ఎవరి హద్దులు వారివే!

మృగరాజు దగ్గర ప్రాపకం సంపాదించేందుకు నక్క, తోడేలు తెగ ఆరాట పడుతుండేవి. కోతి మంత్రిగా ఉన్నా, అవసరం లేకపోయినా సలహాలిచ్చి మృగరాజు మన్ననలు పొందే దిశగా అడుగులు వేయడం కూడా ప్రారంభించాయి. మృగరాజు కూడా వాటి సేవలు వినియోగించుకోవడం మొదలు పెట్టింది.

Published : 06 Dec 2022 00:14 IST

మృగరాజు దగ్గర ప్రాపకం సంపాదించేందుకు నక్క, తోడేలు తెగ ఆరాట పడుతుండేవి. కోతి మంత్రిగా ఉన్నా, అవసరం లేకపోయినా సలహాలిచ్చి మృగరాజు మన్ననలు పొందే దిశగా అడుగులు వేయడం కూడా ప్రారంభించాయి. మృగరాజు కూడా వాటి సేవలు వినియోగించుకోవడం మొదలు పెట్టింది. తోడేలు, నక్కలకు అప్పటి నుంచి మృగరాజు నిద్రపోతే కాపుకాయడం మొదలు, అది ఎటుకదిలినా మృగరాజుకు అవసరమైన సామగ్రిని మోసుకుపోవడం వాటికి దినచర్యగా మారింది. ఇప్పుడా పనులు వాటికి తలకు మించిన భారమయ్యాయి. ఏదో ఆశిస్తే ఇంకేదో జరిగిందని వాపోయాయి. ఆ పనులు తప్పించుకొనేందుకు ఒక ఆలోచన చేశాయి. అందులో భాగంగా ఒకరోజు మృగరాజును కలిసి పొగడ్తల జల్లు కురిపించసాగాయి.

‘మృగరాజా! గ్రామాల్లో ఉన్న మానవులు కొన్ని జంతువులను పెంచుకుంటూ వాటి సేవలు వినియోగించుకుంటారు. అది రాజసమని గొప్పగా చెప్పుకొంటుంటారు. సామాన్య మానవులకే అంత దర్పముంటే మీలాంటి మృగరాజుకు ఇంకెంత దర్జా, దర్పం ఉండాలి’ అంటూ ఒక రాయి వేసింది నక్క. ‘నిజమే మృగరాజా, మానవులు కుక్క, గాడిదను పెంచుకొని సుఖాలు అనుభవిస్తున్నారు’ వంత పాడింది తోడేలు.

అక్కడే ఉన్న కోతి వెంటనే నవ్వింది. ‘ఎందుకా నవ్వు?’ గర్జించింది సింహం. ‘వీటి సలహాలు పాటిస్తే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంటుంది’ అని వివరణ ఇచ్చింది కోతి. నక్క మాత్రం కోతి వైపు ఉరిమి చూసింది. సింహం మనసు మారకముందే అప్రమత్తమైన తోడేలు... ‘మృగరాజా! కుక్క విశ్వాసంగల జంతువు. తిండి పెట్టే వారిపై విధేయతతో బతుకుతుంది. అవసరమైతే వాళ్ల కోసం ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి రక్షిస్తుంది. అందుకే మానవులు కుక్కను పెంచుకుంటూ నిశ్చింతగా బతికేస్తున్నారు’ చెప్పింది తోడేలు.

‘ఇందులో యదార్థం లేదా?’ కోతిని అడిగింది సింహం. ‘నూటికి నూరుపాళ్లు నిజమే!’ అంగీకరించింది కోతి. ‘మృగరాజా! గాడిద గొప్పతనం మీకు తెలియాలి. ఎంత బరువునైనా అవలీలగా మోస్తుంది. ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. మానవులు గాడిదను ఉపయోగించుకొని బతుకుబండినే సులభంగా నడిపించేస్తున్నారు’ చెప్పింది నక్క. ‘ఇందులో నిజమెంత?’ కోతిని అడిగింది సింహం. ‘ఇదీ నిజమే’ అంగీకరించింది కోతి. ‘మరెందుకు నవ్వావు?’ అడిగింది సింహం.

‘మనుషులు, మనకు తేడా ఉంది. అందుకే నవ్వాను’ సంజాయిషీ ఇచ్చుకుంది కోతి. ‘మనుషులు, జంతువులను పెంచుకోవడంలో లేని అభ్యంతరం.. జంతువులు జంతువులను పెంచుకోవడంలో తప్పేముంది?’ అడిగింది నక్క. సింహానికి వాటిపై ఆసక్తి కలిగింది. ‘నేను కూడా వాటిని పెంచి, వాటి సేవలను వినియోగించుకుంటాను. కుక్క, గాడిదను ఇక్కడకు తీసుకొచ్చేదెవరు?’ అడిగింది సింహం. కోతి ఆశ్చర్యపోయింది. నక్క, తోడేలు సంతోషపడ్డాయి. అవి ఆ బాధ్యతను నెత్తినేసుకొని గ్రామం బాట పట్టాయి.

రెండు రోజుల తరువాత కుంటుతూ, మూలుగుతూ మృగరాజు చెంత చేరాయి నక్క, తోడేలు. ‘ఆ జంతువులను వెంటబెట్టుకొని వచ్చారా?’ అడిగింది సింహం. ‘అవి అడవిలోకి రామని చెప్పాయి’ మూలుగుతూ అంది నక్క. ‘ఏమిటా కండకావరం? నా పేరు చెప్పలేకపోయారా?’ అడిగింది సింహం. చెప్పగానే... ‘ససేమిరా అన్నాయి’ అంది తోడేలు. ‘నేను కనిపించిన కుక్క దగ్గరకు వెళ్లి మృగరాజు నిన్ను పెంచుకోవాలనుకుంటున్నారు’ అని చెప్పాను.

‘మైదాన ప్రాంతంలో బతికే తాను అడవిలో తిరగలేనని ముఖాన్నే అనేసింది. మంచి ఆహారం రోజూ దొరుకుతుంది ఆశ చూపాను. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడమే మేలంది. కోపం వచ్చి దాడికి దిగాను. భౌ.. భౌ.. అంటూ మొరిగింది. అరిచే కుక్క కరవదనుకున్నాను. అంతే ఇంతలో కుక్కల సమూహం వచ్చి నా పై దాడి చేసింది. దాని ఫలితమే ఈ గాయాలు’ ఉసూరుమంటూ చెప్పింది నక్క.

‘నేనూ అంతే.. ఒక గాడిదను మచ్చిక చేసుకోవడానికి వెళ్లాను. తరతరాల నుంచి మానవులతో అనుబంధం కొనసాగుతోంది. నడమంత్రపు సిరిని నమ్మలేనంది. మీ పేరు చెప్పి బెదిరించాను. వెనుదిరిగింది. భయపడింది కాబోలు అనుకున్నాను. వెనుక కాళ్లతో ఒక్కతన్ను తన్నింది. అల్లంత దూరంలో పడ్డాను’ శరీరాన్ని తడుముకుంటూ చెప్పింది తోడేలు. ‘మృగరాజా! మనం అడవి జంతువులం. మన అలవాట్లు మనకు ఉంటాయి. అవి పెంపుడు జంతువులు. మానవులతో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకున్నాయి. అందుకే వాటి అలవాట్లు మనకు విభిన్నంగా ఉంటాయి. అవి ఇక్కడకు వచ్చి బతకలేవు. మైదానప్రాంతంలో మనం బతకలేం. ఎవరి హద్దుల్లో వాళ్లు ఉంటేనే బతుకు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంటుంది’ నిజాన్ని చెప్పింది కోతి. ‘అవి రాకపోతే ఏమీ?..
నా సేవలు చేయడానికి మీరున్నారుగా, వాటిని విడిచిపెట్టను, దొరికినప్పుడు వాటి అంతు చూస్తాను’ గంభీరంగా అంది మృగరాజు. నక్క, తోడేలు ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి.

బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని