాగ్రత్తగా అవతలి ఒడ్డుకు చేరుస్తాం. అక్కడ నువ్వు చూడాల్సినవన్నీ తనివితీరా చూశాక.. మరలా మేమిద్దరమే నిన్ను ఈ ఒడ్డుకు చేరుస్తాం’ అని హామీనిచ్చాయా బాతులు. ఆ మాటలతో బాతులకు కృతజ్ఞతలు చెప్పి, రేపు ఉదయాన్నే వస్తానని వెళ్లిపోయింది కుందేలు.

తెల్లవారగానే చెరువు దగ్గరకు వచ్చింది కుందేలు. ముందురోజు బాతులు చెప్పినట్టే వాటి మీదకు ఎక్కింది. అవి కబుర్లు చెబుతూ అవతలి ఒడ్డుకు ప్రయాణం ప్రారంభించాయి. ఆ కబుర్లన్నీ చేపల రుచి, రంగు, వేట చుట్టూనే తిరగసాగాయి. అవి అలా మెల్లగా చెరువు మధ్యలోకి వచ్చాయి. అక్కడ బాతులకు ఎర్రగా మిలమిల మెరిసే చేపలు కనబడ్డాయి. అలాంటి వాటిని ఆ చెరువులో ఇంతకుముందు చూడకపోవడంతో నోరెళ్లబెట్టాయవి. ఆ ఎర్రని చేపల ఆకర్షణకు లోనైన అవి.. తమ పనిని మరిచిపోయాయి. ఒక్కసారిగా వాటి ముక్కుల్ని నీటిలో ముంచి.. చేపలను అందుకున్నాయి.

ఈ క్రమంలో వాటి మీదున్న కుందేలు.. నీళ్లలో పడిపోయి హాహాకారాలు చేయసాగింది. మళ్లీ బాతులు దాని దగ్గరకు వచ్చినా, కుందేలు వాటి మీదకు ఎక్కలేకపోయింది. అప్పుడే అక్కడకు వచ్చిన తాబేలు.. కుందేలు అవస్థను గమనించింది. ‘అయ్యో.. కుందేలన్నా.. బాతుల్ని నమ్ముకున్నావా? అవి చేపలు కనబడితే ఇంకేం ఆలోచించవు. జాగ్రత్తగా నా వీపు మీద ఎక్కు. నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెబితే నేనే స్వయంగా తీసుకెళ్తా’ అంది తాబేలు. బతుకుజీవుడా అనుకుంటూ జాగ్రత్తగా దాని డొప్ప మీదకు ఎక్కి అవతలి ఒడ్డుకు చేరింది కుందేలు. అక్కడ ఓ గంట గడిపిన తరువాత తిరిగి ఇవతలి ఒడ్డుకు చేరుకోవాలని చెప్పింది. ‘తప్పకుండా కుందేలన్నా.. నిన్ను సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాను’ అని హామీనిచ్చింది తాబేలు. ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చి.. రక్షించింది కాబట్టి, దాన్ని పూర్తిగా నమ్మింది కుందేలు.

సూర్యాస్తమయం కావొస్తుండటంతో తాబేలు సహాయంతో కుందేలు మళ్లీ చెరువు ఇవతలి ఒడ్డుకు వచ్చింది. బాతులు కబుర్లు చెప్పడానికి మరలా వచ్చాయి. ‘మిత్రులారా.. మీ గురించి పూర్తిగా తెలియకుండానే మీ మాటలు నమ్మాను. అందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అది కూడా ఒకరకంగా నాకు మంచే చేసింది. నాకు కొత్తగా తాబేలు మిత్రుడు దొరికాడు. ఇక మీదట మీరు నాకు కబుర్లు మాత్రమే చెప్పండి. నేను అవతలి గట్టుకు వెళ్లాలంటే, తాబేలు సహాయం చేస్తానంది’ చెప్పింది కుందేలు. ‘పొరపాటు మాదే. మమ్మల్ని క్షమించు. ఇకమీదట నిన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టం’ అని చెప్పి చెరువులోకి వెళ్లిపోయాయి బాతులు.

‘చూశారా.. బాతులు సమర్థమైనవని అనుకొని నమ్మితే.. కుందేలు ప్రాణాలకే ఆపద వచ్చింది. ఏదో కుందేలు అదృష్టం బాగుండి.. అంతకుముందు ఏ పరిచయం లేకపోయినా, తాబేలు అండగా నిలబడింది. కథ బాగా అర్థమైంది కదా.. ఇకనుంచి మీరు కూడా ఏ పని చేసే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి పిల్లలూ..’ అంటూ కథ ముగించారు విద్యావతి టీచర్‌.

- కంచనపల్లి వెంకట కృష్ణారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని