చకచకా అడిగితే.. టకటకా చెప్పేసింది!

వయసేమో కేవలం అయిదేళ్లు.. చదువుతోంది యూకేజీ..! జనరల్‌ నాలెడ్జ్‌ అంటే చాలా ఇష్టం.. చకచకా ప్రశ్నలు అడిగితే.. టకటకా సమాధానాలు చెప్పేసి అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఎంచక్కా రికార్డూ సాధించేసింది!!

Published : 15 Feb 2022 00:06 IST

వయసేమో కేవలం అయిదేళ్లు.. చదువుతోంది యూకేజీ..! జనరల్‌ నాలెడ్జ్‌ అంటే చాలా ఇష్టం.. చకచకా ప్రశ్నలు అడిగితే.. టకటకా సమాధానాలు చెప్పేసి అందరూ అవాక్కయ్యేలా చేసింది. ఎంచక్కా రికార్డూ సాధించేసింది!!

కేరళ రాష్ట్రంలోని కోచికి చెందిన అనేయకు జనరల్‌ నాలెడ్జ్‌ అంటే చాలా ఇష్టం. తనకు రెండేళ్ల వయసున్నప్పటి నుంచే.. ఎప్పుడూ  కొత్త విషయాలు చెప్పమని అమ్మ అమృతను విసిగించేది. మొదట్లో వాళ్ల అమ్మ పెద్దగా పట్టించుకోలేదు. కానీ క్రమంగా అనేయకు జీకే మీద ఉన్న ఆసక్తి గ్రహించి, చిన్న చిన్న విషయాలు చెప్పడం మొదలుపెట్టింది. అనేయ కూడా చక్కగా నేర్చుకుంది. నేర్చుకోవడమే కాదు.. ఎప్పుడు అడిగినా టక్కున చెప్పేది.

రోజుకు అయిదు చొప్పున!

రోజుకు ఓ అయిదు ప్రశ్నల చొప్పున అమ్మ అనేయకు నేర్పారు. తను చకచకా నేర్చేసుకుని, మరిన్ని అంశాలు నేర్పమనేది. అంత చిన్న వయసులో ఇంత ఆసక్తిని చూసి వాళ్ల అమ్మకు ఆశ్చర్యం వేసింది. అందుకే ఇంకాస్త సమయం తన కూతురు కోసం వెచ్చించింది ఆమె.

మధ్యలో వీలుకాక!

తాను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవడం వల్ల ఓ సంవత్సరం పాటు అనేయ వాళ్ల అమ్మ చిన్నారి మీద దృష్టి సారించలేకపోయింది. మధ్యలో పన్నెండు నెలలు విరామం వచ్చినా చిన్నారి మరిచిపోకుండా చాలా విషయాలు గుర్తు పెట్టుకుంది. మళ్లీ శిక్షణ ప్రారంభించడంతో అన్నీ నేర్చుకుంది. కేవలం మూడు నిమిషాల్లోనే 70 ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్పేసి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించింది. ఎంతైనా ఇంత చిన్న వయసులోనే ఈ ఘనత సాధించడం నిజంగా గ్రేట్‌ కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని