పొగడ్తా.. అభినందనా?

వైభవపురం జమీందారు దగ్గర ఉత్తముడు అనే వ్యక్తి గుమస్తాగా పనిచేసేవాడు. జమీందారు విశ్వాసాన్ని పొందిన ఉద్యోగుల్లో అతనొకడు. ఒకరోజు ఉత్తముడు, కొడుకు సూర్యను తనతోపాటు దివాణానికి తీసుకెళ్లాడు.

Updated : 06 Jun 2023 05:12 IST

వైభవపురం జమీందారు దగ్గర ఉత్తముడు అనే వ్యక్తి గుమస్తాగా పనిచేసేవాడు. జమీందారు విశ్వాసాన్ని పొందిన ఉద్యోగుల్లో అతనొకడు. ఒకరోజు ఉత్తముడు, కొడుకు సూర్యను తనతోపాటు దివాణానికి తీసుకెళ్లాడు. అతడికి పన్నెండేళ్లు.. చాలా చురుకైనవాడు. వాళ్లిద్దరూ వెళ్లేసరికి జమీందారు ఎవరో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నాడు. జమీందారుకు నమస్కరించి, విధి నిర్వహణలో నిమగ్నమయ్యాడు ఉత్తముడు. కొడుకును తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడే గ్రామస్థుడొకతను వచ్చి జమీందారుకి నమస్కరించి ‘అయ్యా.. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి.. సాయం చేయగలరు’ అని కోరాడు. వెంటనే సిబ్బందిని పిలిచి.. పది రోజులకు సరిపడా బియ్యం అతడికివ్వమని ఆదేశించాడు జమీందారు. దాంతో ఆయనకు నమస్కరించి వెళ్లిపోయాడా గ్రామస్థుడు.

జమీందారు పక్కనున్న ఆ కొత్త వ్యక్తి.. ‘మిమ్మల్ని చూస్తుంటే దేవుడిని చూసినట్టుంది. మీరు మామూలు మనిషి కాదు.. చేతికి ఎముక లేదన్నట్టు దానం చేయడం మీకే సాధ్యం. మీలాంటి దానశీలితో మాట్లాడడం నా అదృష్టం’ అని అన్నాడు. ఆ మాటలకు జమీందారు సంతోషించాడు. అంతటితో ఆగకుండా.. ‘మీరు చేసిన దానధర్మాల గురించి బయటకు తెలియనివ్వకపోవడం నిజమైన గొప్పతనం’ అంటూ ఇంకాస్త పొగిడాడు. జమీందారు సంతోషం రెట్టింపైంది. అంత చిన్న సాయానికి.. అదే పనిగా పొగడటం ఉత్తముడికి నచ్చలేదు. దాంతో పొగుడుతున్న వ్యక్తి వైపు చూస్తూ.. ‘జమీందారు గారికి పొగడ్తలు నచ్చవు. ఇక ఆపండి’ అంటూ వారించాడు. దాంతో ఆ వ్యక్తి ముఖం మాడిపోయింది. ‘అతడిని ఆపి మంచి పని చేశావన్నట్టు’ ఉత్తముడి వైపు మెచ్చుకోలుగా చూశాడు జమీందారు.

కాసేపటికి అక్కడికి కొందరు వ్యక్తులు వచ్చారు. జమీందారుకి నమస్కరించి.. వాళ్లలో ఉన్న మల్లయోధుడిని చూపిస్తూ ‘అయ్యా.. ఇతడి పేరు భీముడు. మొన్న రాజధానిలో జరిగిన మల్లయుద్ధ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు. అంతేకాకుండా తిరుగు ప్రయాణంలో అడవి బాటలో బాటసారులను దోచుకుంటున్న దొంగల ముఠాను కూడా ఎదిరించాడు. ఇతడిని మీ చేతుల మీదుగా సత్కరించాలని తీసుకొచ్చాం’ అన్నారు. వారి మాటలకు జమీందారు సంతోషించి.. ‘భీముడు వంటి మల్లయోధుడు మన దివాణంలో ఉండడం అదృష్టం. అతడి ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నాను. మరెందరో యువకులు అతడిని ఆదర్శంగా తీసుకొని మల్లయోధులు, సైనికులుగా మారాలి. అందుకని భీముడి సన్మానం నాలుగు గోడల మధ్య కాకుండా విశాలమైన వేదిక మీద ప్రజల మధ్య జరిపిద్దాం’ అన్నాడు.

ఉత్తముడు కూడా లేచి నిలబడి.. ‘అవును.. జమీందారు గారు చెప్పినట్టు భీముడి ప్రతిభ గొప్పది. ప్రజల మధ్య సత్కరించడమే సరైన గౌరవం. ఆ సన్మానం చూసి మరెందరో యువకులు ప్రేరణ పొందాలి. భీముడి ధైర్యసాహసాలను వర్ణిస్తూ కవులతో గొప్ప సన్మాన పత్రం తయారు చేయించి బహూకరిద్దాం. ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి మిమ్మల్ని పిలుస్తాం’ అని చెప్పాడు. దాంతో వారంతా సంతోషంగా వెళ్లిపోయారు. ఉత్తముడు తిరిగి ఆసనం దగ్గరకు వచ్చి కూర్చోగానే.. కొడుకు సూర్య ‘నాన్నా.. నాదొక సందేహం. ముందొక వ్యక్తి జమీందారు దానగుణం గురించి మాట్లాడుతుంటే, ఆ పొగడ్తలను ఆపమన్నారు. ఇప్పుడు భీముడి ధైర్య సాహసాలను మీరు అదే పనిగా పొగిడారు. ఎందుకలా?’ అని అడిగాడు. ‘మొదట మాట్లాడిన వ్యక్తిది కేవలం పొగడ్త.. అందుకే వద్దన్నాను. భీముడు గురించి మేము మాట్లాడింది అభినందన. ఇది తప్పు కాదు’ అని సమాధానం ఇచ్చాడు. ‘పొగడ్తకి, అభినందనకి తేడా ఉందా నాన్నా?’ అని మళ్లీ అడిగాడు సూర్య. ‘అవతల వారి నుంచి ఏదైనా ఆశించి లేదా పని జరిపించుకోడానికైనా పొగుడుతారు. నిజానికి జమీందారు గారు చేసిన చిన్న సాయానికి అన్ని పొగడ్తలు అక్కర్లేదని భావించి అతడిని వారించాను’ అని చెప్పాడు.

‘నాకు అభినందన కూడా అలాగే అనిపించింది నాన్నా..’ అన్నాడు కొడుకు. ‘మల్లయోధుల పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన భీముడి ప్రతిభను, బాటసారులను కాపాడడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన అతడి ధైర్యసాహసాలను ప్రశంసించాల్సిందే. సమాజం కోసం పాటుపడే వారిని అభినందించినప్పుడే వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అదీ ఒకలాంటి ప్రోత్సాహమే. అందుకే, మంచి పనికి అభినందన ఎంతో అవసరం. అదే వారిలో ఉత్సాహం పెంచేందుకు, మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు తోడ్పడుతుంది. భీముడిని చూసి మరెందరో స్ఫూర్తి పొందుతారు’ అని వివరంగా చెప్పాడు ఉత్తముడు. ‘అంటే.. పొగడ్త మంచిది కాదా?’ అనడిగాడు సూర్య. ‘గోరంతను కొండంతగా చూపడమే పొగడ్త. అది మనిషి ఎదుగుదలకు అవరోధం. కాబట్టి పొగడ్తలను స్వీకరించకూడదు’ అని బదులిచ్చాడు ఉత్తముడు. ‘ఇప్పుడు నాకు పొగడ్తకి, అభినందనకి తేడా తెలిసింది నాన్నా.. చిన్న చిన్న విషయాలకు లభించే పొగడ్తలకి పొంగిపోకుండా, కష్టపడి చదివి గొప్ప స్థాయికి వెళ్తాను. అప్పుడు మీ నుంచి అభినందన అందుకుంటాను’ అని గొప్పగా చెప్పాడు సూర్య. ఆ మాటలకు కొడుకు తల నిమురుతూ చిరునవ్వు నవ్వాడు తండ్రి ఉత్తముడు.  

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని