Updated : 19 May 2022 06:12 IST

‘రివర్స్‌’లో భలే రికార్డు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. స్కూల్‌లో టీచరో, ఇంటికొచ్చిన బంధువులో మిమ్మల్ని ‘ఏ, బీ, సీ, డీలు వచ్చా?’ అని అడిగితే.. ‘ఆ వచ్చు’ అని గడగడా చెప్పేస్తాం కదా! ‘అలా వరసగా అయితే ఎవరైనా చెప్పేస్తారు.. రివర్స్‌లో చెప్పండి’ అంటే? - ఒకటో రెండో చెప్పి తడబడతాం.. కానీ, ఓ నేస్తం మాత్రం అందులో ఏకంగా రికార్డే కొట్టేసింది. ఆ వివరాలే ఇవీ.. 

పశ్చిమ బంగా రాష్ట్రంలోని మిడ్నాపూర్‌ జిల్లాకు చెందిన ఆత్రేయి ఘోష్‌కు ప్రస్తుతం అయిదేళ్లు. తండ్రి అనిరుద్ధ అక్కడి పోలీస్‌ శాఖలో పనిచేస్తున్నారు. తల్లి సంపతి గృహిణి. చిన్నతనం నుంచి ఆత్రేయి ఎంతో చలాకీగా ఉండేదట. తనకి జ్ఞాపకశక్తీ ఎక్కువేనట. ఎవరైనా ఏదైనా చెబితే.. గుర్తుపెట్టుకొని టక్కున తిరిగి చెప్పేస్తుండటంతో మొదట్లో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. తర్వాత్తర్వాత తమ కూతురి ప్రతిభను గుర్తించి.. సానబెట్టడం ప్రారంభించారు. 

అవాక్కయ్యేలా..  
అయిదేళ్ల వయసులో పిల్లలంతా బడికి వెళ్లనని మారాం చేస్తూ.. బుడి బుడి అడుగులతో తెగ అల్లరి చేస్తుంటారు. అయితే, అత్రేయి మాత్రం ఏ, బీ, సీ, డీలను నేర్చుకోవడమే కాకుండా వాటిని రివర్స్‌లో చెప్పి ఔరా అనిపించింది. కేవలం 23 సెకన్ల సమయంలోనే ఆంగ్ల వర్ణమాలలోని అక్షరాలను వెనక నుంచి చెప్పి ఇటీవలే ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించింది. ఈ విషయం తెలిసిన వారంతా తనను అభినందిస్తున్నారట. 

ఇతర అంశాల్లోనూ..

ఇదొక్కటే కాదు.. చిన్నారి ఆత్రేయికి పాడటంతోపాటు నాట్యం కూడా వచ్చని తల్లి చెబుతోంది. ‘మరి చదువు సంగతో?’ అని అనుమానం వచ్చిందా - స్కూల్‌లో పెట్టే పరీక్షల్లోనూ ఈ నేస్తం మంచి ప్రతిభే చూపుతోందట. ఆటల పోటీలూ, ఇతర అంశాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది. చిన్నారిలోని ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించిన తల్లిదండ్రులు, ఆమెకు శిక్షణ సైతం ఇప్పిస్తున్నారు. ఈ పాపలా.. ఆల్ఫాబెట్స్‌ని మీరూ రివర్స్‌లో చెప్పగలరేమో ఓసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్‌. అలాగే పనిలో పనిగా ఈ చిన్నారి భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి సరేనా! 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని