Published : 02 Oct 2022 01:18 IST

మీరే కారణం.. కాదు మీరే..!

శంఖవనం అడవిలో ఉండే జంతువులన్నీ కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి. శాకాహార జీవులను మాంసాహార జంతువులు అత్యవసర పరిస్థితుల్లోనే వేటాడేవి. ఇది ఆ అడవిలోని కట్టుబాటు. దీన్ని అతిక్రమించిన వారికి మృగరాజు మరణ దండన విధించేవాడు. ఆ అడవిలో ఉండే మొక్కలు గుబురుగా, చెట్లు ఎత్తుగా పెరగడం వల్ల అక్కడ ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతుండేది. అందువల్ల ఆ అడవి ఎప్పుడూ చల్లగా, మనోహరంగా ఉండేది. అక్కడ చెట్లు ‘మేమే గొప్ప. మావల్లే మీ జంతువుల అందరికీ ఆవాసం లభిస్తుంది. అలానే శాకాహార జీవులకు ఆహారం కూడా మా వల్లే అందుతుంది’ అంటూ వాటి గొప్పలను చెప్పుకొనేవి. అక్కడ ఉండే జంతువులు కూడా ఏమాత్రం తగ్గకుండా ‘మీకంటే మేమే గొప్ప. ఎందుకంటే, మిమ్మల్ని తింటూ ఉంటే, కనీసం రక్షించుకోలేరు. కానీ, గొప్పలు మాత్రం చెప్పుకొంటుంటారు’ అంటూ ఎగతాళి చేసేవి.

అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఆ అడవిలోకి ఒక ఖడ్గమృగం వచ్చింది. అది ‘నాకు ఎవరూ లేరు. మావాళ్లలో కొందరు వేటగాళ్ల చేతిలో, ఇంకొందరు అనారోగ్యంతో చనిపోయారు. ఒంటరిదాన్ని కావడంతో సరైన ఆవాసం కోసం వెతుక్కుంటూ వస్తున్నా. పచ్చగా ఉన్న మీ అడవిలో నన్ను ఉండనివ్వండి’ అని సింహాన్ని వేడుకోవడంతో అది సరేనంది. అప్పటి నుంచి ఖడ్గమృగం అడవిలోనే ఉండసాగింది. అయితే, అనుకోకుండా ఆ ఖడ్గమృగం వచ్చిన రోజు నుంచి అడవిలో దుర్వాసనలు రావడం మొదలైంది. ‘అదిగో ఈ దుర్వాసనకు మీ జంతువులే కారణం. మీరు శుభ్రంగా ఉండరు. అదీకాక ఈ మధ్యనే వచ్చిన ఖడ్గమృగం వల్లే అనుకుంటా ఈ వాసనలు! ఎవరిని పడితే వారిని ఈ అడవిలోకి అనుమతిస్తాడు మీ మృగరాజు’ అంటూ చులకనగా మాట్లాడాయి చెట్లు.

‘మా జంతువుల వల్ల అలా ఏమీ జరగదు. మీరే కారణం. కొన్ని చెట్లు తెల్లవారుజామున వెలువరించే వాయువుల వల్లే ఈ దుర్వాసన’ అని వాదించాయి జంతువులు. చెట్లు, జంతువులు వాదించుకోవడం చూసిన ఖడ్గమృగం ఆ విషయాన్ని మృగరాజుకు చేరవేసింది. అది వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అక్కడికి చేరుకున్న జంతువులు, పక్షులను ఉద్దేశించి.. ‘మన అడవిలో చెట్లు, జంతువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి. అంతేకానీ, ఇలా ప్రతి చిన్న విషయానికి వాదనలకు దిగడం సరికాదు. అయితే మన అడవిలో కొన్ని రోజులుగా దుర్వాసన వస్తుంది. అసలు ఆ వాయువులు ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించకుండా.. ఇలా ఒకరి మీద మరొకరు నిందలు వేయరాదు. అందుకే ముందు ఆ దుర్వాసన సంగతి తేల్చండి’ అని సింహం అక్కడి నుంచి వెళ్లిపోయింది.

మృగరాజు ఆదేశానుసారం జంతువులన్నీ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందోనని వెతికే పనిలో పడ్డాయి. అలా వెతుకుతూ వెతుకుతూ ఆ అడవికి ఆనుకొని ఉన్న కొండకు చేరింది కాకి. అక్కడో ఊబిని చూసి.. దుర్వాసన అందులోంచే వస్తుందని గుర్తించింది. మిగతా జంతువుల సాయంతో ఆ విషయాన్ని నిర్ధారించుకొని.. మృగరాజుకు వివరించింది. అప్పుడు సింహం.. ‘చూశారా మిత్రులారా.. ఆ వాసన జంతువుల నుంచి కానీ, మొక్కల నుంచి కానీ రావడం లేదు. అనవసరంగా ఒకరిపైన మరొకరు నిందలు వేసుకొని, అడవిలోని ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేశారు. ఈ సృష్టిలో ఎవరి గొప్ప వారిది. ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు’ అని హితబోధ చేసింది. చెట్లు, జంతువులు తమ తప్పు తెలుసుకున్నాయి. ‘మృగరాజా.. మమ్మల్ని క్షమించండి. ఇకనుంచి ఆవేశపడకుండా విషయం తెలుసుకొని మాట్లాడతాం. ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటాం’ అని సింహానికి హామీ ఇచ్చాయి. దుర్వాసనకు తానే కారణమని జంతువులు, చెట్లు వేసిన నిందలు నిజం కావని తేలడంతో ఖడ్గమృగం కూడా ఊపిరి పీల్చుకుంది.

- కళ్ళేపల్లి ఏడుకొండలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts