దత్తత!

రామాపురం అందమైన చిన్న ఊరు. కొండ మీది ప్రదేశం. అక్కడి ప్రజలందరూ మంచివాళ్లు. అమాయకులు కూడా.ఆ గ్రామాధికారి రంగారావు మాత్రం చాలా చెడ్డవాడు.

Updated : 13 May 2023 06:12 IST

రామాపురం అందమైన చిన్న ఊరు. కొండ మీది ప్రదేశం. అక్కడి ప్రజలందరూ మంచివాళ్లు. అమాయకులు కూడా.
ఆ గ్రామాధికారి రంగారావు మాత్రం చాలా చెడ్డవాడు. ఊరి అభివృద్ధికి రాజుగారిచ్చిన డబ్బును సొంతానికి వాడుకొనేవాడు. ఊరి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. ప్రజలకు ఏ విధంగానూ సహాయపడడు. అక్కడి వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, పదవిని అడ్డం పెట్టుకొని, సొంత పనులు చేయించుకునేవాడు. ఎవరైనా ఎదురు చెబితే.. నానా ఇబ్బందులు పెట్టేవాడు. దాంతో ప్రజలు ఆయనకు ఎదురు చెప్పే ధైర్యం చేసేవారు కాదు.

ఒకసారి ఆ గ్రామంలో నీటి కొరత ఏర్పడింది. కొండ ప్రాంతం కాబట్టి ఆ సమస్య మరింత తీవ్రమైంది. ఉన్న బావులు, చెరువులు ఎండిపోయాయి. కొత్తవి నిర్మించాలన్నా, చాలా లోతు తవ్వితే కానీ నీరు పడని పరిస్థితి. ఉన్నవి బాగు చేయించాలన్నా బోలెడు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇక చేసేది లేక ప్రజలందరూ తమ నీటి సమస్యను గ్రామాధికారికి మొరపెట్టుకున్నారు. ఊరి సొమ్ము మిగులు ఏమీ లేదనీ, రాజుగారిని ధనసహాయం అడుగుతానని జవాబిచ్చాడాయన. అయినా, కొండ ప్రాంతం కావడంతో నీళ్లు పడటం కష్టమనీ ముందే చెప్పేశాడు. ‘కొండ కింద జలధార వినిపిస్తోంది. మేమంతా కలిసి శ్రమదానం చేస్తాం. అందుకు కాస్త పెట్టుబడి పెడితే సరిపోతుంది. రాజు గారు ఇచ్చినప్పుడు ఆ డబ్బు మీరు తీసుకోండి’ అని ఊరి ప్రజలు ఎంత చెప్పినా కూడా గ్రామాధికారి అందుకు అంగీకరించలేదు.

తన వద్ద డబ్బు లేదని తేల్చి చెప్పేశాడు. అంతవరకూ తన పెరట్లోని బావి నీళ్లు వాడుకోమని, బిందెకు కొంత చొప్పున ఇవ్వమని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ‘ఇది అన్యాయం’ అని అందరూ అనడంతో.. ‘నేనేదో ఆశపడి డబ్బు వసూలు చేయడం లేదు. అలా చేయకపోతే నీళ్లను ఇష్టానుసారం వాడి వృథా చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే మనకున్న ఈ ఒక్క ఆధారమూ అడుగంటిపోతుంది’ అన్నాడు. పూర్వం రాజు ఇచ్చిన డబ్బుతోనే తన పెరట్లోని బావిని తవ్వించాడా గ్రామాధికారి. కానీ, ఆ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. అడిగిన వాళ్లకు సొంతంగానే తవ్వించానని చెబుతూ దబాయించేవాడు. దాంతో గత్యంతరం లేక.. కాస్త ఉన్న వాళ్లు డబ్బిచ్చి ఆ బావి నీళ్లనే వాడుకోవడం ప్రారంభించారు. లేనివాళ్లు మాత్రం ఎండలో పక్క ఊళ్లకు ఎడ్లబండ్లలో వెళ్లి, డ్రమ్ముల్లో నీళ్లు తెచ్చుకుంటూ నానా అవస్థలు పడేవారు.

ఇదంతా చూస్తున్నా.. ఆ గ్రామాధికారి ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ కష్టసమయాన్నే అదనుగా భావించి.. నీటి సమస్య పరిష్కారానికి ఆర్థికం సహాయం కోరుతూ రాజుకు లేఖ రాశాడు. ఒకరోజు ఉదయాన్నే రంగారావు పనిమీద పట్టణానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగొచ్చేసరికి.. ఊరంతా హడావిడిగా కనిపించింది. కొందరు చెరువులో పూడిక తీస్తుంటే, మరికొందరు బావుల పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంకొందరేమో జలధార ఉన్న ప్రాంతాల్లో కొత్తవి తవ్వసాగారు. ఆ పనులన్నింటినీ ఒక ధనికుడు, అతడికి సహాయకంగా రాజోద్యోగి ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. వారితో ‘ఏంటి ఇదంతా?’ అని అడిగాడు రంగారావు. అప్పుడు రాజోద్యోగి మాట్లాడుతూ.. ‘గ్రామాధికారిగా మీరు రాసిన లేఖ అందింది. మరికొన్ని ఊళ్ల నుంచి కూడా అవే అర్జీలు వచ్చాయి. కానీ, ఖజానాలో కూడా డబ్బు ఎక్కువ లేదు. దాంతో ఎవరైనా గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు రావాలని రాజు గారు కోరారు. ఆ మేరకు ఈ గ్రామాన్ని పక్కనున్న పట్టణానికి చెందిన ఓ వ్యాపారి దత్తత తీసుకున్నాడు’ అని వివరించాడు.

అంతేకాకుండా.. ‘ఆ ఊరికి తూర్పు దిశగా బండరాళ్ల కింద నూనె నిల్వలు కూడా ఉన్నాయనీ, ఇక్కడి నీరు ప్రజలకూ, ఆ నూనె వనరులు వ్యాపారికీ చెందేలా ఒప్పందం కూడా కుదిరింది. ఆ వ్యాపారి లాభాల్లో సగం ఖజానాకు చెల్లించాల్సి ఉంటుంది’ అన్నాడు రాజోద్యోగి. ‘అయితే, మరి నా పదవి?’ అంటూ అమాయకంగా అడిగాడు రంగారావు. ‘ఊరిని దత్తత తీసుకున్నాక, ఇక మీ అవసరం ఏముంటుంది?’ అన్నాడా ఉద్యోగి. ఆ మాటతో ఆయన కోపం కట్టలు తెంచుకుంది. ‘నీటి కోసం ప్రజలే శ్రమదానం చేస్తున్నారు. అప్పనంగా నూనె వనరులు మాత్రం ఆ వ్యాపారికి కట్టబెడుతున్నారు. ఇక్కడి ప్రజలు అమాయకులు, మంచివాళ్లు. ఈ ఊరి సంపద ఇక్కడి వారికే చెందాలి. ఈ ధనికుడు లాభాన్నంతా ఇక్కడే ఖర్చు పెడతాడని నమ్మకం ఏంటి? గట్టిగా మాట్లాడితే ఈ ఊరిని నేనే దత్తత తీసుకుంటాను. ఇప్పుడే వెళ్లి రాజు గారికి ఈ విషయం చెబుతాను’ అన్నాడు ఆవేశంగా.

‘మీ దగ్గర డబ్బు లేదన్నారు కదా.. మరి దత్తత ఎలా తీసుకుంటారు?’ అని ప్రశ్నించాడా వ్యాపారి. ‘నా తంటాలేవో నేనే పడతాను. ఈ ఊరూ, ప్రజలూ నావాళ్లే..’ అని జవాబిచ్చాడు రంగారావు. కొంత చర్చ తర్వాత.. అంతవరకు పెట్టిన ఖర్చును గ్రామాధికారి నుంచి తీసుకొని వెళ్లిపోయాడా వ్యాపారి. రాజోద్యోగితో కలిసి హడావిడిగా రాజధానికి వెళ్లి ఊరి దత్తత విషయాన్ని ఖరారు చేయించుకున్నాడు. ఆ మరుసటి రోజు నుంచే మరికొంత మంది కూలీలను పెట్టి, చాలా లోతుగా బావులు తవ్వించాడు. జలకళతో చెరువు, బావులు కొత్త శోభ సంతరించుకున్నాయి. కానీ, నూనె జాడ మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో ఉసూరుమన్నాడు. ‘అటు డబ్బూ పోయింది.. పదవీ ఊడింది.. పైపెచ్చు ఊరి సమస్యలూ నా నెత్తిన పడ్డాయి’ అని మనసులోనే అనుకుంటూ దిగులుపడ్డాడా గ్రామాధికారి.

ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని