భళా.. ‘తబలా’ బాల..!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. రెండేళ్ల క్రితం కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో మనమంతా చాలారోజులు ఇంట్లోనే ఉన్నాం కదా! అప్పుడెలాగూ తరగతులూ హోంవర్కులూ లేవు కాబట్టి ఎంచక్కా టీవీ చూస్తూనో సెల్‌ఫోన్లో గేమ్స్‌ ఆడుకుంటూనో సరదాగా గడిపేశాం. కానీ, ఓ నేస్తం మాత్రం ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా.

Published : 26 Feb 2022 00:52 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.. రెండేళ్ల క్రితం కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో మనమంతా చాలారోజులు ఇంట్లోనే ఉన్నాం కదా! అప్పుడెలాగూ తరగతులూ హోంవర్కులూ లేవు కాబట్టి ఎంచక్కా టీవీ చూస్తూనో సెల్‌ఫోన్లో గేమ్స్‌ ఆడుకుంటూనో సరదాగా గడిపేశాం. కానీ, ఓ నేస్తం మాత్రం ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా.. తనకిష్టమైన సంగీత వాయిద్యం నేర్చుకుందట. ఇంతకీ ఆ నేస్తం ఎవరో.. ఏం నేర్చుకుందో.. ఏం సాధించిందో తెలుసుకుందాం మరి!

కేరళ రాష్ట్రంలోని కోచికి చెందిన పార్వతి ప్రస్తుతం అయిదో తరగతి చదువుతోంది. తండ్రి ఉన్నికృష్ణన్‌ ప్రైవేటు ఉద్యోగి. ఆయనకు తబలా అంటే ఎంతో ఇష్టం. ప్రతి రోజూ ఇంట్లో సాధన చేస్తుండేవాడట. దాంతో నాన్నను చూస్తూ చూస్తూ పార్వతికి కూడా తబలా వాయించడంపై ఆసక్తి ఏర్పడింది. అలా నాలుగేళ్లుగా తానూ నేర్చుకోవడం ప్రారంభించింది.

లాక్‌డౌన్‌ సెలవుల్లో..
ఈ చిన్నారికి లాక్‌డౌన్‌ సెలవులు బాగా కలిసొచ్చాయి. ఎలాగంటే - ఒక గురువును నియమించుకొని మరీ తబలాలో మెలకువలు నేర్చేసుకుంది. వీటితోపాటు కొన్ని ఆన్‌లైన్‌ క్లాసులకూ హాజరైందట. అలా ప్రతి రోజూ సాధన చేస్తూ.. వాయిద్యంపైన పట్టు సాధించింది పార్వతి. అంటే, ఖాళీ సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుందన్నమాట.  

రికార్డూ సాధించింది
గత నెలలో 46 నిమిషాల 36 సెకన్లపాటు ఏకధాటిగా తబలా వాయించిన ఈ చిన్నారి అందరితో శెభాష్‌ అనిపించుకుంది. అంతేకాదు, పార్వతి ప్రతిభను ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ ప్రతినిధులూ ప్రత్యక్షంగా పరిశీలించారు. చిన్నవయసులోనే ఎక్కువ సమయం తబలా వాయించడంతో బాలిక పేరు మీద రికార్డు కూడా నమోదు చేశారు.

పెద్ద లక్ష్యమే..
‘నీ లక్ష్యమేంటి?’ అని ఎవరైనా పార్వతిని అడిగితే.. ‘హిందూస్థానీ సంగీతం బాగా నేర్చుకొని, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి మ్యూజిక్‌ థెరపీ అందించి.. వారిని మామూలుగా మారుస్తానని’ టక్కున చెబుతోందట. ఈ వయసులోనే భవిష్యత్తు పట్ల ఎంతో కచ్చితంగా ఉన్న పార్వతికి మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా..!!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని