భయమా.. జాగ్రత్తా?

రామరాజు కుటుంబ సభ్యులంతా వనభోజనాలకు వెళ్లారు. ఆటపాటలతో గడిపిన తరువాత ఇంకా సమయం ఉండటంతో పక్కనే ఉన్న కొండ ఎక్కుదామని పిల్లలు అడిగారు. సరేనన్నారు పెద్దలు. కొండ మీద దృశ్యాలను చూడాలనుకున్న వాళ్లంతా దాని మీదకు ఎక్కడం ప్రారంభించారు.

Published : 07 Dec 2022 00:02 IST

రామరాజు కుటుంబ సభ్యులంతా వనభోజనాలకు వెళ్లారు. ఆటపాటలతో గడిపిన తరువాత ఇంకా సమయం ఉండటంతో పక్కనే ఉన్న కొండ ఎక్కుదామని పిల్లలు అడిగారు. సరేనన్నారు పెద్దలు. కొండ మీద దృశ్యాలను చూడాలనుకున్న వాళ్లంతా దాని మీదకు ఎక్కడం ప్రారంభించారు. మిగిలిన వారంతా కిందనే ఉండి అంత్యాక్షరి ఆడసాగారు. మనవళ్ల బలవంతం మీద రామరాజు కూడా కొండపైకి నడక ప్రారంభించాడు. అందరూ ఉత్సాహంగా కొండ ఎక్కేస్తుంటే.. రామరాజు మాత్రం నెమ్మదిగా ఒక్కో అడుగూ వేయసాగాడు. అది చూసిన మనవడు రోహిత్‌, ‘అంత నెమ్మదిగానా ఎక్కడం? కొండెక్కడమంటే భయమా?’ అని అడిగాడు. ‘భయం కాదు. జాగ్రత్త’ అని సమాధానమిచ్చాడు రామరాజు. ‘అబద్ధమాడకు తాతయ్యా.. అది కచ్చితంగా భయమే..!’ అని నొక్కి చెప్పాడు పదో తరగతి చదువుతున్న రోహిత్‌.

అంతా కొండ మీదకు చేరుకున్నాక, చిన్నవిగా కనిపిస్తున్న ఇళ్లను, చెట్లను చూసి సంబరపడ్డారు. ఆకుపచ్చ తివాచీలా పరుచుకున్న పొలాలను చూసి నోరెళ్లబెట్టారంతా. అక్కడికి దగ్గర్లోనే చిన్న జలపాతంలా నీరు పైనుంచి కిందకు జారుతుండటం కనిపించింది వాళ్లకు. వెంటనే రోహిత్‌ తమ్ముడు విశాల్‌.. పరుగెత్తుకుంటూ దాని దగ్గరకు వెళ్లాడు. ఇద్దరూ రామరాజు కొడుకు పిల్లలు. అందులో స్నానం చేద్దామని పిల్లలు అడగడంతో.. పెద్దలు నీటి లోతు పరీక్షించారు. తక్కువ లోతే ఉండటంతో సరేనన్నారు. చెప్పలేని ఉత్సాహంతో నీటిలోకి దిగిన పిల్లలు ఒకరి మీదకు మరొకరు నీళ్లు చల్లుకుంటూ సరదాగా గడిపారు. కాసేపటికి తాతయ్యను కూడా నీళ్లలోకి దిగమని అడిగారు. ‘నాకు చన్నీళ్లు పడవు’ అన్నాడు రామరాజు. అది విన్న రోహిత్‌.. ‘మడుగులో స్నానమంటే తాతయ్యకి భయమనుకుంటా!’ అన్నాడు. ‘నిజమేనా తాతయ్యా?’ అనడిగాడు విశాల్‌.

రోహిత్‌ మాటలు విన్న వాళ్ల నాన్న.. ‘తాతయ్యతో పరాచికాలేమిట్రా.. తప్పు కదూ’ అని గదమాయించాడు. ‘తాతా మనవళ్ల మధ్య ఆమాత్రం సరదా సంభాషణలు  మామూలే లే’ అంటూ కొడుక్కి నచ్చజెప్పాడు రామరాజు. రోహిత్‌ వైపు చూసి.. ‘భయం కాదు.. జాగ్రత్త!’ అన్నాడు రామరాజు. రోహిత్‌ మరేం అనలేదు. కొండ దిగి ఇంటికి వెళుతుండగా.. ‘ఈ సెలవుల్లో సినిమాలు, షికార్లు, వనభోజనాలంటూ తెగ తిరిగారు. రేపటి నుంచి బుద్ధిగా చదువుకోవాలి.. అర్థమైందా?’ అని పిల్లలతో అన్నాడు తండ్రి. అలాగేనని బదులిచ్చాడు రోహిత్‌. విశాల్‌ మాత్రం.. ‘నాకెప్పుడూ ఫస్ట్‌ ర్యాంకే వస్తుంది. ఆ మాటలేవో అన్నయ్యకే చెప్పండి..’ అన్నాడు. రోహిత్‌ చిరాకుగా ముఖం పెట్టి.. ‘నేను కూడా బాగానే చదువుతున్నా. చదువంటే ఆమాత్రం జాగ్రత్త ఉందిలే..’ అని కాస్త గట్టిగా చెప్పాడు. ‘జాగ్రత్తా..? అదే ఉంటే ఇంకా మంచి మార్కులు వచ్చేవి నీకు. అయినా, చదువు విషయంలో ఉండాల్సింది జాగ్రత్త కాదు భయం’ అని సర్దిచెప్పాడు నాన్న. ‘భయం కాదు జాగ్రత్త ఉంటే చాలు. కావాలంటే తాతయ్యను అడుగు నాన్నా’ అన్నాడు రోహిత్‌.

ఇంతలో రామరాజు కల్పించుకొని.. ‘మీ నాన్న చెప్పిందే సరైనది. నీకు ఉండాల్సింది భయం. జాగ్రత్త కాదు’ అని చెప్పాడు. ‘అదేంటి తాతయ్యా.. నీ విషయంలో అయితే జాగ్రత్త. నా విషయంలో అయితే భయమా? ఎందుకా తేడా?’ అనుమానంగా అడిగాడు రోహిత్‌. ‘నాలాంటి పెద్దవాళ్లకు కొండెక్కడం, చన్నీళ్ల స్నానం అంటే భయం కాదు. భయమైతే అసలు మీతో వచ్చేవాడినే కాదు. కొండ ఎక్కే క్రమంలో పట్టు తప్పితే చాలా ప్రమాదం. ఇంకా.. చన్నీళ్ల స్నానం చేస్తే నాకు జలుబు, జ్వరం వచ్చేస్తాయి. అందుకే ముందుజాగ్రత్త అన్నమాట’ అని వివరించాడు తాతయ్య. ‘అది సరే.. మరి నా చదువు విషయంలో జాగ్రత్త అంటే తప్పేం ఉంది?’ గడుసుగా అడిగాడు రోహిత్‌.

‘మీ వయసు పిల్లలకు విచక్షణా జ్ఞానం అంతగా ఉండదు. దేన్ని విడిచిపెట్టాలి.. దేనికి జాగ్రత్త పడాలో తెలియదు. అందుకే.. చదువన్నా, పరీక్షలన్నా భయం ఉండాలని చెబుతుంటారు. చదవకపోతే పరీక్షల్లో జవాబులు బాగా రాయలేనేమో అన్న భయంతో కష్టపడి చదువుతారని, తెలియనివి తెలుసుకుంటారని..’ చెప్పాడు తాతయ్య. ‘అలాగా..’ అని ఆశ్చర్యపోయాడు రోహిత్‌. ‘అంతే కాదు.. కొందరు పిల్లలు ఇంజెక్షన్‌ చేస్తామంటే పారిపోతారు. మరికొందరు పెద్ద కుక్క ఎదురైనా చలించరు. మొదటివారికి భయం ఎక్కువని, రెండో వారికి భయం లేదని మాత్రమే అంటాం. పెద్దవాళ్లిచ్చే పాకెట్‌ మనీ విషయంలో జాగ్రత్తగా ఖర్చు పెట్టమని మాత్రం అనొచ్చు’ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాడు తాతయ్య. ‘అంటే.. విమాన ప్రయాణికులతోపాటు పారాచ్యూట్‌ ఉందంటే.. భయంతో పట్టుకున్నట్టు కాదు. ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకున్నారని అర్థమన్నమాట’ అని రోహిత్‌ చెప్పగానే సరేనన్నట్లు తలూపాడు తాతయ్య. ‘తప్పు జరుగుతుందేమోనని భయపడాలి.. సాహసాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి’ అన్నాడు రోహిత్‌. ‘శెభాష్‌.. తొందరగా అర్థం చేసుకున్నావు.. చదువు విషయంలోనూ అలాగే ఉండాలి. మంచి మార్కులు సంపాదించాలి’ అంటూ భుజం మీద చెయ్యేసి రోహిత్‌ని అభినందించాడు రామరాజు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని