సరైన ఎంపిక!

వైశాలి రాజ్యానికి విక్రమ వర్మ రాజు. మంత్రిగా సులోచనుడు రాజ్య పాలనలో సహకరించేవాడు. ఆస్థానంలో చిత్రకారుని పదవి ఖాళీ కావడంతో.. కొత్త వ్యక్తిని నియమించాలని మంత్రిని ఆదేశించాడు రాజు.

Published : 15 Oct 2022 00:10 IST

వైశాలి రాజ్యానికి విక్రమ వర్మ రాజు. మంత్రిగా సులోచనుడు రాజ్య పాలనలో సహకరించేవాడు. ఆస్థానంలో చిత్రకారుని పదవి ఖాళీ కావడంతో.. కొత్త వ్యక్తిని నియమించాలని మంత్రిని ఆదేశించాడు రాజు. మంత్రి సులోచనుడు, భటులను పిలిపించి ‘మన ఆస్థానంలో చిత్రకారుని పదవికి ఎంపిక పోటీలు నిర్వహించనున్నామని, రాజ్యంలో ఉన్న చిత్రకారులు రాజాస్థానంలో నిర్వహించే అర్హత పరీక్షకు హాజరవ్వాలని రాజ్యమంతటా దండోరా వేయండి’ అని ఆదేశించాడు. ఆ మేరకు భటులు రాజ్యం మొత్తం తిరిగి చాటింపు వేశారు.

రాజ్యంలో ఉన్న చిత్రకారులు పోటీకి అవసరమైన సామగ్రితో ఆస్థానానికి వచ్చారు. మంత్రి వారిని ఉద్దేశిస్తూ.. ‘చిత్రకారులారా.. ఈ ఎంపిక పరీక్ష చాలా సులువైనది. మీరు మన రాజు గారిని చూసి.. గంట వ్యవధిలో ఆయన చిత్రపటాన్ని గీయాలి. వాటిని ఆ ప్రదర్శన మందిరంలో ఉన్న గోడకు తగిలించాలి. ఎవరి చిత్రం బాగుంటుందో.. వారే రాజాస్థానంలో ఆస్థాన చిత్రకారుడు పదవిని చేపడతారు’ అని వివరించాడు. ఎంపిక నిమిత్తం వచ్చిన చాలామంది చిత్రకారులు.. ‘గంట వ్యవధి సరిపోదు.. ఒక పూట మొత్తం సమయం ఇవ్వండి’ అని అడిగారు. సరేననన్నాడు మంత్రి. ‘ఎవరైతే ముందుగా చిత్రం వేస్తారో, వారు ప్రదర్శన మందిరంలో చివరి మేకుకు తగిలించాలి. అలా ఒక్కొక్కరుగా చివరి మేకు నుంచి ప్రారంభించాలి. ఆఖరున చిత్రం వేసినవాళ్లు మొదటి మేకుకు దాన్ని తగిలిస్తారు’ అన్నాడు.

పోటీదారులందరూ అందుకు అంగీకారం తెలిపి.. రాజు గారిని చూస్తూ చిత్రాలు గీయడం ప్రారంభించారు. వినోదుడు అనే చిత్రకారుడు గంట వ్యవధిలోనే రాజు గారి చిత్రం వేసి ప్రదర్శన మందిరంలో చివర మేకుకు తగిలించి వచ్చాడు. మిగతా వాళ్లు కూడా వరస క్రమంలో మేకులకు అమర్చారు. తన చిత్రపటాన్ని చివరగా మొదటి మేకుకు తగిలించాడు మదనుడు. సభికులు, మంత్రిని వెంట తీసుకెళ్లి ఆ చిత్రాలను వరసగా చూడసాగాడు మహారాజు. ‘అందరూ చాలా అద్భుతంగా గీశారు. నేను ఇంత అందంగా ఉంటానా?’ అని రాజు గారే ఆశ్చర్యపోయారు. చివరి చిత్రం మాత్రం ఆయనతోపాటు సభికులను అంతగా మెప్పించలేకపోయింది. వెంటనే మంత్రితో ‘ఈ చిత్రకారుల ప్రతిభ చూస్తుంటే.. ఎవరిని ఎంపిక చేయాలో అర్థం కావడం లేదు. అందరూ చాలా అద్భుతంగా గీశారు. ఇక మన ఆస్థాన చిత్రకారుడిని మీరే నిర్ణయించాలి’ అని ఎంపిక బాధ్యతను మంత్రి సులోచనుడికి అప్పగించాడు రాజు.

అర్హులను ఎంపిక చేయటం కత్తిమీద సామేనని అనుకున్నారందరూ. కొద్దిసేపటి తరవాత.. మంత్రి సభాముఖంగా ఆస్థాన చిత్రకారుడు పదవికి వినోదుడిని ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ ప్రకటన విని రాజుతోపాటు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. పోటీకి వచ్చిన ఇతర చిత్రకారులు వారిలో వారే గుసగుసలాడుకోసాగారు. ఎంతోమంది చక్కగా మహారాజు చిత్రపటాన్ని గీస్తే, ఎటువంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా పూర్తి చేసిన వినోదుడిని ఎంపిక చేయడంతో అందరూ నోరెళ్లబెట్టారు. సభికుల మనసులోని సందేహాన్ని అర్థం చేసుకున్న రాజు.. ‘మంత్రివర్యా.. ఎటువంటి హంగూ ఆర్భాటాలు లేకుండా.. కేవలం ఆకు పసరులే రంగులుగా ఉపయోగించిన వినోదుడిని ఆస్థాన చిత్రకారుడిగా ఎంపిక చేయడానికి కారణమేంటి?’ అని ప్రశ్నించాడు.

దాంతో వినోదుడు గీసిన చిత్రపటాన్ని సభలోకి తెప్పించాడు మంత్రి. అలాగే, చివరగా చాలా అందంగా మదనుడు గీసిన బొమ్మనూ తీసుకురమ్మన్నాడు. ఆ రెండింటిని చూపుతూ.. ‘మనం రాజుగారి చిత్రపటాన్ని గీయమని ఎంపిక పరీక్ష నిర్వహించాం. వినోదుడు తప్ప మిగిలిన వారందరూ రాజు గారిని యథాతథంగా కాకుండా, ఆయనను మరింత అందంగా చూపే ప్రయత్నం చేశారు. అనవసర రంగులు వాడి, అదనపు హంగులు చేర్చారు. వినోదుడు మాత్రం రాజుగారి యథారూపాన్ని కేవలం ఆకు పసరు రంగులతో గంట వ్యవధిలోనే చిత్రీకరించాడు. ఆస్థాన చిత్రకారుడికి యుద్ధ సమయాల్లో సైనిక వ్యూహాలు అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళికను గీసి సిద్ధం చేసి ఇవ్వడంతోపాటు శత్రు రాజ్య భౌగోళిక పరిస్థితులను అవగాహన చేసుకొని.. తక్కువ సమయంలో, అందుబాటులో ఉన్న వనరులతో చిత్రపటాలు గీసి సైన్యాధికారికి అందజేయాలి. వాటి ఆధారంగా యుద్ధ వ్యూహాలకు పదును పెడతారు. అక్కడ ప్రతిభతోపాటు సమయం కూడా విలువైనదే. ఈ రెండు లక్షణాలు వినోదుడిలో పుష్కలంగా ఉన్నాయి. మరి నా ఎంపిక సరైనదో కాదో మీరే ఆలోచించండి’ అని ముగించాడు.

దాంతో సులోచనడి వైపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ.. ‘మంత్రివర్యా.. మీరు చెప్పింది అక్షర సత్యం. మీ ఎంపిక సరైనదే. చిత్రకారుడు వాస్తవ పరిస్థితిని క్షణాల్లో కళ్లముందు ఉంచగలగాలి’ అన్నాడు. సభలోని వారందరూ కరతాళ ధ్వనులతో వినోదుడి ఎంపికకు ఆమోదం తెలిపారు.     

- మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని