అక్కడ బయట భౌ.. భౌ..లు ఉండవు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పిల్లలమైన మనకు భౌ..భౌ..లంటే భలే ఇష్టం కదూ! కానీ కొన్నిసార్లు అవే మనల్ని చాలా భయపెడతాయి. పెంచుకున్న వాటితో పెద్దగా సమస్యలు ఉండవు కానీ.. వీధుల్లో ఉండే భౌ..భౌ..లతోనే అసలు ఇబ్బంది. అవి కొన్నిసార్లు మనల్ని కరిచేస్తాయి.

Published : 04 Jan 2022 00:22 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పిల్లలమైన మనకు భౌ..భౌ..లంటే భలే ఇష్టం కదూ! కానీ కొన్నిసార్లు అవే మనల్ని చాలా భయపెడతాయి. పెంచుకున్న వాటితో పెద్దగా సమస్యలు ఉండవు కానీ.. వీధుల్లో ఉండే భౌ..భౌ..లతోనే అసలు ఇబ్బంది. అవి కొన్నిసార్లు మనల్ని కరిచేస్తాయి. కానీ ఓ దేశంలో ఆ సమస్య లేదు. ఎందుకంటే అక్కడ ఒక్కటంటే ఒక్క వీధి కుక్క కూడా ఉండదు మరి!

ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ వీధి కుక్కలున్నాయి. కానీ నెదర్లాండ్స్‌లో మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించదు. అందుకే ఈ భూమ్మీద వీధి శునకాలు లేని ఏకైక దేశంగా నెదర్లాండ్స్‌ ఘనతను సొంతం చేసుకుంది. ఓ అంచనా ప్రకారం ప్రపంచం మొత్తం మీద సుమారు 20 కోట్ల వీధికుక్కలున్నాయి. ‘మరి నెదర్లాండ్స్‌లో ఎందుకు లేవు? అదెలా సాధ్యమైంది. ముందు నుంచే ఈ రికార్డు ఉందా?..’ మీ మనసులో ఇలాంటి అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి కదూ! వాటన్నింటికి సమాధానమే ఈ కథనం.

ఒకప్పుడు ఇబ్బడి ముబ్బడిగా..

కొన్ని శతాబ్దాల నుంచీ నెదర్లాండ్స్‌లో కుక్కల్ని పెంచుకోవడం సోషల్‌ స్టేటస్‌గా ఉండేది. దాదాపు ప్రతిఒక్కరూ కనీసం ఒక కుక్కనైనా పెంచుకునేవారు. ఈ విషయంలో ధనిక, పేద అనే తారతమ్యం ఉండేది కాదు. డబ్బు ఉన్నవారు వినోదం కోసం, పేదవారు తమకు పనిలో సాయంగా ఉంటాయని కుక్కల్ని పెంచుకునేవారు. అందుకే అప్పట్లో ఆ దేశంలో శునకాల సంఖ్య ఎక్కువగా ఉండేది.

కానీ ఏమైంది అంటే...

‘ఓహో.. అందరూ పెంచుకుంటున్నారు కాబట్టి.. వీధికుక్కలు ఉండవేమో’ అని మీరనుకుంటే తప్పులో కాలేసినట్లే! ఎందుకంటే 19వ శతాబ్దంలో రెబీస్‌ వ్యాధి విజృంభించింది. ఇది కుక్కల ద్వారా ఎక్కువగా వ్యాపించేది. అందుకే చాలా మంది ఈ వ్యాధికి భయపడి తమ ఇళ్లలో పెంచుకుంటున్న కుక్కల్ని రోడ్ల మీదికి విడిచి పెట్టేశారు. దీంతో ఒక్కసారిగా నెదర్లాండ్స్‌లో వీధి కుక్కల సంఖ్య పెరిగిపోయింది.  

మరి ఏం చేశారో తెలుసా!

ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన వీధికుక్కల వల్ల అప్పట్లో నెదర్లాండ్‌లో చాలా సమస్యలు వచ్చాయి. కొంతకాలానికి ‘ఎనిమల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ’ ప్రారంభమైంది. వీళ్లు ప్రజల్లో చైతన్యం కలిగించారు. ప్రభుత్వం కూడా కఠిన నిబంధనలు తీసుకువచ్చింది. జంతుపరిరక్షణ చట్టాలకు పదును పెట్టింది. వాటి హక్కులకు ఎవరైనా భంగం కలిగిస్తే భారీగా జరిమానాలతో పాటు, మూడేళ్ల జైలు శిక్షలు విధించింది. బయట పెట్‌షాపుల్లో అమ్మే కుక్కలపై భారీగా పన్నులు వేసింది. దీంతో కుక్కల్ని పెంచుకోవాలనుకున్నవారు వీధికుక్కలకు ఆశ్రయం కల్పించడం ప్రారంభించారు. యంత్రాంగం కూడా పెద్దఎత్తున కుక్కలకు వ్యాక్సినేషన్‌ చేయించింది. ఈ పనులన్నీ చక్కగా జరగడం కోసం ఏకంగా పోలీస్‌ ఫోర్స్‌నే ఏర్పాటు చేసింది. ఇవన్నీ చక్కటి ఫలితాలిచ్చాయి. నెదర్లాండ్స్‌ జనాభాలో దాదాపు 90 శాతం మంది వీధి కుక్కలను అక్కున చేర్చుకుని ఆశ్రయమిచ్చారు. దాని ఫలితంగానే. ఇప్పుడు నెదర్లాండ్స్‌.. ‘వీధికుక్కల రహిత దేశం’గా నిలిచింది. నేస్తాలూ.. మొత్తానికి అదన్నమాట అసలు సంగతి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని