కోతి చేతిలో కొబ్బరికాయ!

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెట్టుపై కోతి, కాకి స్నేహంగా మెలిగేవి. కాకి, తాను అడవంతా తిరిగి వచ్చి ఎన్నెన్నో కబుర్లు చెప్పేది. అలాగే ఎక్కడెక్కడ పండ్ల చెట్లు ఉన్నాయో వాటి గురించి చెప్పి, కోతికి దారి చూపించేది.

Published : 18 Oct 2022 01:13 IST

నగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక చెట్టుపై కోతి, కాకి స్నేహంగా మెలిగేవి. కాకి, తాను అడవంతా తిరిగి వచ్చి ఎన్నెన్నో కబుర్లు చెప్పేది. అలాగే ఎక్కడెక్కడ పండ్ల చెట్లు ఉన్నాయో వాటి గురించి చెప్పి, కోతికి దారి చూపించేది.
కోతి చక్కగా రకరకాల పండ్ల రుచి చూస్తూ.. కాకితో కబుర్లు చెప్పుకొనేది. అయితే కోతికి ‘తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు’ అన్న చందంగా కొంచెం మూర్ఖత్వం ఉండేది. కాకి ఎన్నిసార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకొనేది కాదు. తనకన్నీ తెలుసని అనేది. ఒకరోజు కోతి, కాకితో.. ‘మిత్రమా! నాకు కొబ్బరికాయ తినాలనిపిస్తోంది. కొబ్బరి చెట్లు ఎక్కడున్నాయో చెప్పు, ఒక కాయ తెచ్చుకొని తిందాం’ అంది. కాకి, కోతిని కొబ్బరి చెట్టు దగ్గరకు తీసుకువెళ్లింది. కోతి చకచకా కొబ్బరి చెట్టు ఎక్కి ఒక కాయ కోసింది. కాకితో.. ‘మిత్రమా! ఈ కొబ్బరికాయ పైన పీచు నేను తీయలేను. అదిగో ఎలుగుబంటి వస్తుంది కదా! తీయమని దాన్ని అడుగుదాం’ అంటూ ఎలుగుబంటి దగ్గరకు వెళ్లింది.

‘ఎలుగు మామా! ఈ కొబ్బరికాయ తొక్కతీసి మాకు ఇవ్వవా?’ అని అడిగింది. అప్పుడు ఎలుగుబంటి ‘మరి నాకేమిస్తావు’ అని అడిగింది.

కోతి ఆలోచించి.. ‘నీకు నీళ్లిస్తాను’ అని ఒప్పుకొంది. ఎలుగుబంటి చక్కగా కొబ్బరికాయపై తొక్కను తీసింది. ‘ఇక నేను కొబ్బరి నీరు తాగి నీకు కొబ్బరికాయ ఇస్తా’ అని కోతితో అంది. అప్పుడు కోతి... ‘నీకు కొబ్బరి నీళ్లు ఇస్తానని నేను అనలేదు. అదిగో ఆ కొలనులో ఉన్న నీళ్లు ఇస్తానని అన్నా’ అంటూ నీళ్లు తేవడానికి వెళ్లబోయింది. ఎలుగుబంటి ‘నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు. నాకు ఆ నీళ్లు ఏమి అక్కర్లేదు. ఇదిగో నీ కొబ్బరికాయ’ అంటూ కొబ్బరికాయ పగలగొట్టకుండా ఇచ్చేసింది.

అప్పుడు కాకి, కోతితో... ‘మిత్రమా! ఎలుగుబంటిని కొబ్బరి  నీళ్లు తాగనివ్వు. మనకు కొబ్బరి ముక్కలు దొరుకుతాయి. అవి తిందాం’ అని అంది. అప్పుడు కోతి, కాకిని.. ‘నీకేం తెలియదు, ఊరుకో’ అని కసిరింది. ఒలిచిన కొబ్బరికాయ పట్టుకొని అలా ముందుకు వెళ్లింది కోతి. దారిలో ఏనుగు కనబడింది. కోతి, ఏనుగుతో.. ‘ఏనుగు మామా! ఈ కొబ్బరికాయ పగలగొట్టి ఇవ్వవా’ అని అడగడంతో, ఏనుగు.. ‘నాకేమిస్తావు’ అని ప్రశ్నించింది.

కోతి ‘కొబ్బరినీళ్లు ఇస్తా’ అని అంది. ఏనుగు నవ్వుతూ.. ‘నేను కాళ్లతో కొబ్బరికాయను పగలగొడతా.. అప్పుడు నీరంతా నేలపాలు అవుతుంది కదా! నాకు కొబ్బరి నీళ్లు ఎలా ఇస్తావు? నాకు ఒక కొబ్బరి చిప్ప ఇస్తానంటే పగలగొట్టి నీకిస్తా!’ అని అంది.

కాకి పైనుంచి కోతితో.. ‘ఒప్పుకో.. ఒప్పుకో..’ అని చెబుతుంది. కోతి.. ‘నీ కాకి గోల ఆపు’ అని, ఏనుగుతో.. ‘నువ్వేమీ పగలగొట్టక్కర్లేదు’ అంటూ కొబ్బరికాయ పట్టుకొని ముందుకు వెళ్లింది. ఇంతలో ఆ దారి గుండా తోడేలు వస్తుంది. కాకి పైనుంచి ‘మిత్రమా! ఆ తోడేలును మాత్రం సహాయం అడగకు. అది అసలే జిత్తుల మారి. దాన్ని నమ్మకు’ అని హితవు చెబుతున్నా.. కోతి వినకుండా తోడేలు దగ్గరికి వెళ్లింది. కోతిని చూడడంతోనే తోడేలు..‘కోతి బావా! కొబ్బరికాయ పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు. నాకు ఇవ్వు. చక్కగా పైపెంకు తీసి నీకిస్తా. హాయిగా నీళ్లు తాగి, లోపలి కొబ్బరి తిను’ అని అంది.

తాను అడగకుండానే సహాయం చేయబోతున్న తోడేలును చూసి కోతి ఉబ్బితబ్బిబ్బైపోయి కొబ్బరికాయ ఇవ్వబోయింది. పైనున్న కాకి, కోతితో.. ‘ఇవ్వద్దు.. ఇవ్వద్దు’ అంటుండగానే కోతి పట్టించుకోకుండా తోడేలుకు కొబ్బరికాయ ఇచ్చింది. కొబ్బరికాయ చేతిలో పడగానే తోడేలు పరుగు అందుకుంది. ఏం జరిగిందో కోతి తెలుసుకునేలోపే తోడేలు అదృశ్యమైంది. కోతి బిత్తరపోయి చూస్తుండగా, కాకి.. ‘మిత్రమా! నీకు నేను చెబుతూనే ఉన్నాను. అయినా నా మాట నువ్వు పట్టించుకోలేదు. అక్కడ ఎలుగుబంటికి కొబ్బరి నీళ్లు ఇచ్చి ఉంటే, మనకు కొబ్బరి చెక్కలు దొరికి ఉండేవి. పోనీ ఏనుగుకు ఒక కొబ్బరి చెక్క ఇచ్చి ఉన్నట్లయితే మనకు ఇంకో కొబ్బరి చెక్క మిగిలేది. ఇప్పుడు నేను చెబుతున్నా వినకుండా జిత్తుల మారి తోడేలు మాటలకు పడిపోయి కొబ్బరికాయ మొత్తాన్ని కోల్పోయాం. ఇదంతా నీ మూర్ఖత్వం వల్లే జరిగింది. మన హితులు చెప్పే మాటలు పెడచెవిన పెడితే ఇలాగే జరుగుతుంది’ అని అంది. కోతి కాకిని క్షమాపణ కోరుతూ... ‘ఇకపై నీ మాటను గౌరవించి నడుచుకుంటాను. ఇది కూడా నా మంచికి జరిగిందే అనుకుంటాను’ అంది. తిరిగి చెట్టు దగ్గరకు వచ్చేశాయవి. అప్పటి నుంచి కోతి.. మిత్రుడు కాకి మాటలను గౌరవిస్తూ ఆనందంగా జీవించసాగింది.

- మొర్రి గోపి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని