Updated : 15 Jan 2023 00:40 IST

అసలైన సంక్రాంతి!

స్రవంతిక రాజ్యానికి చైతన్య వర్మ రాజు. రాజధాని నగరం అమృతాపురిలో ఏటా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేవారు. జానపద కళాకారులు రాజ్య ప్రజల ముందు ప్రదర్శనలు ఇచ్చేవారు. అన్నదాతలను సన్మానించి, కానుకలు అందజేసేవారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలకు అమృతాపురిని ముస్తాబు చేశారు. వారం రోజులు ముందుగానే రాజధాని నగరం కళాకారులతో సందడిగా మారింది.

ఆ రాజ్యంలోని ఆనందవల్లి అనే గ్రామానికి పెద్ద రామస్వామి. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని ఆ గ్రామానికి కూడా ఆహ్వానం అందింది. అదే విషయం అందరికీ తెలియజేసేందుకు ఆ ఊరి ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశాడు. అందరూ వచ్చారు.
గ్రామపెద్ద వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘అమృతపురిలో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనమని రాజుగారు ఆహ్వానం పంపించారు. అయితే, ఈ ఏడాది మనకు సమృద్ధిగా పంటలు పండాయి. ఏటా జరిగే సంబరాల్లో మనం రాజుగారి గౌరవ సత్కారాలు అందుకొంటున్నాం. ఈసారి వెళ్లేటప్పుడు మనం పండించిన పంటలో కొంత భాగం రాజ్య ధాన్యాగారానికి అందిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే ఈ ఏడాది మన రాజ్యంలోని కొన్ని ప్రాంతాల్లో పంటలు సరిగా పండలేదు. మనకు మాత్రం చక్కని దిగుబడి వచ్చింది. మన దగ్గర ఉన్న దాంట్లో కొంత రాజు గారికి అందిస్తే.. కష్టాల్లో ఉన్నవారికి పంపిణీ చేయవచ్చు’ అన్నాడు.

ఆ మాటలకు అక్కడికి వచ్చిన చాలామంది రైతులు సరేనన్నారు. కానీ, గంగరాజు మాత్రం.. ‘మీరందరూ తీసుకువెళ్లి ఇచ్చినా, నేను మాత్రం ఒక్క ధాన్యం గింజ కూడా పంపేది లేదు’ అని తేల్చిచెప్పాడు. అతడి మాటలకు గ్రామ పెద్దతో సహా అక్కడున్న వారంతా బాధపడినా.. ఒత్తిడి చేయడం భావ్యం కాదని వదిలేశారు.

మరుసటి రోజు దూరపు బంధువు రామయ్య భార్యాపిల్లలతో కలిసి గంగరాజు ఇంటికి వచ్చాడు. అతడు రామయ్యను చూసి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు. క్షేమ సమాచారాలు అడగడంతో.. ‘ఏం చెప్పమంటావు.. ఈ ఏడాది మా ప్రాంతంలో వర్షాలు లేక పంట మొత్తం ఎండిపోయింది. తిండి గింజలు కూడా దొరకని పరిస్థితి. అందుకే మా బాధను చెప్పుకొని నిన్ను సహాయం కోరాలని వచ్చాం’ అన్నాడు.

బంధువు కుటుంబ దీనస్థితి చూసి గంగరాజు బాధపడ్డాడు. ఎలాగైనా రామయ్యకు సహాయం చేయాలనుకున్నాడు. రామయ్య మాటలను గంగరాజు ఇంటి చుట్టుపక్కల ఉన్న రైతులూ విన్నారు. దాంతో ఎవరూ అడగకపోయినా, తమ ఇళ్ల నుంచి ధాన్యాన్ని తెచ్చి బస్తాల్లో నింపి, రామయ్య బండిలో వేయించారు. తన ఇంటికి వచ్చిన బంధువుకు చుట్టుపక్కల ఉన్న రైతులు సహాయం చేయడం గంగరాజుకు చాలా ఆనందం కలిగించింది. అతడు కూడా ఇచ్చిన బస్తాలతో రామయ్య అందరికీ కృతజ్ఞతలు తెలిపి.. ఆనందంగా తిరుగు పయనమయ్యాడు.

ఆ మరుక్షణమే గంగరాజు.. గ్రామ పెద్ద రామస్వామిని కలిసి.. ‘నన్ను క్షమించండి. మనకు పండిన పంటలో కొంత భాగం రాజ్య ధాన్యాగారానికి ఇవ్వాలన్న మీ నిర్ణయాన్ని కాదన్నాను. నా దూరపు బంధువు కష్టం తెలుసుకొని.. చుట్టుపక్కల ఉన్న రైతులు తమకు తోచిన సహాయం చేశారు. అలాగే, మనం కూడా ఈ ఏడాది పంటలో కొంత భాగం రాజు గారికి ఇవ్వడం సముచితం. నేను కూడా నా వంతు సహాయం అందిస్తా’ అని చెప్పాడు.

గ్రామ పెద్ద చాలా సంతోషించాడు. రెండురోజుల తర్వాత సంక్రాంతి సంబరాల్లో పొల్గొనేందుకు ఆనందవల్లి రైతులు ఎడ్లబండ్లలో బయలుదేరారు. అందరికన్నా గంగరాజు బండిలోనే ఎక్కువ ధాన్యం బస్తాలు కనిపించాయి. దీంతో గ్రామస్థులంతా సంబరపడిపోయారు.

రాజధానికి చేరుకున్న తర్వాత, రాజును కలిసి.. తాము తీసుకున్న నిర్ణయాన్ని గ్రామపెద్ద వివరించారు. రాజ్యంలో కరవు ప్రాంతాల ప్రజలకు తిండి గింజలు అందించి పెద్ద మనసు చాటిన రైతులను మహారాజు ఘనంగా సన్మానించాడు. ఆ రైతులకు శిస్తు మినహాయింపునూ ఇచ్చాడు.

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు